Wood Apple : వినాయక చవితి రోజూ వినాయకుడికి ఎంతో ప్రీతిపాత్రమైన వెలక్కాయలను అలంకారంగా, నైవేద్యంగానూ పెట్టడం అనాదిగా వస్తోన్న ఆచారం. ఆధ్యాత్మికంగానే కాదు ఔషధంగా కూడా ఈ వెలక్కాయ మనకు ఎంతగానో ఉపయోగపడుతుందని నిపుణులు చెబుతున్నారు. దీనిని మంకీ ఆపిల్, వుడ్ ఆపిల్, కర్డ్ ఫ్రూట్, ఎలిఫెంట్ యాపిల్ అని రకరకాల పేర్లతో పిలుస్తారు. వెలక్కాయ చాలా వగరుగా ఉంటుంది. పండిన వెలక్కాయ తీపి పులుపు రుచితో మంచి వాసన వస్తుంది. ఈ వెలక్కాయతో పెరుగు పచ్చడి, పప్పు కూరలను కూడా తయారు చేస్తూ ఉంటారు. ఇతర పండ్ల వలె వెలగపండులో కూడా మన శరీరానికి అవసరమయ్యే ఎన్నో పోషకాలు ఉంటాయి. వెలగపండులో ప్రోటీన్స్, బీటా కెరోటీన్, థైమీన్, ఐరన్, క్యాల్షియం, ఫాస్ఫరస్ వంటి ఎన్నో పోషకాలు ఉంటాయి. ఆయుర్వేదంలో దీనిని విరివిరిగా ఉపయోగిస్తారు.
వాంతులు, విరోచనాలు, జ్వరం, మలబద్దకం వంటి సమస్యలను తగ్గించడంలో ఈ పండు మనకు ఎంతో సహాయపడుతుంది. దీనిని జ్యూస్ రూపంలో తీసుకోవడం వల్ల జీర్ణశక్తి మెరుగుపడడంతో పాటు పొట్టలో ఉండే క్రిములు, నులిపురుగులు కూడా నశిస్తాయి. వెలగపండు గుజ్జులో ఉప్పు, మిరియాల పొడి కలిపి తీసుకుంటే జీర్ణక్రియ వేగవంతం అవుతుంది. రక్తహీనత సమస్యను తగ్గించడంలో కూడా ఈ పండు మనకు ఎంతగానో ఉపయోగపడుతుంది. వెలగపండు జ్యూస్ ను తాగడం వల్ల ఎక్కిళ్లు ఆగుతాయి. అలాగే ఈ పండు గుజ్జును బెల్లంతో కలిపి తీసుకోవడం వల్ల నీరసం తగ్గుతుంది. మూత్రపిండాల్లో రాళ్ల సమస్యలతో బాధపడే వారు తరచూ ఈ పండు జ్యూస్ ను తాగడం వల్ల మంచి ఫలితం ఉంటుంది. పురుషులు ఈ పండ్లను తీసుకోవడం వల్ల వారిలో వీర్య కణాల సంఖ్య పెరుగుతుంది. స్త్రీలు ఈ పండ్ల గుజ్జును తినడం వల్ల రొమ్ము క్యాన్సర్, గర్భాశయ క్యాన్సర్లు వచ్చే అవకాశాలు తగ్గుతాయి. వెలగపండు గుజ్జును తినడం వల్ల శరీరంలో రోగ నిరోధక శక్తి పెరుగుతుంది.
అలాగే కాలేయ సంబంధిత సమస్యలతో బాధపడే వారికి ఈ పండు దివ్యౌషధంగా పని చేస్తుందని ఆయుర్వేద నిపుణులు చెబుతున్నారు. కాలేయ సమస్యలతో బాధపడే వారు, మద్యపానం చేసే వారికి, ఫ్యాటీలివర్ సమస్యతో బాధపడే వారికి, స్థూలకాయం సమస్యతో బాధపడే వారికి ఈ పండు చక్కటి ఔషధంలా పని చేస్తుంది. కాలేయంలో కణాలను శుద్ది చేయడంతో పాటు కాలేయ కణాలు నశించకుండా రక్షించడానికి కూడా వెలగపండు ఎంతో దోహదపడుతుందని శాస్త్రీయంగా కూడా నిరూపితమైంది. వెలగపండు గుజ్జును ఉదయం పూట 30 గ్రాములు, అలాగే సాయంత్రం పూట 30 గ్రాముల మోతాదులో తీసుకోవడం వల్ల కాలేయ సంబంధిత సమస్యలన్నీ తగ్గు ముఖం పడతాయని నిపుణులు చెబుతున్నారు.
అలాగే దీనిని తీసుకోవడం వల్ల గుండె ఆరోగ్యం మెరుగుపడుతుంది. వెలగపండు గుజ్జుకు తేనెను కలిపి తీసుకుంటే అధిక దాహం సమస్య నుండి బయట పడవచ్చు. అలాగే నోటిపుండ్లు, గ్యాస్ వంటి సమస్యలు కూడా తగ్గుతాయి. వెలగపండ్లే కాకుండా వెలగ చెట్టు ఆకులు, బెరడు, వేర్లు, పూలు కూడా ఔషధభరితమేనని వీటిని ఉపయోగించడం వల్ల మనం చక్కటి ఆరోగ్యాన్ని పొందవచ్చని నిపుణులు చెబుతున్నారు. ఈ విధంగా వెలగపండు మన ఆరోగ్యానికి ఎ్ంతో మేలు చేస్తుందని దీనిని ఆహారంలో భాగంగా తీసుకోవడం వల్ల మనం అనేక అనారోగ్య సమస్యలను దూరం చేసుకోవచ్చని ఆయుర్వేద నిపుణులు తెలియజేస్తున్నారు.