Tomato Pandu Mirchi Nilva Pachadi : మనం టమాటాలతో రకరకాల నిల్వ పచ్చళ్లను తయారు చేస్తూ ఉంటాం. టమాటాలతో చేసే ఈ పచ్చళ్లు రుచిగా ఉండడంతో పాటు ఏడాదంత చక్కగా నిల్వ ఉంటాయి. టమాటాలతో తయారు చేసుకోగలిగిన నిల్వ పచ్చళ్లల్లో టమాట పండుమిర్చి పచ్చడి కూడా ఒకటి. ఈ పచ్చడిని రుచి చూడని వారు ఉండరనే చెప్పవచ్చు. పండుమిర్చితో చేసే ఈ నిల్వ పచ్చడి రుచి గురించి ఎంత చెప్పిన తక్కువే అవుతుంది. ఈ టమాట పండుమిర్చి పచ్చడిని మనం చాలా సులభంగా తయారు చేసుకోవచ్చు. మొదటిసారి చేసే వారు కూడా తేలికగా చేసుకునేలా, రుచిగా టమాట పండుమిర్చి నిల్వ పచ్చడిని ఎలా తయారు చేసుకోవాలి.. అన్న వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం.
టమాట పండుమిర్చి నిల్వ పచ్చడి తయారీకి కావల్సిన పదార్థాలు..
టమాటాలు – అరకిలో, పండుమిర్చి – అర కిలో, ఉప్పు – 2 టీ స్పూన్, పసుపు – ఒక టేబుల్ స్పూన్, చింతపండు – పెద్ద నిమ్మకాయంత, జీలకర్ర – ఒక టీ స్పూన్, వెల్లుల్లి రెబ్బలు – 10.
తాళింపు తయారీకి కావల్సిన పదార్థాలు..
నూనె – 4 టీ స్పూన్స్, ఎండుమిర్చి – 2, జీలకర్ర – పావు టీ స్పూన్, ఆవాలు – పావు టీ స్పూన్, కరివేపాకు – ఒక రెమ్మ.
టమాట పండుమిర్చి నిల్వ పచ్చడి తయారీ విధానం..
ముందుగా టమాటాలను శుభ్రంగా కడిగి తడి లేకుండా తుడుచుకోవాలి. తరువాత వాటిని గాలి ఆరబెట్టాలి. తరువాత టమాట తొడిమలను తీసి నిలువుగా ముక్కలుగా చేసుకోవాలి. ఇప్పుడు కళాయిలో టమాట ముక్కలు, ఉప్పు, పసుపు వేసి కలపాలి. దీనిపై మూత పెట్టి టమాట ముక్కలు మెత్తగా అయ్యే వరకు ఉడికించాలి. టమాట ముక్కలు మెత్తగా ఉడికించిన తరువాత మూత తీసి అందులో చింతపండు వేసి కలపాలి. తరువాత మూత పెట్టకుండా టమాట ముక్కలు పూర్తిగా మెత్తగా అయ్యే వరకు ఉడికించి స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. తరువాత వీటిని పూర్తిగా చల్లారే వరకు పక్కకు ఉంచాలి. ఇప్పుడు పండు మిర్చిని తీసుకుని తొడిమలు లేకుండా నీటితో కడిగి తడి లేకుండా తుడవాలి. తరువాత తొడిమలు తీసి ఆరబెట్టుకోవాలి. తరువాత ఈ పండు మిర్చిని చిన్న చిన్న ముక్కలుగా చేసి జార్ లోకి తీసుకోవాలి. ఇందులోనే జీలకర్ర, వెల్లుల్లి రెబ్బలు వేసి కచ్చా పచ్చాగా మిక్సీ పట్టుకోవాలి. తరువాత ఉడికించిన టమాట ముక్కలను వేసి మరలా మిక్సీ పట్టుకోవాలి.
ఇలా తయారు చేసుకున్న పచ్చడిని గాజు సీసాలో లేదా జాడీలో ఉంచి గాలి, తడి తగలకుండా నిల్వ చేసుకోవాలి. ఇప్పుడు కళాయిలో నూనె వేసి వేడి చేయాలి. నూనె వేడయ్యాక తాళింపు పదార్థాలు ఒక్కొక్కటిగా వేసి తాళింపు చేసుకోవాలి. తాళింపు వేగిన తరువాత తగినంత పచ్చడిని వేసి కలపాలి. దీనిని నూనె పైకి తేలే వరకు ఉడికించి స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఇలా చేయడం వల్ల ఎంతో రుచిగా ఉండే టమాట పండుమిర్చి నిల్వ పచ్చడి తయారవుతుంది. దీనిని వేడి వేడి అన్నం, నెయ్యితో కలిపి తింటే చాలా రుచిగా ఉంటుంది. పండుమిర్చి ఎక్కువగా లభించినప్పుడు ఇలా పచ్చడిని తయారు చేసుకుని నిల్వ చేసుకుని సంవత్సరమంతా తినవచ్చు. ఈ పచ్చడిని అందరూ ఎంతో ఇష్టంగా తింటారు.