Vegetable Omelet : ఆమ్లెట్.. అనే పేరు చెప్పగానే ముందుగా మనకు గుర్తుకు వచ్చేది కోడిగుడ్లు. ఆమ్లెట్లలో సహజంగానే కోడిగుడ్లను ఉపయోగిస్తుంటారు. ఆమ్లెట్లను చాలా మంది రకరకాలుగా వేస్తుంటారు. అయితే కోడిగుడ్లు లేకుండా కూడా ఆమ్లెట్ వేసుకోవచ్చు. పూర్తిగా అన్నీ శాకాహారాలనే ఉపయోగించి ఎగ్ లెస్ ఆమ్లెట్ వేసుకుని తినవచ్చు. శాకాహార ప్రియులు ఈ విధంగా ఆమ్లెట్‌ను ఆస్వాదించవచ్చు. ఇక ఎగ్ లెస్ వెజిటబుల్ ఆమ్లెట్‌ను ఎలా వేయాలో.. ఇప్పుడు తెలుసుకుందాం.
ఎగ్ లెస్ వెజిటబుల్ ఆమ్లెట్ తయారీకి కావల్సిన పదార్థాలు..
చిన్న ఉల్లిపాయ – 1(సన్నగా తరగాలి), చిన్న టమాటా – 1 (సన్నగా తరగాలి), పచ్చి మిర్చి – 1 (సన్నగా తరగాలి), తరిగిన కొత్తిమీర – కొద్దిగా, శనగ పిండి – ఒక కప్పు, మైదా పిండి – పావు కప్పు, బేకింగ్ పౌడర్ – కొద్దిగా, ఉప్పు – రుచికి సరిపడా, నిమ్మరసం – అర టీ స్పూన్, కారం – రుచికి సరిపడా, పసుపు – పావు టీ స్పూన్, నీళ్లు – తగినన్ని, నూనె – అర కప్పు.
ఎగ్ లెస్ వెజిటబుల్ ఆమ్లెట్ తయారీ విధానం..
ముందుగా ఒక గిన్నెలో శనగ పిండి, మైదా పిండి, బేకింగ్ పౌడర్, ఉప్పు వేసి బాగా కలుపుకోవాలి. తరువాత తరిగిన ఉల్లిపాయ, పచ్చి మిర్చి, కొత్తిమీర, నిమ్మరసం, పసుపు, కారం వేసి కలుపుకోవాలి. ఇప్పుడు తగినన్నీ నీళ్లను పోసుకుంటూ మరీ పలుచగా కాకుండా ఉండలు లేకుండా కలుపుకోవాలి. ఇప్పుడు పెనంపై కొద్దిగా నూనె వేసి ముందుగా కలిపి పెట్టుకున్న మిశ్రమాన్ని ఆమ్లెట్ లా వేసుకుని మూత పెట్టి రెండు వైపులా కాల్చుకోవాలి. ఇలా తయారు చేయడం వల్ల ఎంతో రుచిగా ఉండే ఎగ్ లెస్ వెజిటబుల్ ఆమ్లెట్ తయారవుతుంది. ఇందులో జీలకర్ర పొడి, ధనియాలు పొడి, గరం మసాలాను కూడా వేయవచ్చు. దీంతో ఘాటుగా ఉంటుంది. కారం కావాలనుకునే వారికి రుచి సరిగ్గా సరిపోతుంది. కోడిగుడ్లను తినలేని వారు ఇలా వెజిటబుల్ ఆమ్లెట్‌ను వేసుకుని ఎంచక్కా తినవచ్చు.