Sesame Seeds : మనం వంటల తయారీలో ఉపయోగించే వాటిల్లో నువ్వులు కూడా ఒకటి. నువ్వులనే కాకుండా నువ్వుల నూనెను కూడా మనం ఉపయోగిస్తూ ఉంటాం. మన భారత దేశంలో నువ్వులను వంటలల్లోనే కాకుండా ఔషధ ద్రవ్యంగా, హోమ ద్రవ్యంగా, పాప నాశన ద్రవ్యంగా, పితృత తర్పణ ద్రవ్యంగా కూడా ఉపయోగిస్తారు. నువ్వులలో తెల్ల నువ్వులు, ఎర్ర నువ్వులు, నల్ల నువ్వులు, పైర నువ్వులు, అడవి నువ్వులను అని అనేక రకాలు ఉంటాయి. నువ్వులు కారం, చేదు, తీపి రుచులను కలిగి వేడి చేసి తరువాత చలువ చేసే గుణాన్ని కలిగి ఉంటాయి. నువ్వులను వాడడం వల్ల వాత రోగాలు, చర్మ రోగాలు అన్నీ హరించుకుపోతాయి. శరీరం బలంగా, కాంతివంతంగా ఉండేలా చేయడంలో కూడా నువ్వులు మనకు ఉపయోగపడతాయి.
వెంట్రుకలు నల్లగా, ఒత్తుగా పెరిగేలా చేయడంలో, బాలింతలలో పాల ఉత్పత్తిని పెంచడంలో నువ్వులు ఎంతో సహాయపడతాయి. నువ్వులు అన్నింటిలోకెల్లా నల్ల నువ్వులు ఎంతో శ్రేష్టమైనవి. ఎర్ర నువ్వులు మధ్యమమైనవి. తెల్ల నువ్వులు అల్ప గుణాన్ని కలిగి ఉంటాయి. నువ్వులను ఏ పదార్థాలతో కలిపినా వాటి రుచి పెరుగుతుంది. అంతేకాకుండా ఇతర పదార్థాలతో కలిపినప్పుడు వాటి గుణాన్ని పోగొట్టుకోకుండా ఇతర పదార్థాల గుణాలతో కలిసి పోతాయి. నువ్వులను నేరుగా ఉపయోగించడం వల్ల శరీరంలో కఫం, వాతం పెరుగుతుంది. వీటిని దోరగా వేయించి కానీ, తేనెతో కలిపి కానీ ఉపయోగించడం వల్ల ఎటువంటి దోషాలు కలగవు. నువ్వులు అన్ని ధాన్యాల కంటే ఎంతో ఉత్తతమైనవి. శరీరానికి అమితమైన బలాన్ని కలిగించడంలో, పురుషులలో వీర్య వృద్ధిని కలిగించడంలో ఇవి ఎంతగానో దోహదపడతాయి.
మూత్రం బిగుసుకు పోయిన వారు నువ్వులను, పత్తిగింజలను సమపాళ్లలో తీసుకుని కళాయిలో వేసి మాడ్చి బూడిద చేయాలి. ఈ బూడిదను పావు టీ స్పూన్ మోతాదులో తీసుకుని దానిని 100 గ్రాముల పెరుగులో వేసి కలపాలి. ఇందులోనే 20 గ్రాముల తేనెను కూడా వేసి కలిపి తినడం వల్ల రెండు పూటల్లోనే సమస్య తగ్గి మూత్రం ధారాళంగా వస్తుంది. మూత్రాశయంలో, మూత్ర పిండాలలో రాళ్ల సమస్యతో బాధపడుతున్న వారు ఎండిన నువ్వుల చెట్టును సమూలంగా సేకరించి కాల్చి బూడిద చేయాలి. ఈ బూడిదను మూడు వేళ్లకు వచ్చినంత పరిమాణంలో తీసుకుని దానిని ఒక కప్పు పాలలో వేసి అందులోనే ఒక టీ స్పూన్ తేనెను కూడా వేసి కలిపి తీసుకుంటూ ఉండడం వల్ల రాళ్లు కరిగిపోయి మూత్రం ద్వారా బయటకు పోతాయి.
దంతాలు బలహీనంగా ఉన్న వారు రోజూ నల్ల నువ్వులను నోట్లో వేసుకుని బాగా నమిలి మింగి అనుపాణంగా చల్లటి నీటిని తాగాలి. ఇలా చేయడం వల్ల క్రమంగా దంతాలు గట్టిపడతాయి. ఈ నువ్వులను నమలలేని స్థితిలో ఉన్నప్పుడు ఈ నల్ల నువ్వుల నూనెను నోట్లో పోసుకుని పక్కిలిస్తూ ఉండడం వల్ల కూడా దంతాలు గట్టిపడతాయి. పురుషుల్లో వీర్య కణాల సంఖ్యను పెంచడంలో కూడా నువ్వులు ఉపయోగపడతాయి. నువ్వులను వేయించి బెల్లం పాకంలో వేసి ఉండలుగా చేసి నిల్వ చేసుకోవాలి. వీటిని రోజుకు ఒకటి చొప్పున తినడం వల్ల పురుషుల్లో వీర్య కణాల సంఖ్య పెరుగుతుంది. అంతేకాకుండా ఈ నువ్వుల ఉండలను తినడం వల్ల శరీరంలో ఉండే వాతం తగ్గుతుంది. కంటి సమస్యలు తగ్గి కంటి చూపు మెరుగుపడుతుంది.
మొలల సమస్యతో బాధపడుతున్న వారు నువ్వులను మెత్తగా నూరి ఆ మిశ్రమాన్ని వేయించి దానిని వస్త్రంలో వేసి మూట కట్టి రోజూ మొలలకు కాపడం పెట్టడం వల్ల మొలల వ్యాధి నయం అవుతుంది. నువ్వులను, వెన్నను కలిపి తగిన మోతాదులో సేవించడం వల్ల మొలల నుండి రక్తం కారడం ఆగి క్రమంగా మొలల హరిస్తాయి. నువ్వులతో పచ్చడిని చేసుకుని తినడం వల్ల రుచిగా ఉండడమే కాకుండా మలబద్దకం సమస్య తగ్గుతుంది. ఆకలి పెరుగుతుంది. కంటి సమస్యలతో బాధపడే వారు నల్ల నువ్వులను నూరి నుదుటికి పట్టించాలి. ఇలా రోజూ చేయడం వల్ల కంటి సమస్యలు తగ్గి కంటి చూపు మెరుగుపడుతుంది. 4 లేదా 5 చుక్కల మంచి నువ్వుల నూనెను కంట్లో వేసుకుంటే కంటి దురదలు, కళ్ల కలకలు తగ్గుతాయి.
అంతేకాకుండా నువ్వుల చెట్టు పూలను సేకరించి దంచి రసాన్ని తీయాలి. ఈ రసాన్ని 3 నుండి 4 చుక్కుల మోతాదులో కంట్లో వేసుకున్నా కూడా కంటి సమస్యలు తగ్గు ముఖం పడతాయి. నోటి పూతతో బాధపడే వారు నువ్వులను, పటిక బెల్లాన్ని నోట్లో వేసుకుని బాగా నమిలి మింగకుండా 10 నిమిషాల పాటు చప్పరించాలి. ఇలా చేయడం వల్ల నోటి పూత సమస్య తగ్గుతుంది. నువ్వులను, అవిసె గింజలను సమపాళ్లలో తీసుకుని దోరగా వేయించి పాలతో మెత్తగా నూరి ఆ మిశ్రమాన్ని వ్రణాలపై వేసి కట్టు కట్టడం వల్ల వ్రణాల వల్ల కలిగే మంటలు, పోట్లు తగ్గి క్రమంగా వ్రణాలు కూడా మాడిపోతాయి. ఈ విధంగా నువ్వులను ఔషధంగా ఉపయోగించి మనకు వచ్చే అనారోగ్య సమస్యల నుండి బయటపడవచ్చని నిపుణులు చెబుతున్నారు.