Jamun : మన ఆరోగ్యాన్ని మెరుగుపరుచుకోవడానికి మనం ఆహారంగా తీసుకునే పండ్లలో నేరేడు పండ్లు కూడా ఒకటి. ప్రకృతి సిద్దంగా లభించే పండ్లల్లో ఇవి కూడా ఒకటి. మన శరీరానికి అవసరమయ్యే అనేక రకాల పోషకాలు ఈ పండ్లలో ఉంటాయి. శరీరానికి శక్తిని ఇవ్వడంతోపాటు కొన్ని రకాల అనారోగ్యాలను నయం చేయడంలో ఈ నేరేడు పండ్లు మనకు సహాయపడతాయి. కేవలం పండ్లే కాకుండా నేరేడు చెట్టు ఆకులు, బెరడు మనకు మేలు చేస్తాయి. నేరేడు పండ్లలో ఉన్న ఆమ్ల గుణం కారణంగా వీటిని జామ్, వెనిగర్, ఆల్కహాల్ వంటి వాటి తయారీలో ఉపయోగిస్తారు. నేరేడు పండ్లను తినడం వల్ల కలిగే ఆరోగ్యకరమైన ప్రయోజనాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం.
మధుమేహ వ్యాధిగ్రస్తులకు నేరేడు పండ్లు వరంగా పని చేస్తాయి. వీటిని తినడం వల్ల రక్తంలో చక్కెర స్థాయిలు నియంత్రణలో ఉంటాయి. మధుమేహం కారణంగా వచ్చే ఇతర అనారోగ్య సమస్యల బారిన పడకుండా చేయడంలో కూడా ఇవి సహాయపడతాయి. నేరేడు పండ్లనే కాకుండా నేరేడు గింజలను ఉపయోగించి కూడా మనం చక్కెర వ్యాధిని నియంత్రించుకోవచ్చు. నేరేడు గింజలను ఎండబెట్టి పొడిగా చేసి నీటిలో కలుపుకుని తాగడం వల్ల రక్తంలో చక్కెర స్థాయిలు నియంత్రణలో ఉంటాయి. నేరేడు పండ్లను తినడం వల్ల గుండె జబ్బులు రాకుండా ఉంటాయి. వీటిలో అధికంగా ఉండే పొటాషియం, యాంటీ ఆక్సిడెంట్లు గుండె, మెదడు పని తీరును మెరుగుపరుస్తాయి.
దంతాలు, చిగుళ్ల సమస్యలతో బాధపడే వారు నేరేడు పండ్లను తినడం వల్ల మంచి ఫలితం ఉంటుంది. ఈ పండ్లను తినడం వల్ల నోటి దుర్వాసన, దంతాల నొప్పులు, చిగుళ్ల వాపు, చిగుళ్ల నుండి రక్తం కారడం వంటి సమస్యలు తగ్గుతాయి. మన శరీరం డీ హైడ్రేషన్ బారిన పడకుండా చేయడంలో కూడా ఈ నేరేడు పండ్లు దోహదపడతాయి. చర్మంపై అలర్జీలను తగ్గించి, చర్మాన్ని ఆరోగ్యంగా ఉంచడంలో కూడా ఈ పండ్లు తోడ్పడతాయి. మొటిమలతో బాధపడే వారు నేరేడు పండు గింజలను పొడిగా చేసి ఆ పొడిని పాలతో కలిపి పేస్ట్ గా చేసుకోవాలి. ఈ పేస్ట్ ను ముఖానికి రాసుకుని ఆరిన తరువాత కడిగేయాలి. ఇలా చేయడం వల్ల చాలా త్వరగా మొటిమలు తగ్గుతాయి.
ఈ పండ్లను తినడం వల్ల వృద్ధాప్య ఛాయలు త్వరగా మన దరిచేరకుండా ఉంటాయి. కంటి చూపును మెరుగుపరచడంలో, ఎముకలను దృఢంగా ఉంచడంలో, శరీరంలో రోగ నిరోధక శక్తిని పెంచడంలో, అధిక రక్తపోటును నియంత్రించడంలో ఈ పండ్లు మనకు ఎంతగానో సహాయపడతాయి. ఈ పండ్లను తినడం వల్ల దీర్ఘకాలంగా వేధిస్తున్న శ్వాస సంబంధమైన సమస్యలు కూడా తగ్గుతాయి. రక్తహీనతతో బాధపడే వారు ఈ పండ్లను తినడం వల్ల మంచి ఫలితం ఉంటుంది.
నేరేడు పండ్లను తినడం వల్ల జీర్ణక్రియ కూడా మెరుగుపడుతుంది. నేరేడు పండ్లల్లో ఉప్పును, జీలకర్ర పొడిని వేసి తీసుకుంటే పొట్టలో గ్యాస్ సమస్య తగ్గుతుంది. కాలేయాన్ని శుభ్రపరిచి, కాలేయ పనితీరును మెరుగుపరచడంలో కూడా ఇవి ఎంతగానో ఉపయోగపడతాయి. మూత్రాశయ సమస్యలకు కూడా నేరేడు పండ్లు ఔషధంగా పని చేస్తాయి. వీటిని తినడం వల్ల శరీరంలో వేడి తగ్గుతుంది. ఈ విధంగా నేరేడు పండ్లు మనకు ఎంతో ఉపయోగపడతాయని, వీటిని తినడం వల్ల మన శరీరానికి ఎంతో మేలు కలుగుతుందని నిపుణులు చెబుతున్నారు.