Sprouts Vada : మొలకలను తినడం వల్ల మనకు ఎన్ని ఆరోగ్యకరమైన ప్రయోజనాలు కలుగుతాయో అందరికీ తెలిసిందే. వీటిని తినడం వల్ల జీర్ణవ్యవస్థ పనితీరు మెరుగు పడుతుంది. షుగర్, బీపీ అదుపులోకి వస్తాయి. బరువు తగ్గుతారు. అనేక పోషకాలు లభిస్తాయి. కనుక మొలకలను రోజూ ఆహారంలో భాగంగా చేసుకుంటే ఎంతో మేలు జరుగుతుంది. అయితే వీటితో వడలను కూడా తయారు చేసుకుని తినవచ్చు. మొలకలను నేరుగా తినలేని వారు ఇలా వడలను తయారు చేసి తింటే ఎంతో రుచిగా ఉంటాయి. పైగా పోషకాలు కూడా లభిస్తాయి. ఇక మొలకలతో వడలను ఎలా తయారు చేయాలో ఇప్పుడు తెలుసుకుందాం.
మొలకలతో వడలు తయారీకి కావల్సిన పదార్థాలు..
పెసలు, బొబ్బర్లు, శనగలు – కప్పు చొప్పున తీసుకోవాలి, ఉప్పు, నూనె, కారం, పసుపు – తగినంత, కొత్తిమీర – పావు కప్పు, కరివేపాకులు – పావు కప్పు.
మొలకలతో వడలు తయారు చేసే విధానం..
పెసలు, బొబ్బర్లు, శనగలను బాగా కడిగి నీటిలో వేసి 12 గంటల పాటు నానబెట్టాలి. తరువాత వాటిని బయటకు తీసి మళ్లీ నీటితో కడగాలి. అనంతరం వాటిని ఆరబెట్టాలి. దీంతో పొడిగా మారుతాయి. ఇలా చేయడం వల్ల మొలకలు వాసన రాకుండా ఉంటాయి. ఇక కాస్త పొడిగా అయ్యాక వాటిని శుభ్రమైన వస్త్రంలో చుట్టి మూటలా కట్టాలి. దీనిపై కాస్త నీళ్లు చల్లాలి. దీన్ని ఎండ తగలని చోట చల్లగా ఉన్న ప్రదేశంలో ఉంచాలి. 24 గంటల తరువాత మొలకలు బాగా వస్తాయి. మొలకలు వచ్చాకే అన్నింటినీ తీయాలి.
తరువాత మొలకలలో తగినంత ఉప్పు, కారం, పసుపు, కొత్తిమీర తరుగు, కరివేపాకులు వేసి బాగా కలిపి నీళ్లు పోసుకుంటూ పిండి పట్టుకోవాలి. పిండి మరీ వదులుగా ఉండకూడదు. నీళ్లను అవసరం అనుకుంటేనే పోయాలి. ఇలా వడలకు సరిపోయే విధంగా పిండిని గట్టిగా ఉండేలా పట్టుకోవాలి. దాన్ని 10 నిమిషాల పాటు పక్కన పెట్టాలి. తరువాత ఒక కళాయి తీసుకుని నూనె పోసి కాగిన తరువాత ముందుగా సిద్ధం చేసుకున్న పిండి నుంచి చిన్న చిన్న ముద్దలు చేయాలి. వాటిని చేత్తో వడల మాదిరిగా వత్తుతూ నూనెలో వేయాలి. బంగారు రంగులోకి వచ్చే వరకు వేయించాలి. తరువాత వాటిని ఒక పాత్రలోకి తీసుకోవాలి. దీంతో ఎంతో రుచికరమైన మొలకల వడలు తయారవుతాయి. వీటిని నేరుగా అలాగే తినవచ్చు. లేదా పల్లీలు, కొబ్బరి చట్నీతో తినవచ్చు. దీంతో ఎంతో రుచిగా ఉంటాయి. పోషకాలు లభిస్తాయి.