Tomato Rice : ట‌మాటా రైస్‌ను ఇలా చేస్తే.. ఎంతో రుచిగా ఉంటుంది..!

Tomato Rice : మ‌నం సాధార‌ణంగా వంటింట్లో అధికంగా వాడే కూర‌గాయ‌ల్లో ట‌మాటాలు ఒక‌టి. ట‌మాటాలు మ‌న శ‌రీరానికి ఎంతో మేలు చేస్తాయ‌ని మ‌నంద‌రికీ తెలుసు. వీటిలో యాంటీ ఆక్సిడెంట్లు అధికంగా ఉంటాయి. బీపీని త‌గ్గించ‌డంతోపాటు గుండె సంర‌క్ష‌ణ‌లోనూ ఇవి స‌హాయ‌ప‌డ‌తాయి. ట‌మాటాల‌ను ఆహారంలో భాగంగా చేసుకోవ‌డం వ‌ల్ల కంటి స‌మ‌స్య‌లు త‌గ్గుతాయి. ఎముక‌లు ధృఢంగా ఉంటాయి. చ‌ర్మ సంర‌క్ష‌ణ‌లో కూడా ట‌మాటాలు దోహ‌ద‌ప‌డ‌తాయి. ట‌మాటాల‌ను త‌ర‌చూ ఆహారంలో భాగంగా చేసుకోవ‌డం వ‌ల్ల ప‌లు ర‌కాల క్యాన్స‌ర్ లు వ‌చ్చే అవ‌కాశాలు త‌క్కువ‌గా ఉంటాయ‌ని వైద్యులు చెబుతున్నారు. ట‌మాటాల‌తో త‌యారు చేసే ఆహార ప‌దార్థాల‌లో ట‌మాటా రైస్ ఒక‌టి. చాలా త‌క్కువ స‌మ‌యంలో ఎంతో రుచిగా ట‌మాటా రైస్ ను త‌యారు చేసుకోవ‌చ్చు. ట‌మాటా రైస్ త‌యారీకి కావ‌ల్సిన ప‌దార్థాల‌ను.. ఎలా త‌యారు చేసుకోవాలి.. అన్న వివ‌రాల‌ను ఇప్పుడు తెలుసుకుందాం.

Tomato Rice making is easy recipe is here
Tomato Rice

ట‌మాటా రైస్ త‌యారీకి కావ‌ల్సిన ప‌దార్థాలు..

ఉడికించి చ‌ల్లార్చిన అన్నం – ఒకటిన్న‌ర క‌ప్పు, నూనె – 3 టేబుల్ స్పూన్స్‌, ల‌వంగాలు – 4, యాల‌కులు – 3, బిర్యానీ ఆకు – 1, దాల్చిన చెక్క – 2 (చిన్న‌వి), ఆవాలు – అర టీ స్పూన్‌, జీల‌క‌ర్ర – అర‌ టీ స్పూన్‌, మిన‌ప ప‌ప్పు – ఒక టీ స్పూన్‌, శ‌న‌గ‌ప‌ప్పు – ఒక టీ స్పూన్‌, పొడుగ్గా త‌రిగిన ఉల్లిపాయ – 1, పొడుగ్గా త‌రిగిన ప‌చ్చి మిర్చి – 3 లేదా 4, క‌రివేపాకు – ఒక రెబ్బ‌, ఉప్పు – రుచికి స‌రిప‌డా, ప‌సుపు – పావు టీ స్పూన్‌, త‌రిగిన ట‌మాటాలు – 3 (మ‌ధ్య‌స్థంగా ఉన్న‌వి), కారం – రుచికి స‌రిప‌డా, ధ‌నియాల పొడి – అర టీ స్పూన్‌, జీల‌క‌ర్ర పొడి – పావు టీ స్పూన్‌, గ‌రం మ‌సాలా – పావు టీ స్పూన్‌, త‌రిగిన కొత్తిమీర -కొద్దిగా, జీడి ప‌ప్పు ప‌లుకులు – 10.

ట‌మాటా రైస్ త‌యారీ విధానం..

ముందుగా ఒక క‌ళాయిలో నూనె వేసి కాగాక బిర్యానీ ఆకు, యాల‌కులు, ల‌వంగాలు, దాల్చిన చెక్క వేసి కొద్దిగా వేయించుకోవాలి. త‌రువాత ఆవాలు, జీల‌క‌ర్ర‌, మిన‌ప‌ప్పు, శ‌న‌గ ప‌ప్పు వేసి వేయించుకోవాలి. త‌రువాత జీడిప‌ప్పు వేసి వేయించుకోవాలి. జీడి పప్పు వేగాక త‌రిగిన ఉల్లిపాయ‌, ప‌చ్చి మిర్చి, క‌రివేపాకు, ప‌సుపు వేసి వేయించుకోవాలి. ఇవి వేగాక త‌రిగిన ట‌మాటా ముక్క‌లు వేసి క‌లిపి మూత పెట్టి మ‌ధ్య‌స్థ మంట‌పై ఉడికించుకోవాలి. ట‌మాటా ముక్క‌లు స‌గం వ‌రకు ఉడికిన త‌రువాత రుచికి స‌రిప‌డా ఉప్పు, కారం, ధ‌నియాల పొడి, జీల‌క‌ర్ర పొడి, గ‌రం మ‌సాలా వేసి బాగా క‌లుపుకోవాలి. ఇలా క‌లిపిన త‌రువాత మళ్లీ మూత పెట్టి ట‌మాటాల‌ను పూర్తిగా ఉడికించుకోవాలి.

ట‌మాటా ముక్క‌లు ఉడికిన త‌రువాత ముందుగా చ‌ల్లార బెట్టుకున్న అన్నాన్ని వేసి బాగా కలుపుకోవాలి. ఇలా కలిపిన త‌రువాత చిన్న మంట‌పై 5 నిమిషాల పాటు మూత పెట్టి ఉంచాలి. చివ‌ర‌గా కొత్తిమీర వేసి స్ట‌వ్ ఆఫ్ చేసుకోవాలి. దీంతో ఎంతో రుచిగా ఉండే ట‌మాటా రైస్ త‌యార‌వుతుంది. ట‌మాటా రైస్ తయారీలో ట‌మాటా ముక్కల‌నే కాకుండా ప‌చ్చి ట‌మాటాల‌ను మిక్సీ ప‌ట్టి గుజ్జుగా చేసి కూడా వాడుకోవ‌చ్చు. ట‌మాటా రైస్ ను అంద‌రూ చాలా ఇష్టంగా తింటారు. ఉద‌యం కూర చేసే స‌మ‌యం లేని వారు, మ‌ధ్యాహ్నం లంచ్ బాక్స్ లోకి.. ఇలా ట‌మాటా రైస్ ను త‌యారు చేసుకుని తిన‌వ‌చ్చు.

Share
D

Recent Posts