Veg Salad : నేటి తరుణంలో మనలో చాలా మందిని వేధిస్తున్న సమస్యల్లో అధిక బరువు సమస్య కూడా ఒకటి. ఈ సమస్య కారణంగా మనలో చాలా మంది బాధపడుతున్నారు. అధిక బరువును తగ్గించుకోవడానికి అనేక రకాల ఆహార నియమాలను పాటిస్తూ ఉంటారు. రుచి లేని ఆహారాన్ని ఇష్టం లేకపోయినా తింటూ ఉంటారు. అధిక బరువుతో బాధపడే వారు నోటికి రుచిగా అలాగే బరువు తగ్గడానికి సహాయపడేలా ఇంట్లోనే వెజ్ సలాడ్ ను తయారు చేసుకుని తయారు చేసుకుని తినవచ్చు. ఈ సలాడ్ చాలా రుచిగా ఉంటుంది. అలాగే దీనిని తినడం వల్ల బరువు తగ్గడంతో పాటు శరీరానికి కావల్సిన పోషకాలు కూడా లభిస్తాయి. రుచిగా, సులభంగా వెజ్ సలాడ్ ను ఎలా తయారు చేసుకోవాలి.. అన్న వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం.
వెజ్ సలాడ్ తయారీకి కావల్సిన పదార్థాలు..
తొక్క తీసి పెద్ద ముక్కలుగా తరిగిన కీరదోస – 2, తొక్క తీసి సన్నగా తరిగిన క్యారెట్ – 2, గింజలు తీసేసి ముక్కలుగా తరిగిన బెంగుళూరు టమాటాలు – 2, క్యూబ్స్ లాగా తరిగిన క్యాప్సికం – 1, పెటల్స్ లాగా తరిగిన ఉల్లిపాయ – 1, ఉప్పు – తగినంత, మిరియాల పొడి – అర టీ స్పూన్, నిమ్మకాయ – 1, సలాడ్ ఆయిల్ – ఒక టీ స్పూన్, చిన్నగా తరిగిన కొత్తిమీర – కొద్దిగా.
వెజ్ సలాడ్ తయారీ విధానం..
ముందుగా గిన్నెలో కూరగాయ ముక్కలను ఒక్కొక్కటిగా వేసుకోవాలి. తరువాత ఉప్పు, మిరియాల పొడి వేసి కలపాలి. తరువాత నిమ్మరసం, ఆయిల్ వేసి కలపాలి. చివరగా కొత్తిమీర వేసి కలిపి తినాలి. ఇలా చేయడం వల్ల ఎంతో రుచిగా ఉండే వెజ్ సలాడ్ తయారవుతుంది. సలాడ్ ఆయిల్ లేని వారు ఒక టీ స్పూన్ ఆలివ్ ఆయిల్ ను లేదా నువ్వుల నూనెను కూడా వేసుకోవచ్చు. ఈ విధంగా వెజ్ సలాడ్ ను తయారు చేసుకుని రోజులో ఒక పూట భోజనానికి బదులుగా దీనిని తినడం వల్ల మనలో వచ్చే మార్పును మనమే గమనించవచ్చు. ఈ విధంగా వెజ్ సలాడ్ ను తయారు చేసుకుని తినడం వల్ల రుచితో పాటు ఆరోగ్య ప్రయోజనాలను కూడా పొందవచ్చు.