Karam Boondi Recipe : స్వీట్ షాపుల్లో ల‌భించే కారం బూందీని ఇంట్లోనే ఇలా రుచిగా చేసుకోవ‌చ్చు..!

Karam Boondi Recipe : మ‌న‌కు స్వీట్ షాపుల్లో ల‌భించే చిరుతిళ్ల‌ల్లో కార‌బూందీ కూడా ఒక‌టి. కార బూందీ చాలా రుచిగా ఉంటుంది. దీనిని అంద‌రూ ఎంతో ఇష్టంగా తింటూ ఉంటారు. కొనుగోలు చేసి మ‌రీ ఈ బూందీని తింటుంటారు. క‌ర‌క‌ర‌లాడుతూ ఎంతో రుచిగా చ‌క్క‌గా ఉండే ఈ బూందీని మ‌నం ఇంట్లో కూడా త‌యారు చేసుకోవ‌చ్చు. కొన్నిచిట్కాల‌ను పాటిస్తూ చేయ‌డం వ‌ల్ల కార‌బూందీ చ‌క్క‌గా వ‌స్తుంది. స్వీట్ షాపుల్లో ల‌భించే విధంగా ఉండే కార‌బూందీని ఎలా త‌యారు చేసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం.

కారం బూందీ త‌యారీకి కావ‌ల్సిన ప‌దార్థాలు..

శ‌న‌గ‌పిండి – ఒక క‌ప్పు, బియ్యం పిండి – పావు క‌ప్పు, ఉప్పు – త‌గినంత‌, వంట‌సోడా – పావు టీ స్పూన్, నూనె – డీప్ ఫ్రైకు స‌రిప‌డా, ప‌ల్లీలు – 3 టీ స్పూన్స్, జీడిప‌ప్పు – 3 టీ స్పూన్స్, వెల్లుల్లి రెబ్బ‌లు – 10, క‌రివేపాకు – రెండు రెమ్మ‌లు, కారం – త‌గినంత‌.

Karam Boondi Recipe in telugu make in this style Karam Boondi Recipe in telugu make in this style
Karam Boondi Recipe

కారం బూందీ తయారీ విధానం..

ముందుగా ఒక గిన్నెలో శ‌న‌గ‌పిండిని, బియ్యంపిండిని తీసుకోవాలి. తరువాత ఇందులో కొద్దిగా ఉప్పు, వంట‌సోడా వేసి క‌లుపుకోవాలి. త‌రువాత ఒక క‌ప్పు కంటే కొద్దిగా ఎక్కువ నీటిని పోసి పిండిని క‌లుపుకోవాలి. పిండిని ఉండ‌లు లేకుండా క‌లిపిన త‌రువాత క‌ళాయిలో నూనె పోసి వేడి చేయాలి. నూనె బాగా వేడైన త‌రువాత చిల్లుల గంటెను లేదా బూందీ గంటెను తీసుకుని దాన్ని క‌ళాయి పై ఉంచి అందులో త‌గినంత పిండిని వేసి గంటెతో తిప్పుతూ బూందీని వేసుకోవాలి. ఈ బూందీని ఎర్ర‌గా అయ్యే వ‌ర‌కు కాల్చుకుని గిన్నెలోకి తీసుకోవాలి. ఇలా బూందీ వేసే ప్ర‌తిసారి చిల్లుల గంటెకు లేదా బూందీ గంటెకు పిండి లేకుండా తుడుచుకోవాలి. ఇలా చేయ‌డం వ‌ల్ల బూందీ గుండ్ర‌టి ఆకారంలో వ‌స్తుంది. అలాగే నూనె కూడా ఎప్పుడూ వేడిగా ఉండేలా చూసుకోవాలి. అప్పుడే బూందీ బాగా పొంగుతుంది.

ఇలా బూందీ అంత‌టిని త‌యారు చేసుకున్న త‌రువాత అదే నూనెలో పల్లీల‌ను వేసి వేయించి బూందీలో వేసుకోవాలి. అలాగే జీడిప‌ప్పు, క‌రివేపాకు, వెల్లుల్లి రెబ్బ‌లు కూడా వేసి వేయించి బూందీలో వేసుకోవాలి. ఇప్పుడు ఈ బూందీలో త‌గినంత ఉప్పు, కారం వేసి అన్నీ క‌లిసేలా బాగా క‌లుపుకోవాలి. ఇలా చేయ‌డం వ‌ల్ల అచ్చం స్వీట్ షాపుల్లో ల‌భించే విధంగా ఉండే బూందీ త‌యార‌వుతుంది. దీనిని గాలి త‌గ‌ల‌కుండా నిల్వ‌చేసుకోవ‌డం వ‌ల్ల ఎక్కువ రోజులు కర‌క‌ర‌లాడుతూ తాజాగా ఉంటుంది. ఈ చిట్కాల‌ను పాటిస్తూ చేయ‌డం వ‌ల్ల క‌ర‌క‌ర‌లాడుతూ రుచిగా ఉండే బూందీని మ‌నం ఇంట్లోనే త‌యారు చేసుకోవ‌చ్చు. బ‌య‌ట కొనుగోలు చేసే ప‌ని లేకుండా ఇలా ఇంట్లోనే బూందీని త‌యారు చేసుకుని స్నాక్స్ గా తిన‌వ‌చ్చు. ఈ బూందీని అంద‌రూ ఇష్టంగా తింటారు. పిల్ల‌లు మ‌రీ ఇష్టంగా తింటారు.

D

Recent Posts