Eye Vision : ప్రస్తుత కాలంలో మనలో చాలా మంది కంటి చూపు మందగించడం వంటి సమస్యలతో బాధపడుతున్నారు. చిన్నా పెద్దా అనే తేడా లేకుండా అందరూ ఈ సమస్యల బారిన పడుతున్నారు. మారిన మన జీవన విధానం, పోషకాహార లోపం, కంప్యూటర్ ల వినియోగం ఎక్కువవడం, సెల్ ఫోన్ లను ఎక్కువగా వాడడం వంటి వివిధ కారణాల వల్ల కంటిచూపు తగ్గుతుంది అలాగే కళ్లు మసకగా కనిపించడం వంటి ఇతర సమస్యలు కూడా తలెత్తుతున్నాయి. పిల్లలు కూడా ఎక్కువగా ఈ సమస్య బారిన పడుతున్నారు. కొన్ని రకాల పండ్లను ఆహారంగా తీసుకోవడం వల్ల మనం సులభంగా కంటి చూపును పెంచుకోవచ్చని నిపుణులు చెబుతున్నారు. కంటి చూపును మెరుగుపరిచే పండ్ల గురించి ఇప్పుడు తెలుసుకుందాం.
కంటి చూపును మెరుగుపరచడంలో నిమ్మజాతికి చెందిన పండ్లు మనకు ఎంతగానో ఉపయోగపడతాయి. వీటిలో అధికంగా ఉండే విటమిన్ సి కంటిలోని రక్తనాళాల ఆరోగ్యాన్ని మెరుగుపరచడంలో ఉపయోగపడుతుంది. తద్వారా కంటి చూపు కూడా మెరుగుపడుతుంది. ఈ పండ్లను తీసుకోవడం వల్ల వయసు పైబడడం వల్ల వచ్చే దృష్టి లోపాలు, కంటిలో శుక్లాలు వంటి సమస్యలు కూడా తగ్గుతాయి. అదే విధంగా స్ట్రాబెర్రీస్, కార్న్ బెర్రీ, బ్లాక్ బెర్రీ వంటి పండ్లు కూడా కంటి ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తాయి. వీటిలో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు కంటి చూపును మెరుగుపరచడంతో పాటు కళ్లు పొడిబారడం వంటి సమస్యలను తగ్గించడంలో కూడా ఉపయోగపడతాయి.
అదే విధంగా కంటి చూపుకు సంబంధించిన సమస్యలతో బాధపడే వారు అరటి పండ్లను తీసుకోవడం వల్ల మంచి ఫలితం ఉంటుంది. దీనిలో ఉండే పొటాషియం కంటి చూపును సంరక్షిచండంలో ముఖ్యంగా కళ్లు పొడిబారడాన్ని తగ్గించడంలో ఉపయోగపడుతుంది. అలాగే మామిడి కాయలను, బొప్పాయి పండ్లను తీసుకోవడం వల్ల కూడా మనం కంటి చూపు దెబ్బతినకుండా కాపాడుకోవచ్చు. వీటిలో ఉండే లుటీన్ మరియు జియాక్సంతిన్ అనే పోషకాలు యాంటీ ఆక్సిడెంట్లుగా పని చేస్తాయి. ఇవి సహజ సిద్ద సన్ బ్లాక్స్ గా పని చేస్తాయి. రెటీనాలోకి వచ్చే అదనపు కాంతిని గ్రహించడంలో, బ్లూటైట్ నుండి కంటిని సంరక్షించడంలో కూడా ఇవి సహాయపడతాయి. అదే విధంగా ఆప్రికాట్ లను తీసుకోవడం వల్ల కూడా మనం కంటి చూపును మెరుగుపరుచుకోవచ్చు.
విటమిన్ ఎ, విటమిన్ సి, విటమిన్ ఇ మరియు కెరోటినాయిడ్స్, బీటా కెరోటీన్ వంటి పోషకాలు ఈ ఆప్రికాట్ లో ఎక్కువగా ఉంటాయి. ఇవి రాత్రి పూట చూపును మెరుగుపరచడంతో పాటు అతినీల లోహిత కిరణాల నుండి రెటీనాను కాపాడడంలో కూడా సహాయపడతాయి. ఈ పండ్లను తీసుకోవడం వల్ల కంటి చూపు మెరుగుపడడంతో పాటు చూపు కూడా దెబ్బతిన్నకుండా ఉంటుంది. కంటి చూపు మందగించడం వంటి సమస్యలతో బాధపడే వారు ఈ పండ్లను తీసుకోవడం వల్ల చక్కటి కంటి చూపును సొంతం చేసుకోవచ్చని నిపుణులు చెబుతున్నారు.