Veg Burger : వెజ్ బర్గర్.. మనకు ఎక్కువగా లభించే ఫాస్ట్ ఫుడ్ వెరైటీలలో ఇది కూడా ఒకటి. బేకరీలల్లో, క్యాంటీన్ లలో, ఫాస్ట్ ఫుడ్ సెంటర్లలలో ఇది మనకు ఎక్కువగా లభిస్తుంది. పిల్లలు, పెద్దలు అనే తేడా లేకుండా అందరూ దీనిని ఇష్టంగా తింటారు. స్నాక్స్ గా తినడానికి ఇది చాలా చక్కగా ఉంటుంది. ఈ వెజ్ బర్గర్ ను బయట కొనే పని లేకుండా మనం ఇంట్లోనే తయారు చేసుకోవచ్చు. దీనిని తయారు చేయడం చాలా తేలిక. చాలా తక్కువ సమయంలో, చాలా సులభంగా దీనిని తయారు చేసుకోవచ్చు. బయట కొనే పనిలేకుండా వెజ్ బర్గర్ ను ఇంట్లోనే ఎలా తయారు చేసుకోవాలి.. అన్న వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం.
వెజ్ బర్గర్ తయారీకి కావల్సిన పదార్థాలు..
నూనె – 2 టీ స్పూన్స్, ఉడికించి మెత్తగా చేసిన బఠాణీ – 2 టేబుల్ స్పూన్స్, ఫ్రెంచ్ బీన్స్ తరుగు – ముప్పావు కప్పు, క్యారెట్ తురుము – అర కప్పు, ఉప్పు – తగినంత, పసుపు – అర టీ స్పూన్, మిరియాల పొడి – అర టీ స్పూన్, ఉడికించిన బంగాళాదుంపలు – 2, బ్రెడ్ క్రంబ్స్ – 2 టీ స్పూన్స్, మైదాపిండి – 2 టేబుల్ స్పూన్స్, బర్గర్ బన్స్ – 1, టమాట కిచప్ – ఒక టీ స్పూన్, మయనీస్ – ఒక టీస్పూన్, ఐస్ బర్గ్ లెటస్ – 1, చీజ్ స్లైస్ – 2, టమాట స్లైసెస్ – తగినన్ని, ఉల్లిపాయ స్లైస్ – తగినన్ని.
వెజ్ బర్గర్ తయారీ విధానం..
ముందుగా కళాయిలో నూనె వేసి వేడి చేయాలి. తరువాత బఠాణీ, బీన్స్, క్యారెట్ వేసి 2 నిమిషాల పాటు వేయించాలి. తరువాత ఉప్పు, పసుపు వేసి వేయించాలి. వీటిని 80 శాతం వరకు వేయించిన తరువాత బంగాళాదుంపలను మెత్తగా చేసి వేసుకోవాలి. తరువాత అంతా కలిసేలా కలుపుకుని స్టవ్ ఆఫ్ చేసి చల్లారనివ్వాలి. తరువాత ఇందులో బ్రెడ్ క్రంబ్స్ వేసి కలపాలి. ఇప్పుడు ఈ మిశ్రమాన్ని రెండు లేదా మూడు ప్యాటీస్ గా చేసుకోవాలి.తరువాత ఒక గిన్నెలో మైదాపిండిని తీసుకుని నీళ్లు పోసి పలుచగా కలుపుకోవాలి. మరో గిన్నెలో అర కప్పు బ్రెడ్ క్రంబ్స్ ను తీసుకుని పక్కకు ఉంచాలి. ఇప్పుడు ఆలూ ప్యాటీస్ ను మైదాపిండి మిశ్రమంలో ముంచి ఆ తరువాత బ్రెడ్ క్రంబ్స్ తో కోటింగ్ చేసుకుని వేడి వేడి నూనెలో వేయించాలి.
వీటిని మధ్యస్థ మంటపై రెండు వైపులా వేయించిన తరువాత ప్లేట్ లోకి తీసుకోవాలి. ఇప్పుడు బర్గర్ బన్ ను తీసుకుని మధ్యలోకి కట్ చేసుకుని ఒక వైపు టమాట కిచప్ ను, మరో వైపు మయనీస్ ను రాసుకోవాలి. ఇప్పుడు టమాట కిచప్ రాసిన బన్ ను తీసుకుని దానిపై ఐస్ బర్గర్ లెటస్ ను ఉంచాలి. తరువాత వేయించిన ప్యాటీస్ ను ఉంచి దానిపై చీజ్ స్లైస్, టమాట స్లైస్, ఉల్లిపాయ స్లైస్ ను ఉంచి దానిపై కొద్దిగా ఉప్పు, మిరియాల పొడి చల్లుకోవాలి. తరువాత పై నుండి కొద్దిగా టమాట సాస్ ను వేసుకోవాలి. చివరగా మయనీస్ రాసుకున్న బన్ ను పైన ఉంచి సర్వ్ చేసుకోవాలి. ఇలా చేయడం వల్ల ఎంతో రుచిగా ఉండే వెజ్ బర్గర్ తయారవుతుంది. దీనిని అందరూ ఎంతో ఇష్టంగా తింటారు. ఇలా ఇంట్లోనే చాలా సులభంగా తక్కువ ఖర్చులో వెజ్ బర్గర్ ను తయారు చేసి తీసుకోవచ్చు.