Vegetarian : శాకాహారాలుగా ఉండ‌డం వ‌ల్ల క‌లిగే లాభాలు ఏమిటో, న‌ష్టాలో ఏమిటో తెలుసా..?

Vegetarian : ప్ర‌స్తుత కాలంలో మ‌న‌లో చాలా మంది శాఖాహారులుగా మారుతున్నార‌ని చెప్ప‌వ‌చ్చు. మాంసాహారాన్ని తీసుకోవ‌డం వ‌ల్ల ఈ మ‌ధ్యకాలంలో వివిధ ర‌కాల అనారోగ్య స‌మ‌స్య‌లు త‌లెత్తుతున్నాయి. దీంతో చాలా మంది కేవ‌లం శాఖాహారాన్ని తీసుకోవ‌డం ప్రారంభించారు. శాఖాహారం తీసుకోవ‌డం మంచిదే. అలాగే అనేక ఆరోగ్య ప్ర‌యోజ‌నాల‌ను కూడా పొంద‌వ‌చ్చు. మాంసం తినేవారితో పోలిస్తే శాఖాహారులు త‌క్కువ బ‌రువు ఉంటారు. క్యాన్స‌ర్, గుండె జ‌బ్బులు వంటి అనారోగ్య స‌మ‌స్య‌లు వ‌చ్చే అవ‌కాశం కూడా త‌క్కువ‌గా ఉంటుంది. శాఖాహారుల‌ల్లో చెడు కొలెస్ట్రాల్ స్థాయిలు కూడా త‌క్కువ‌గా ఉంటాయి. అయితే ఆరోగ్య ప్ర‌యోజ‌నాల‌తో పాటు శాఖాహారాన్ని తీసుకోవ‌డం వ‌ల్ల మ‌నం న‌ష్టాల‌ను కూడా ఎదుర్కోవాల్సి వ‌స్తుంద‌ని నిపుణులు చెబుతున్నారు.

శాఖాహారం తీసుకోవ‌డం వ‌ల్ల న‌ష్టాలా అని చాలా మంది ఆశ్చ‌ర్యం వ్య‌క్తం చేస్తూ ఉంటారు. కానీ పూర్తిగా శాఖాహారాన్ని తీసుకోవ‌డం వ‌ల్ల కొన్ని స‌మ‌స్య‌లు త‌లెత్తే అవ‌కాశం ఉంద‌ని వారు చెబుతున్నారు. పూర్తిగా శాఖాహారాన్ని తీసుకోవ‌డం వ‌ల్ల క‌లిగే న‌ష్టాలు ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం. శాఖాహారం తీసుకోవ‌డం వ‌ల్ల విట‌మిన్ బి12, ఐర‌న్,జింక్, ఒమెగా 3 ఫ్యాటీ యాసిడ్లు, ప్రోటీన్ వంటి పోష‌కాహార లోపం త‌లెత్తే అవ‌కాశం ఉంది. అలాగే జంతు ఉత్ప‌త్తుల నుండి వ‌చ్చే ఐర‌న్ కంటే మొక్క‌ల నుండి వ‌చ్చే ఐర‌న్ త‌క్కువ‌గా ఉంటుంది. ఫ‌లితంగా శాఖాహారులు అనీమియా బారిన ప‌డే అవ‌కాశం ఉంటుంది. అదే విధంగా మొక్క‌ల నుండి ప్రోటీన్ ల‌భించిన‌ప్ప‌టికి రోజువారి ఆహారంలో ప్రోటీన్ రిచ్ ఫుడ్ ఉండేలా చూసుకోవాలి. ప్రోటీన్ ఆహారాల‌ను తీసుకోవ‌డం త‌గ్గించ‌డం వ‌ల్ల ప్రోటీన్ లోపం త‌లెత్తే అవ‌కాశం ఉంది. ఫ‌లితంగా కండ‌రాల స‌మ‌స్య‌లు, రోగ‌నిరోధ‌క శ‌క్తి త‌గ్గ‌డం, గాయాలు నెమ్మదిగా మార‌డం వంటి స‌మ‌స్య‌లు త‌లెత్తే అవ‌కాశం ఉంది.

8 advantages and disadvantages of being a vegetarian
Vegetarian

మ‌న శ‌రీరానికి అవ‌స‌ర‌మైన పోష‌కాల్లో ఒమెగా 3 ఫ్యాటీ యాసిడ్లు కూడా ఒక‌టి. అవిసె గింజ‌లు, చియా గింజ‌లు, వాల్ న‌ట్స్ వంటి వాటిల్లో ఈ ఒమెగా 3 ఫ్యాటీ యాసిడ్లు ఆల్ఫా లినోనిక్ ఆమ్లం రూపంలో ఉంటాయి. వీటిని మ‌న శ‌రీరం ఒమెగా 3ఫ్యాటీయాసిడ్లుగా మార్చాలి. అయితే ఈ ప్ర‌క్రియ అస‌మ‌ర్థ‌మైన‌దిగా నిపుణులు చెబుతున్నారు. దీంతో శాఖాహారులు త‌గినంత ఒమెగా 3 ఫ్యాటీ యాసిడ్ల‌ను పొంద‌లేరు. దీంతో గుండె మ‌రియు మెద‌డు సంబంధిత స‌మ‌స్య‌లు ఎక్కువ‌గా వ‌చ్చే అవ‌కాశం ఉంటుంది. అలాగే శాఖాహారులు కొంద‌రు పాల‌ను కూడా తీసుకోరు. దీంతో క్యాల్షియం లోపం త‌లెత్తే అవ‌కాశం ఉంది. క్యాల్షియం లోపించ‌డం వ‌ల్ల ఎముక‌లు గుళ్ల‌బార‌డం, కీళ్ల నొప్పులు, ఎముక‌ల ప‌గుళ్లు వంటి స‌మ‌స్య‌లు వ‌చ్చే అవ‌కాశం ఉంది. క‌నుక క్యాల్షియం ఎక్కువ‌గా ఉండే ఇత‌ర ఆహారాలు త‌ప్ప‌కుండా ఆహారంలో భాగంగా ఉండేలా చూసుకోవాలి. అలాగే శ‌రీరంలో రోగ‌నిరోధ‌క శ‌క్తిని పెంపొందించ‌డంలో, ఎముక‌ల‌ను ధృడంగా ఉంచ‌డంలో విట‌మిన్ డి కూడా ఎంతో అవ‌స‌రం.

విట‌మిన్ డి మాంసాహార ఉత్ప‌త్తులో ఉంటుంది. అలాగే సూర్య‌ర‌శ్మి శ‌రీరానికి త‌గ‌ల‌డం వ‌ల్ల మ‌న‌కు త‌గినంత విట‌మిన్ డి ల‌భిస్తుంది. అయితే శాఖాహారులంద‌రికి ఎండ‌లో నిల‌బ‌డే స‌మ‌యం ఉండ‌క‌పోవ‌చ్చు. కొంద‌రు త‌క్కువ సూర్య‌ర‌శ్మి ఉండే ప్రాంతాల్లో నివ‌సించే అవ‌కాశం కూడా ఉంటుంది. క‌నుక శాఖాహారులు త‌ప్ప‌కుండా సూర్య‌ర‌శ్మి త‌గిలేలా చూసుకోవాలి. ఇక కొంద‌రు బ‌రువు త‌గ్గాల‌ని పూర్తిగా శాఖాహారాన్ని తీసుకోవ‌డం ప్రారంభిస్తారు. దీంతో వారిలో క్ర‌మంగా ఆర్థోరెక్సియా నెర్వోసా వంటి స‌మ‌స్య‌లు వ‌చ్చే అవ‌కాశం ఉంది. ఇది క్ర‌మ‌ర‌హిత ఆహార విధానాల‌ను అభివృద్ది చేస్తుంది. మాంసం తినని కార‌ణంగా శాఖాహారులు ప్రాసెస్డ్ ఆహారాన్ని తీసుకునే అవ‌కాశం ఎక్కువ‌గా ఉంటుంది. ఇవి శ‌రీరంలో అనారోగ్య కొవ్వుల‌ను పెంచి ఆరోగ్యంపై ప్ర‌తికూల ప్ర‌భావాన్ని చూపిస్తాయి. క‌నుక శాఖాహారులు అన్ని పోష‌కాలు ఉండే స‌మ‌తుల్య ఆహారాన్ని ఎంచుకోవ‌డం చాలా అవ‌స‌ర‌మ‌ని నిపుణులు చెబుతున్నారు.

Share
D

Recent Posts