Figs : అంజీరా పండ్లు.. ఇవి మనందరికీ తెలుసు. ఈ పండ్లను మనం డ్రై ఫ్రూట్స్ గా కూడా తీసుకుంటూ ఉంటాం. అంజీరా పండ్లు ఎంతో చక్కని రుచిని కలిగి ఉంటాయి. దీని శాస్త్రీయ నామం ఫైకస్ కరిక. దీనిని సంస్కృతంలో అంజీర్ అని అంటారు. ఈ పండ్లను తినడం వల్ల మనం ఎన్నో ఆరోగ్యకరమైన ప్రయోజనాలను పొందవచ్చని మనందరికీ తెలుసు. కేవలం అంజీరా పండ్లే కాకుండా ఆకులు, బెరడు, వేర్లు అన్నీ కూడా మనకు ఎంతో ఉపయోగపడతాయి. ప్రపంచంలో అంజీరా పండ్లను ఎక్కువగా ఉత్పత్తి చేస్తున్న దేశాలలో టర్కీ మొదటి స్థానంలో ఉంది. అంజీరా పండ్ల వల్ల కలిగే ఉపయోగాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం. శరీరంలో ఉండే విష పదార్థాలను తొలగించడంలో, మూత్రపిండాలలో ఎక్కువగా ఉన్న నీటిని, ఉప్పును తొలగించడంలో అంజీరా పండ్లు ఎంతగానో సహాయపడతాయి.
ఆయుర్వేదంలో అంజీరా ఆకులను శరీరంలో వేడిని, జ్వరాన్ని తగ్గించడంలో ఔషధంగా వాడతారు. అంజీరా పండ్లలో అధికంగా ఉండే కాల్షియం ఎముకలను దృఢంగా ఉంచడంలో ఉపయోగపడుతుంది. అంజీరా పండ్లను తినడం వల్ల రోజుకు మన శరీరానికి అవసరమయ్యే కాల్షియంలో 5 శాతం కాల్షియం లభిస్తుంది. కేవలం కాల్షియం ఒక్కటే కాకుండా అంజీరాలలో మన శరీరానికి అవసరమయ్యే అనేక రకాల విటమిన్స్, మినరల్స్ కూడా ఉంటాయి. గర్భిణీలు వీటిని ఆహారంలో భాగంగా తీసుకోవడం వల్ల గర్భస్థ శిశువు ఆరోగ్యంగా ఉంటుంది. గర్భిణీలు వీటిని తీసుకోవడం వల్ల మొదటి త్రైమాసికంలో ఉదయం పూట వచ్చే నీరసం తగ్గుతుంది. శరీరానికి కావల్సిన పోషకాలన్నింటినీ అందించినప్పటికీ గర్భిణీ స్త్రీలు వీటిని ఎక్కువగా తినరాదు.
అంజీరా పండ్లలో పీచు పదార్థాలు ఎక్కువగా ఉంటాయి. మలబద్దకాన్ని తగ్గించడంలో ఈ పండ్లు ఎంతో దోహదపడతాయి. ఇవి జీర్ణమవ్వడానికి సమయం ఎక్కువగా పడుతుంది. కనుక వీటిని తినడం వల్ల మనకు ఆకలి త్వరగా వేయదు. అంతేకాకుండా మనం ఆహారాన్ని తక్కువగా తీసుకోవచ్చు. బరువు తక్కువగా ఉన్నవారు అంజీరా పండ్లను పాలతో కలిపి తింటే బరువు పెరుగుతారు. వీటిని తినడం వల్ల కంటిచూపు కూడా మెరుగుపడుతుంది. అంజీరా పండ్లను తినడం వల్ల నిద్రలేమి సమస్య తగ్గుతుంది. దీనితోపాటు కోపం, చికాకు వంటివి కూడా తగ్గుతాయని నిపుణులు చెబుతున్నారు. కాలేయ పని తీరును మెరుగుపరచడంలో కూడా అంజీరా పండ్లు మనకు ఉపయోగపడతాయి. వీటిలో అధికంగా యాంటీ ఆక్సిడెంట్లు శరీరంలో ఉండే ఫ్రీ రాడికల్స్ ను తొలగించి అవయవాలను ఆరోగ్యంగా ఉంచుతాయి.
వయస్సు మీద పడడం వల్ల వచ్చే సమస్యలను తగ్గించడంలో, అకాల వృద్ధాప్యాన్ని రాకుండా చేయడంలో కూడా అంజీరా పండ్లు మనకు ఉపయోగపడతాయి. ఈ విధంగా అంజీరా పండ్లు మనకు ఎంతోఉపయోగపడతాయి. ఇన్ని ఉపయోగాలు ఉన్నప్పటికీ వీటిని మోతాదులకు మించి తినకూడదు. కొందరిలో అంజీర పండ్లు అలర్జీలను కలిగించే అవకాశం కూడా ఉంటుంది. వీటిని అధికంగా తినడం వల్ల అతిసారం కలిగే అవకాశం కూడా ఉంటుంది. రక్తాన్ని పలుచగా చేయడానికి మందులు వాడే వారు అలాగే షుగర్ వ్యాధి గ్రస్తులు కూడా కూడా వీటిని వైద్యుడి సలహా మేరకు మాత్రమే తీసుకోవాలి. అంజీరా పండ్లను తగిన మోతాదులో తీసుకోవడం వల్ల మన శరీరానికి ఎంతో మేలు కలుగుతుందని నిపుణులు చెబుతున్నారు.