Ragi Ambali : వేసవి కాలంలో మన శరీరానికి రాగులు చేసే మేలు అంతా ఇంతా కాదు. వీటిని ఈ సీజన్‌లో తినడం వల్ల మనకు అనేక లాభాలు కలుగుతాయి. ముఖ్యంగా శరీరంలోని వేడి మొత్తం తగ్గుతుంది. శరీరం చల్లగా మారుతుంది. డీహైడ్రేషన్ బారిన పడకుండా ఉంటారు. అలాగే ఎండ దెబ్బ నుంచి సురక్షితంగా ఉండవచ్చు. ఇక రాగుల్లో ఐరన్ అధికంగా ఉంటుంది కనుక రక్తం బాగా తయారవుతుంది. రక్తహీనత సమస్య తగ్గుతుంది. దీంతో షుగర్, బీపీ, కొలెస్ట్రాల్ స్థాయిలు కూడా అదుపులోకి వస్తాయి. కనుక రాగులను కేవలం వేసవిలోనే కాదు.. ఎప్పుడైనా సరే తీసుకోవాల్సిందే. అయితే రాగులను రుచిగా తినాలని కోరుకునే వారు వాటితో రాగి అంబలి తయారు చేసుకోవచ్చు. ఇది ఎంతో రుచిగా ఉండడమే కాదు.. మనకు పోషకాలను, ఆరోగ్యకరమైన ప్రయోజనాలను అందిస్తుంది. ఇక రాగి అంబలిని ఎలా తయారు చేయాలో ఇప్పుడు తెలుసుకుందాం.
రాగి అంబలి తయారీకి కావల్సిన పదార్థాలు..
రాగి సంగటి – ఒక ముద్ద, నీళ్లు – రెండు కప్పులు, పెరుగు – రెండు కప్పులు, ఉప్పు – రుచికి తగినంత.
రాగి అంబలిని తయారు చేసే విధానం..
రాగి సంగటి ముద్దను రాత్రి తయారు చేసి పెట్టుకోవాలి. ఉదయాన్నే ఒక పాత్రలో రాగి సంగటి ముద్దను సగం తీసుకుని అందులో పెరుగు, తగినంత ఉప్పు వేసి బాగా కలపాలి. అవసరమైనన్ని నీళ్లు పోసి కలపాలి. దీన్ని ఒక గ్లాస్‌లోకి తీసుకుని ఉల్లిపాయలతో సర్వ్ చేసుకోవాలి. దీంతో ఎంతో రుచిగా ఉండే రాగి అంబలి తయారవుతుంది. దీన్ని వేసవిలో తాగడం వల్ల అనేక లాభాలను పొందవచ్చు. ముఖ్యంగా శరీరంలోని వేడి మొత్తం పోతుంది. పోషకాలు, శక్తి లభిస్తాయి. కనుక రాగి అంబలిని ప్రతి రోజూ తాగాలి.