Biscuits : బిస్కెట్లు అంటే సహజంగానే చాలా మందికి ఇష్టంగా ఉంటుంది. అందుకనే మనకు మార్కెట్‌లో భిన్న రకాల బిస్కెట్లు అందుబాటులో ఉన్నాయి. ఎన్నో రుచికరమైన బిస్కెట్లను మనం కొనుగోలు చేసి తింటుంటాం. అయితే కాస్త శ్రమించాలే కానీ మనం ఇంట్లోనే ఓవెన్ లేకుండానే వీటిని తయారు చేయవచ్చు. ఇక బిస్కెట్లను ఎలా తయారు చేయాలో ఇప్పుడు తెలుసుకుందాం.
బిస్కెట్స్ తయారీకి కావల్సిన పదార్థాలు..
నెయ్యి – పావు కప్పు, పంచదార పొడి – ముప్పావు కప్పు, ఉప్పు – చిటికెడు, బేకింగ్ పౌడర్ – అర టీ స్పూన్, మైదా పిండి – ఒక కప్పు, యాలకుల పొడి – పావు టీ స్పూన్, నీళ్లు – తగినన్ని, జీడి పప్పు పలుకులు – కొద్దిగా, పిస్తా పలుకులు – కొద్దిగా.
బిస్కెట్స్ తయారీ విధానం..
ముందుగా ఒక గిన్నెలో నెయ్యిని, పంచదార పొడిని, ఉప్పును, బేకింగ్ పౌడర్ ను వేసి అంతా కలిసేలా బాగా కలుపుకోవాలి. తరువాత యాలకుల పొడిని, మైదా పిండిని వేసి నీళ్లు వేయ్యకుండా కలుపుకోవాలి. తరువాత తగినన్ని నీళ్లు పోస్తూ చపాతీ పిండిలా కలుపుకోవాలి. ఇప్పుడు ఒక స్టీల్ ప్లేట్ ను తీసుకుని దానికి కొద్దిగా నెయ్యిని రాసి పక్కకు పెట్టుకోవాలి. ఇప్పుడు కావల్సిన పరిమానంలో పిండిని తీసుకుంటూ బిస్కెట్ల ఆకారంలో చేత్తో వత్తుకోవాలి. ఇలా వత్తుకున్న బిస్కెట్లపై జీడి పప్పు పలుకులతో, పిస్తా పలుకులతో గార్నిష్ చేసుకుని వాటిని నెయ్యిని రాసిన ప్లేట్ లో పెట్టుకోవాలి.
ఇప్పుడు అడుగు భాగం మందంగా ఉండే కళాయిని కానీ కుక్కర్ కానీ తీసుకుని దానిలో ఒక ఇంచు మందంలో ఉప్పును కానీ, ఇసుకను కానీ వేసి అంతా సమానంగా విస్తరించాలి. ఇలా చేసిన తరువాత దానిలో ఒక స్టీల్ స్టాండ్ కానీ, ఇనుప స్టాండ్ కానీ ఉంచాలి. ఇప్పుడు కుక్కర్ లేదా కళాయి మీద మూతను ఉంచి 5 నిమిషాల పాటు వేడి చేయాలి. ఇలా వేడి చేసి న తరువాత మూత తీసి అందులో బిస్కెట్లను ఉంచిన ప్లేట్ ను పెట్టి మరలా మూత పెట్టాలి. వీటిని మధ్యస్థ మంటపై 15 నుండి 20 నిమిషాల వరకు ఉడికించాలి.
బిస్కెట్ల అడుగు భాగం ఎర్రగా అయిన తరువాత స్టవ్ ఆఫ్ చేసి బిస్కెట్లను బయటకు తీసుకోవాలి. ఇలా చేయడం వల్ల బయట బేకరీలలో దొరికే విధంగా ఉండే బిస్కెట్లు తయారవుతాయి. ఈ విధంగా ఇంట్లో ఓవెన్ లేకపోయినా కూడా ఎంతో రుచిగా ఉండే బిస్కెట్లను మనం చాలా సులభంగా తయారు చేసుకోవచ్చు.