Cashews Benefits : ప్రస్తుత కాలంలో వ్యాధి నివారణకే కాదు.. శరీర పోషణకు కూడా చాలా మంది మాత్రల మీదనే ఆధార పడుతున్నారు. నిజానికి మనం తీసుకునే కొన్ని రకాల ఆహార పదార్థాల ద్వారానే వ్యాధిని నివారించుకోవడంతో పాటు మన శరీరానికి కావల్సిన పోషకాలను పొందవచ్చు. అలాంటి ఆహార పదార్థాల్లో జీడిపప్పు ఒకటి. జీడిపప్పులో ప్రోటీన్లు సమృద్ధిగా ఉంటాయి. ఈ ప్రోటీన్లు చాలా సులభంగా జీర్ణమవుతాయి. మాంసం కంటే కూడా ఎక్కువ ప్రోటీన్లు జీడిపప్పులో ఉంటాయి. జీడిపప్పును తీసుకోవడం వల్ల మనం అనేక ఆరోగ్య ప్రయోజనాలను పొందవచ్చు. అలాగే వీటిని ఒక నిర్ణీత మోతాదులో మాత్రమే తీసుకోవాలి. వీటిని ఎక్కువగా తీసుకోవడం వల్ల ముక్కు నుండి రక్తం కారడం, కడుపు నొప్పి, విరేచనాలు వంటి సమస్యల బారిన పడే అవకాశం ఉంది.
తరచూ విరోచనాల బారిన పడే వారు వీటిని తినకపోవడమే ఉత్తమం. జీడిపప్పును ఎండు ద్రాక్షతో కలిపి తింటే రుచిగా ఉండడంతో పాటు రక్తహీనత సమస్య కూడా తగ్గుతుంది. జీడిపప్పును తీసుకోవడం వల్ల నరాలకు పటుత్వం కలగడంతో పాటు జీవ శక్తి కూడా పెంపొందుతుంది. శారీరక బలహీనతను తగ్గించడంతో పాటు తరచూ వాంతులు కావడాన్ని తగ్గిస్తుంది. గుండెకు అలాగే మూత్రపిండాలకు జీడిపప్పు టానిక్ లా పని చేస్తుంది. జీడిపప్పు నుండి తీసిన నూనెను క్రమం తప్పకుండా లేపనంగా రాయడం వల్ల అన్ని రకాల పులిపిర్లు తగ్గుతాయి. జీడిపప్పులో సమృద్ధిగా ఉండే ఐరన్ రక్తహీనతను తగ్గించడంలో ఉపయోగించబడుతుంది. జీడిపప్పును ప్రతిరోజూ తీసుకోవడం వల్ల పురుషుల్లో వచ్చే నపుంసకత్వం సమస్య కూడా తగ్గుతుంది. ప్రతిరోజూ పరగడుపున జీడిపప్పును తేనెతో కలిపి తీసుకోవడం వల్ల జ్ఞాపకశక్తి పెరుగుతుంది.
మాంసంలో జీవక్రియలను దెబ్బతీసే యూరిక్ యాసిడ్ ఉంటుంది. దానికి విరుగుడుగా జీడిపప్పును తీసుకోవడం వల్ల యూరిక్ యాసిడ్ తయారవడం తగ్గుతుంది. అలాగే శరీరంలో ఉన్న యూరిక్ యాసిడ్ స్థాయిలు కూడా తగ్గుతాయి. పునరుజ్జీవం కలిగించే శక్తి కూడా జీడిపప్పుకు ఉంది. వయసు మీద పడడం వల్ల మన శరీరంలో కొన్ని పరిణామాలు ఎదురవుతుంటాయి. ఆ పరిణామాల వేగాన్ని తగ్గించడంలో రైబో ప్లేవిన్ ఎంతగానో ఉపయోగపడుతుంది. జీడిపప్పులో ఉండే రైబోప్లేవిన్ వృద్ధాప్య ఛాయలు మన దరిచేరకుండా చేయడంలో సమాయపడుతుంది.
బొల్లి వ్యాధితో బాధపడే వారు జీడిపప్పును తింటూ జీడి నూనెను మచ్చలపై రాయడం వల్ల బొల్లి మచ్చలు తగ్గి చర్మం సహజ రంగును సంతరించుకుంటుంది. మలబద్దకం సమస్యతో బాధపడే వారు జీడిపప్పును, ఎండుద్రాక్షతో కలిపి తీసుకుంటే మంచి ఫలితం ఉంటుంది. జీడిపప్పులో ఆరోగ్యానికి మేలు చేసే కొవ్వులు ఉంటాయి. వీటిని తీసుకోవడం వల్ల గుండె ఆరోగ్యం మెరుగుపడుతుంది. జీడిపప్పును తీసుకోవడం వల్ల రక్తపోటు అదుపులో ఉంటుంది. ఎముకలు ధృడంగా, ఆరోగ్యంగా తయారవుతాయి. జీడిపప్పులో ఉండే సెలెనియం, విటమిన్ ఇ లు యాంటీ ఆక్సిడెంట్లుగా పని చేసి ఫ్రీ రాడికల్స్ ను నశింపజేస్తాయి. దీంతో క్యాన్సర్ వచ్చే అవకాశాలు కూడా తక్కువగా ఉంటాయి.
మెదడును చురుకుగా ఉంచడంలో, ఇన్ఫెక్షన్ లను తగ్గించడంలో, హార్మోన్ల అసమతుల్యతను తగ్గించడంలో కూడా జీడిపప్పు మనకు తోడ్పడుతుంది,. జీడిపప్పుతో ఉపయోగాలు ఉన్నాయి కదా అని వీటిని అధికంగా తీసుకోకూడదు. రోజుకు 4 నుండి 8 జీడిపప్పు పలుకులను మాత్రమే తీసుకోవాలని అప్పుడే మనకు మేలు కలుగుతుందని నిపుణులు చెబుతున్నారు. ఈవిధంగా జీడిపప్పు మన శరీరానికి కావల్సిన పోషకాలను అందించడంతో పాటు అనారోగ్య సమస్యలను తగ్గించడంలో కూడా ఉపయోగపడతాయని నిపుణులు తెలియజేస్తున్నారు.