Vanilla Ice Cream Burfi : మనం పాలపొడిని కూడా అప్పుడప్పుడూ ఉపయోగిస్తూ ఉంటాం. పాలకు బదులుగా ఈ పొడిని ఉపయోగించడంతో పాటు దీనితో రకరకాల తీపి పదార్థాలను తయారు చేస్తూ ఉంటాం. పాలపొడితో సులభంగా తయారు చేసుకోగలిగే తీపి వంటకాల్లో ఐస్ క్రీమ్ బర్ఫీ కూడా ఒకటి. ఈ బర్ఫీ నోట్లో వేసుకుంటే కరిగిపోయేంత మృదువుగా, రుచిగా ఉంటుంది. వెనీలా ప్లేవర్ తో చేసే ఐస్ క్రీమ్ బర్ఫీని మనం చాలా సులభంగా తయారు చేసుకోవచ్చు. తిన్నా కొద్ది తినాలనిపించేంత రుచిగా ఉండే ఐస్ క్రీమ్ బర్ఫీని ఎలా తయారు చేసుకోవాలి.. తయారీకి కావల్సిన పదార్థాలు ఏమిటి.. అన్న వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం.
వెనీలా ఐస్ క్రీమ్ బర్ఫీ తయారీకి కావల్సిన పదార్థాలు..
పాల పొడి – 200 గ్రా., నెయ్యి – 200 గ్రా., పంచదార – 250 గ్రా., నీళ్లు – 150 ఎమ్ ఎల్, వెనీలా షుగర్ – ఒక టీ స్పూన్, పిస్తా పలుకులు – 2 టేబుల్ స్పూన్స్.
వెనీలా ఐస్ క్రీమ్ బర్ఫీ తయారీ విధానం..
ముందుగా ఒక పెద్ద ప్లేట్ లో బటర్ పేపర్ ను వేసుకోవాలి. తరువాత దానిపై పిస్తా పలుకులను చల్లుకుని పక్కకు ఉంచాలి. తరువాత ఒక గిన్నెలో పాలపొడిని తీసుకోవాలి. తరువాత అందులో నెయ్యి వేసి ముద్దలా బాగా కలుపుకోవాలి. ఇప్పుడు అడుగు మందంగా ఉండే కళాయిలో పంచదార, నీళ్లు పోసి వేడి చేయాలి. పంచదార కరిగి తీగపాకం వచ్చే వరకు ఉడికించాలి. పంచదార తీగపాకం రాగానే స్టవ్ ఆఫ్ చేసి అందులో ముందుగా కలిపి పెట్టుకున్న పాలపొడి వేసి ఉండలు లేకుండా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తరువాత కొద్దిగా మిశ్రమాన్ని తీసుకుని ఉండలా కట్టి చూడాలి. లేదంటే ఈ కళాయిని సట్వ్ మీద ఉంచి మరో 4 నిమిషాల పాటు అంతా కలుపుతూ ఉడికించాలి.
పాలపొడి మిశ్రమం ఉండకట్టడానికి రాగానే స్టవ్ ఆఫ్ చేసి అందులో వెనీలా షుగర్ వేసి కలపాలి. ఇప్పుడు ఈ పాలపొడి మిశ్రమాన్ని బాగా కలుపుతూ 5 నిమిషాల పాటు చల్లారనివ్వాలి. తరువాత ఈ మిశ్రమాన్ని ముందుగా సిద్దం చేసుకున్న ప్లేట్ లో వేసి పైన సమానంగా చేసుకోవాలి. దీనిని ఒక రాత్రంతా లేదా 6 గంటల పాటు కదిలించకుండా ఉంచాలి. బర్ఫీ గట్టి పడిన తరువాత దానిని ప్లేట్ నుండి వేరు చేసుకుని మనకు కావల్సిన ఆకారంలో ముక్కలుగా చేసుకోవాలి. ఇలా చేయడం వల్ల ఎంతో రుచిగా ఉండే వెనీలా ఐస్ క్రీమ్ బర్ఫీ తయారవుతుంది. తీపి తినాలనిపించినప్పుడు. పండులకు ఇలా ఐస్ క్రీమ్ బర్ఫీని తయారు చేసుకుని తినవచ్చు. ఈ బర్ఫీని అందరూ ఎంతో ఇష్టంగా తింటారు.