Diabetes : మారిన జీవన విధానం, ఆహారపు అలవాట్లు మనల్ని అనేక వ్యాధుల బారిన పడేలా చేస్తున్నాయి. ప్రస్తుత కాలంలో మనలో చాలా మందిని వేధిస్తున్న అనారోగ్య సమస్యల్లో షుగర్ వ్యాధి ఒకటి. ఈ వ్యాధి కారణంగా బాధపడే వారి సంఖ్య రోజురోజుకు పెరుగుతుంది. ఈ షుగర్ వ్యాధి కారణంగా మనం ఇతర అనేక అనారోగ్య సమస్యలను ఎదుర్కొవాల్సి ఉంటుంది. ఈ వ్యాధి బారిన పడిన వారు జీవితాంతం మందులు మింగాల్సి ఉంటుంది. ఖచ్చితమైన ఆహార నియమాలను పాటించాల్సి ఉంటుంది. షుగర్ వ్యాధి బారిన పడగానే చాలా మంది కుంగిపోతుంటారు. నిరాశ నిస్పృహాలకు లోనవుతుంటారు. షుగర్ వ్యాధి బారిన పడగానే అధైర్యపడకూడదు.
ఆహార నియమాలు పాటిస్తూ , వ్యాయామం చేస్తూ, చక్కటి జీవన విధానాన్ని అవలంబిస్తూ ఉంటే షుగర్ వ్యాధి నియంత్రణలో ఉంటుంది. మన ఇంట్లో తయారు చేసే వెజిటెబుల్ సలాడ్ తో షుగర్ వ్యాధిని నియంత్రించుకోవచ్చని నిపుణులు చెబుతున్నారు. సలాడ్ షుగర్ వ్యాధి గ్రస్తులకు అమృతం వంటిది అని వారు తెలియజేస్తున్నారు. షుగర్ వ్యాధిని నియంత్రించే ఈ సలాడ్ ను ఎలా తయారు చేసుకోవాలి.. తయారీకి కావల్సిన పదార్థాలు ఏమిటి.. అన్న వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం. ఈ సలాడ్ ను తయారు చేసుకోవడానికి గానూ ఒక కప్పు కీర దోస ముక్కలను,ఒక కప్పు టమాట ముక్కలను, కొద్దిగా తరిగిన కొత్తిమీరను, పావు కప్పు తరిగిన ఉల్లిపాయ ముక్కలను, తగినంత ఉప్పును, ఒక టీ స్పూన్ మిరియాల పొడిని, రెండు టీ స్పూన్ల నిమ్మరసాన్ని, రెండు టీ స్పూన్ల ఆలివ్ నూనెను ఉపయోగించాల్సి ఉంటుంది.
కీరదోసలో కార్బోహైడ్రేట్స్ తక్కువగానూ, పీచు పదార్థాలు ఎక్కువగానూ ఉంటాయి. షుగర్ వ్యాధిని తగ్గించడంలో కీరదోస చక్కగా పని చేస్తుంది. టైప్ 2 డయాబెటిస్ తో బాధపడే వారు పోషకాలు, పీచు పదార్థాలు ఎక్కువగా ఉన్న ఆహారాన్ని తీసుకోవాలి. అంతేకాకుండా కీర దోసను తీసుకోవడం వల్ల రక్తపోటు కూడా అదుపులో ఉంటుంది. అలాగే టమాటాలో కూడా క్యాలరీలు తక్కువగా, పీచు పదార్థాలు ఎక్కువగా ఉంటాయి. అదే విధంగా ఈ సలాడ్ తయారీలో ఉపయోగించే ఉల్లిపాయలు కూడా మన ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. జలుబు నుండి రక్తపోటు వరకు అన్ని రకాల వ్యాధులను నివారించడంలో ఉల్లిపాయలు మనకు సహాయపడతాయి.
నిమ్మరసం కూడా షుగర్ వ్యాధిని నియంత్రించడంలో ఉపయోగపడుతుంది. ఇందులో ఉండే ఫైబర్ రక్తపోటును తగ్గించి గుండె ఆరోగ్యాన్ని కాపాడుతుంది. శరీరంలో కొవ్వు స్థాయిలను, రక్తంలో చక్కెర స్థాయిలను తగ్గించే శక్తి ఆలవ్ నూనెకు ఉందని నిపుణులు చెబుతున్నారు. ఈ సలాడ్ ను తయారు చేసుకోవడానికి గానూ ముందుగా ఒక గిన్నెలో ఆలివ్ నూనెను వేసి అందులో ఉప్పు, మిరియాల పొడి, నిమ్మరసం వేసి కలపాలి. తరువాత అందులో మిగిలిన పదార్థాలను వేసి కలపాలి. ఇలా చేయడం వల్ల టమాట కీరదోస సలాడ్ తయారవుతుంది. దీనిని ప్రతిరోజూ తీసుకోవడం వల్ల టైప్ 2 డయాబెటిస్ ను నియంత్రించుకోవచ్చని నిపుణులు చెబుతున్నారు.