Amrutha Kada Mokka : మన ఇంటి పరిసరాలలో, పొలాల గట్ల మీద విరివిరిగా కనిపించే మొక్కల్లో అమృతకాడ మొక్క కూడా ఒకటి. దీనిని చాలా మంది చూసే ఉంటారు. అందరూ ఈ అమృతకాడ మొక్కను కలుపు మొక్కగా భావిస్తారు. కానీ ఈ మొక్కలో ఉండే ఔషధ గుణాలు అన్నీ ఇన్నీ కావు. దీనిని వెన్న దేవి, నీరు కసు అని కూడా అంటారు. ఆసియా, ఆఫ్రికా దేశాలలో ఈ మొక్క ఎక్కువగా కనిపిస్తుంది. ఈ మొక్క ఆకులను కూరగా వండుకుని తింటారు. ఇలా కూరగా వండుకుని తినడం వల్ల మనం అనేక రకాల అనారోగ్య సమస్యల నుండి బయటపడవచ్చు. పశువులు కూడా ఈ మొక్కను ఎంతో ఇష్టంగా తింటాయి.
దీనిని తినడం వల్ల పశువుల్లో పాల ఉత్పత్తి పెరుగుతుంది. నీరు నిల్వ ఉండే చోట, చేలల్లో, రోడ్డుకు ఇరువైపులా.. ఇలా ఎక్కడపడితే అక్కడ ఈ మొక్క మనకు కనబడుతుంది. ఈ మొక్క ఆకులల్లో విటమిన్ సి అధికంగా ఉంటుంది. తలనొప్పిని, కుష్టును, కామెర్లను, మలబద్దకాన్ని, మూర్ఛను, జ్వరాన్ని తగ్గించడంలో ఈ అమృతకాడ మొక్క ఎంతగానో ఉపయోగపడుతుంది. చర్మాన్ని ఆరోగ్యంగా ఉంచడంలో కూడా ఈ మొక్క సహాయపడుతుంది. స్త్రీలలో వచ్చే సంతాన లేమి సమస్యలను నయం చేయడంలో కూడా అమృతకాడ మొక్క దోహదపడుతుంది. ఈ మొక్క ఆకులను పేస్ట్ గా నూరి గాయాలపై రాయడం వల్ల గాయాలు త్వరగా మానుతాయి.
అమృతకాడ మొక్క వేర్లను జ్యూస్ గా చేసుకుని తాగడం వల్ల జీర్ణాశయ సంబంధిత సమస్యలు నయం అవుతాయి. నిద్రలేమి, రేచీకటి, కళ్ల కలక వంటి వాటిని తగ్గించడంలో కూడా ఈ మొక్కను ఔషధంగా ఉపయోగిస్తారు. అమృత కాడ మొక్క ఆకులు యాంటీ ఇన్ ఫ్లామేటరీ లక్షణాలను కలిగి ఉంటాయి. శరీరంలో వచ్చే నొప్పులను, వాపులను తగ్గించడంలో ఈ మొక్క దోహదపడుతుంది. చెవి, కర్ణభేరి సమస్యలను నయం చేయడానికి, పంటి నొప్పిని తగ్గించడానికి, పాము కాటుకు విరుగుడుగా కూడా ఈ మొక్కను ఆయుర్వేదంలో ఉపయోగిస్తారు. కలుపు మొక్కగా భావించే ఈ అమృతకాడ మొక్క మనకు వచ్చే అనేక రకాల వ్యాధులను నయం చేయడంలో ఎంతో ఉపయోగపడుతుందని నిపుణులు చెబుతున్నారు.