Soft Chapati : మనం తరచూ గోధుమపిండితో చపాతీలను తయారు చేసుకుని తింటూ ఉంటాం. కొందరూ ప్రతిరోజూ వీటిని తింటారు. గోధుమపిండితో తయారు చేసే ఈ చపాతీను తినడం వల్ల ఆరోగ్యానికి మేలు కలుగుతుందనే విషయం మనకు తెలిసిందే. చపాతీలను తయారు చేసే విధానం అందరికి తెలిసినప్పటికి కొందరు చపాతీలను మెత్తగా తయారు చేసుకోలేకపోతుంటారు. చపాతీలు చేసినప్పుడు మెత్తగా ఉన్నా సమయం గడిచే కొద్ది చపాతీలు గట్టిగా అవుతుంటాయి. ఎన్ని గంటలైనా మెత్తగా ఉండేలా అలాగే రుచిగా ఉండేలా ఎలా గోధుమ పిండితో చపాతీలను ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం.
చపాతీ తయారీకి కావల్సిన పదార్థాలు..
గోధుమపిండి – రెండు కప్పులు, అరటి పండు – 1, నీళ్లు – 1/3 కప్పు, నూనె – అర కప్పు.
చపాతీ తయారీ విధానం..
ముందుగా ఒక గిన్నెలో అరటి పండును తీసుకుని మెత్తగా చేసుకోవాలి. తరువాత అందులో గోధుమపిండిని, ఒక టేబుల్ స్పూన్ నూనెను వేసి బాగా కలుపుకోవాలి. తరువాత కొద్ది కొద్దిగా నీళ్లు పోస్తూ పిండిని బాగా కలుపుకోవాలి. దీనిని5 నుండి 10 నిమిషాల పాటు బాగా కలుపుకున్న తరువాత దానిపై తడి వస్త్రాన్ని వేసి 15 నిమిషాల పాటు పక్కకు ఉంచాలి. తరువాత మరో టీ స్పూన్ నూనె వేసి మరలా బాగా కలుపుకోవాలి. తరువాత ఈ పిండిని తగిన పరిమాణంలో ముద్దలుగా చేసుకోవాలి. ఇప్పుడు ఒక్కో ముద్దను తీసుకుని పొడి పిండి చల్లుకుంటూ చపాతీలా వత్తుకోవాలి. తరువాత ఈ చపాతీపై ఒక టీ స్పూన్ నూనె వేసి చపాతీ అంతా వచ్చేలా బాగా రుద్దుకోవాలి. తరువాత చపాతీపై మడత మడతకు నూనె రాస్తూ నాలుగు మడతలుగా వచ్చేలా చేసుకోవాలి. ఇలా అన్నింటిని తయారు చేసుకున్న తరువాత ఒక్కో చపాతీ ముద్దను తీసుకుని నూనె రాసుకుంటూ మరలా చపాతీలా వత్తుకోవాలి.
ఇప్పుడు స్టవ్ మీద పెన్నాన్ని ఉంచి వేడి చేయాలి. పెనం బాగా వేడయ్యాక వత్తుకున్న చపాతీని వేసి కాల్చుకోవాలి. దీనిని ముందుగా ఒకవైపు కాల్చుకుని పొంగిన తరువాత మరో వైపుకు తిప్పాలి. తరువాత నూనె వేసి చపాతీ అంచులను వత్తుకుంటూ రెండు వైపులా కాల్చుకుని ప్లేట్ లోకి తీసుకోవాలి. ఇలా చేయడం వల్ల రుచిగా ఎంతో మెత్తగా ఉండే చపాతీలు తయారవుతాయి. ఈ చపాతీను కాల్చుకోవడానికి నూనె కొద్దిగా ఎక్కువగా పడుతుంది. అలాగే పెనం బాగా వేడైన తరువాతే చపాతీని వేసి కాల్చుకోవాలి. ఇలా చేయడం వల్ల చపాతీలు రుచిగా ఉండడంతో పాటు ఎన్ని గంటలైనా కూడా మెత్తగానే ఉంటాయి.