Ullipaya Uragaya : ఉల్లిపాయ ఊర‌గాయ ఇలా చేయండి.. రుచి సూప‌ర్‌గా ఉంటుంది..!

Ullipaya Uragaya : మ‌న ఆరోగ్యానికి ఉల్లిపాయ ఎంతో మేలు చేస్తుంద‌న్న సంగ‌తి మ‌న‌కు తెలిసిందే. దీనిని విరివిగా కూర‌ల్లో వాడుతూ ఉంటాము. కూర‌ల్లో వాడ‌డంతో పాటు ఉల్లిపాయ‌ల‌తో మ‌నం వివిధ ర‌కాల వంట‌కాల‌ను కూడా త‌యారు చేసుకోవ‌చ్చు. ఉల్లిపాయ‌తో చేసుకోద‌గిన రుచిక‌ర‌మైన వంట‌కాల్లో ఉల్లిపాయ ఊర‌గాయ కూడా ఒక‌టి. ఉల్లిపాయ‌తో చేసే ఈ ప‌చ్చ‌డి చాలా రుచిగా ఉంటుంది. అన్నంతో, అల్పాహారాల‌తో తీసుకోవ‌డానికి ఇది చాలా చ‌క్క‌గా ఉంటుంది. దీనిని త‌యారు చేసుకోవ‌డం కూడా చాలా సుల‌భం. ఎక్కువ‌గా శ్ర‌మించాల్సిన అవ‌స‌రం కూడా ఉండ‌దు. ఈ ప‌చ్చ‌డిని అంద‌రూ ఇష్ట‌ప‌డ‌తార‌ని చెప్ప‌వ‌చ్చు. ఎంతో రుచిగా, క‌మ్మ‌గా ఉండే ఈ ఉల్లిపాయ ఊర‌గాయ‌ను ఎలా త‌యారు చేసుకోవాలి.. అన్న వివ‌రాల‌ను ఇప్పుడు తెలుసుకుందాం.

ఉల్లిపాయ ఊర‌గాయ త‌యారీకి కావ‌ల్సిన ప‌దార్థాలు..

నాన‌బెట్టిన చింత‌పండు – పెద్ద నిమ్మ‌కాయంత‌, పొడుగ్గా తరిగిన ఉల్లిపాయ‌లు – అర‌కిలో, మెంతులు – ఒక టీ స్పూన్, జీల‌క‌ర్ర – ఒక టీ స్పూన్, ఆవాలు – ఒక టీ స్పూన్, ధ‌నియాలు – ఒక టేబుల్ స్పూన్, నూనె – ఒక క‌ప్పు, ఎండుమిర్చి – 5, వెల్లుల్లిపాయ – 1, ప‌సుపు – ఒక టీ స్పూన్, కారం – 5 టేబుల్ స్పూన్స్, ఉప్పు – 2 టేబుల్ స్పూన్స్ లేదా త‌గినంత‌.

Ullipaya Uragaya recipe make in this method
Ullipaya Uragaya

ఉల్లిపాయ ఊర‌గాయ త‌యారీ విధానం..

ముందుగా చింత‌పండు నుండి చిక్క‌టి గుజ్జును తీసుకుని ప‌క్క‌కు ఉంచాలి. త‌రువాత క‌ళాయిలో ఆవాలు, జీల‌క‌ర్ర‌, మెంతులు, ధ‌నియాలు వేసి దోర‌గా వేయించి జార్ లోకి తీసుకోవాలి. త‌రువాత వీటిని మెత్త‌ని పొడిగా చేసుకుని ప‌క్క‌కు ఉంచాలి. త‌రువాత క‌ళాయిలో నూనె పోసి వేడి చేయాలి. నూనె వేడ‌య్యాక ఒక టీ స్పూన్ చొప్పున ఆవాలు, జీల‌క‌ర్ర వేసి వేయించాలి. త‌రువాత ఎండుమిర్చి, పొట్టు తీసిన వెల్లుల్లి రెమ్మ‌లు వేసి వేయించాలి. ఇవి వేగిన త‌రువాత ఉల్లిపాయ ముక్క‌లు వేసి మెత్త‌బ‌డే వ‌ర‌కు వేయించాలి. ఉల్లిపాయ ముక్క‌లు మెత్త‌బ‌డిన త‌రువాత మంట‌ను చిన్న‌గా చేసి ఉప్పు, కారం, ప‌సుపు వేసి క‌ల‌పాలి.

త‌రువాత మిక్సీ పట్టుకున్న పొడి వేసి క‌ల‌పాలి. త‌రువాత చింత‌పండు ర‌సం వేసి క‌లపాలి. దీనిపై మూత పెట్టి నూనె పైకి తేలే వ‌ర‌కు మ‌ధ్య‌ మ‌ధ్య‌లో క‌లుపుతూ బాగా ఉడికించాలి. ప‌చ్చ‌డి ద‌గ్గ‌ర ప‌డి నూనె పైకి తేలిన త‌రువాత స్ట‌వ్ ఆఫ్ చేసుకోవాలి. ఇలా చేయ‌డం వ‌ల్ల ఎంతో రుచిగా ఉండే ఉల్లిపాయ ఊర‌గాయ త‌యార‌వుతుంది. దీనిని చ‌ల్లారిన త‌రువాత గాజు సీసాలో వేసి నిల్వ చేసుకోవాలి. ఈ ప‌చ్చ‌డి బ‌య‌ట ఉంచ‌డం వ‌ల్ల 10 రోజుల పాటు తాజాగా ఉంటుంది. అదే ఫ్రిజ్ లో ఉంచి నిల్వ చేసుకోవ‌డం వ‌ల్ల నెల‌రోజుల‌కు పైగా తాజాగా ఉంటుంది. ఈ విధంగా తయారు చేసిన ప‌చ్చ‌డిని లొట్ట‌లేసుకుంటూ అంద‌రూ ఎంతో ఇష్టంగా తింటారు.

D

Recent Posts