Village Style Mutton Curry : మాంసాహార ప్రియులు ఎంతో ఇష్టంగా తినే వాటిల్లో మటన్ కూడా ఒకటి. మటన్ ను తినడం వల్ల మన శరీరానికి కావల్సినన్ని ప్రోటీన్స్ తో పాటు ఇతర పోషకాలు కూడా లభిస్తాయి. మటన్ తో ఏ వంటకం వండిన కూడా చాలా రుచిగా ఉంటుంది. అందులో భాగంగా విలేజ్ స్టైల్ లో మటన్ కర్రీ ని ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం.
విలేజ్ స్టైల్ మటన్ కర్రీ తయారీకి కావల్సిన పదార్థాలు..
మటన్ – అర కిలో, కారం – 2 టీ స్పూన్స్, పసుపు – పావు టీ స్పూన్, ఉప్పు – తగినంత, సన్నగా పొడుగ్గా తరిగిన ఎండు కొబ్బరి ముక్కలు – 5, దాల్చిన చెక్క ముక్కలు – 2, లవంగాలు – 3, యాలకులు – 2, మిరియాలు – అర టీ స్పూన్, జీలకర్ర – అర టీ స్పూన్, ధనియాలు – 2 టేబుల్ స్పూన్స్, గసగసాలు – ఒక టీ స్పూన్, నూనె – 3 లేదా 4 టేబుల్ స్పూన్స్, అల్లం వెల్లుల్లి పేస్ట్ – 3 టీ స్పూన్స్, తరిగిన పచ్చిమిర్చి – 4, కరివేపాకు – 2 రెబ్బలు, పెరుగు – పావు కప్పు, తరిగిన కొత్తిమీర – ఒక టేబుల్ స్పూన్, తరిగిన పుదీనా – ఒక టేబుల్ స్పూన్, నీళ్లు – పావు లీటర్.
విలేజ్ స్టైల్ మటన్ కర్రీ తయారీ విధానం..
ముందుగా మటన్ ను శుభ్రంగా కడిగి ఒక గిన్నెలోకి తీసుకోవాలి. తరువాత అందులో ఉప్పు, కారం, పసుపు వేసి ముక్కలకు పట్టేలా బాగా కలిపి 20 నిమిషాల పాటు పక్కకు ఉంచుకోవాలి. తరువాత ఒక జార్ లో ఎండు కొబ్బరి ముక్కలు, దాల్చిన చెక్క, ధనియాలు, లవంగాలు, యాలకులు, మిరియాలు, జీలకర్ర, గసగసాలు వేసి ముందుగా మెత్తని పొడిలా చేసుకోవాలి. తరువాత తగినన్ని నీళ్లు పోసి పేస్ట్ లా చేసుకోవాలి. ఇప్పుడు కుక్కర్ లో నూనె వేసి నూనె కాగిన తరువాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి పచ్చి వాసన పోయే వరకు వేయించుకోవాలి.
తరువాత ఇందులో ముందుగా సిద్దం చేసుకున్న మటన్ ను, పచ్చిమిర్చిని, కరివేపాకును వేసి కలపాలి. తరువాత దీనిపై మూతను ఉంచి 10 నిమిషాల పాటు ఉడికించుకోవాలి. తరువాత ముందుగా తయారు చేసుకున్న మసాలా పేస్ట్ ను, పెరుగును వేసి కలిపి కొద్దిగా దగ్గర పడే వరకు ఉడికించాలి. తరువాత కొత్తిమీర, పుదీనా వేసి ఒక నిమిషం పాటు కలుపుతూ ఉడికించాలి. తరువాత నీళ్లు పోసి కలిపి కుక్కర్ పై మూతను ఉంచి 6 నుండి 8 విజిల్స్ వచ్చే వరకు ఉడికించుకోవాలి. మటన్ లేతగా ఉంటే 4 నుండి 6 విజిల్స్ వచ్చే వరకు ముదురు మటన్ అయితే 8 విజిల్స్ వచ్చే వరకు ఉడికించాలి.
మటన్ ముక్కలు మెత్తగా ఉడకకపోతే మరి కొద్దిసేపు ఉడికించి స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఇలా చేయడం వల్ల ఎంతో రుచిగా ఉండే మటన్ కర్రీ తయారవుతుంది. దీనిని అన్నం, వడ, చపాతీ, పూరీ వంటి వాటితో కలిపి తింటే చాలా రుచిగా ఉండడమే కాకుండా మన ఆరోగ్యానికి కూడా మేలు కలుగుతుంది.