Avise Chettu : అవిసె చెట్టు.. ఈ చెట్టును మనలో చాలా మంది చూసే ఉంటారు. తమలపాకు తోటల్లో తమలపాకు తీగను అల్లించడానికి ఈ చెట్టును ఎక్కువగా ఉపయోగిస్తారు. దీనిని అవిశె చెట్టు అని కూడా అంటారు. ఈ అవిసె చెట్టు చూడడానికి మామూలుగా ఉన్నా ఎన్నో ఔషధ గుణాలను కలిగి ఉంటుంది. దీనిని ఔషధంగా ఉపయోగించి మనం అనేక రకాల అనారోగ్య సమస్యల నుండి బయటపడవచ్చని నిపుణులు చెబుతున్నారు. ఆయుర్వేదంలో కూడా ఈ చెట్టును ఉపయోగించి అనేక జబ్బులను నయం చేస్తున్నారు. అవిసె చెట్టులో ఉండే ఔషధ గుణాలు ఏమిటి.. ఈ చెట్టు వల్ల కలిగే ప్రయోజనాలు ఏమిటి.. అన్న వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం.
దీనిని సంస్కృతంలో ఉమ, అతసి, అగస్థ్య వృక్షం అని, హిందీలో అగస్థ్య, మసీనా అని అంటారు. మనకు తెల్ల పువ్వులు పూసేవి, నల్ల పువ్వులు పూసేవి, ఎర్ర పువ్వులు పూసేవి, పసుపు పువ్వులు పూసేవి ఇలా నాలుగు రకాల అవిసె చెట్లు కనిపిస్తాయి. ఈ చెట్టు ఆకులు, బెరడు, పువ్వుల రసం చేదుగా ఉంటాయి. కఫ రోగాలను, క్రిమి జ్వరాలను, రక్త పైత్యాన్ని, సర్ప విషాన్ని హరించే గుణాలను ఈ చెట్టు కలిగి ఉంటుంది. శరీరంలో అధికంగా ఉండే కొవ్వును కరిగించి బరువు తగ్గేలా చేయడంలో కూడా ఈ చెట్టు ఉపయోగపడుతుంది. గవద బిళ్లలతో బాధపడే వారు అవిసె చెట్టు ఆకులను, గుళ్ల సున్నాన్ని కలిపి నూరి గవద బిళ్లలపై రాసి దూదిని అంటించాలి. ఈ విధంగా చేస్తూ ఉండడం వల్ల గవద బిళ్లల సమస్య త్వరగా తగ్గుతుంది లేదా ఈ ఆకుల రసాన్ని పై లేపనంగా రాస్తూ ఉండడం వల్ల కూడా సమస్య తగ్గుతుంది.
అవిసె చెట్టు ఆకులను కూరగా వండుకుని తినడం వల్ల మలబద్దకం సమస్య తగ్గి సుఖ విరేచనం అవుతుంది. అంతేకాకుండా పొట్టతోపాటు ఇతర శరీర భాగాలలో అధికంగా పేరుకుపోయిన కొవ్వు కూడా కరుగుతుంది. కంటి సమస్యలతో బాధపడే వారు అవిసె ఆకులను చేత్తో నలిపి రసాన్ని తీసి ఈ రసాన్ని ఒక చుక్క చొప్పున రెండు కళ్లల్లో వేసుకోవాలి. ఇలా చేస్తూ ఉండడం వల్ల కంటి మసకలు తగ్గి చూపు పెరుగుతుంది. అంతేకాకుండా రేచీకటి సమస్య కూడా తగ్గుతుంది. 5 గ్రాముల అవిసె చెట్టు గింజలను, 5 గ్రాముల ఆవాలను తీసుకుని కలిపి మెత్తగా నూరి ఆ మిశ్రమాన్ని తల కణతల పైన మాత్రమే పట్టులా వేసి పైన కాగితాన్ని అంటించాలి. తరువాత ఇటుక పొడిని వేడి చేసి దానిని వస్త్రంలో వేసి మూట కట్టి పైన కాపడం పెట్టడం వల్ల అప్పటికప్పుడే పార్శ్వపు తలనొప్పి తగ్గుతుంది.
అవిసె పువ్వులను ఎండబెట్టి పొడిగా చేసి జల్లించి నిల్వ చేసుకోవాలి. రోజూ ఈ పొడిని తగిన మోతాదులో తీసుకుని గేదె పాలతో కలిపి మెత్తగా నూరి ఆ మిశ్రమానికి గేదె వెన్నను కలిపి ఒంటికి నలుగుగా పెట్టుకుని ఆరిన తరువాత స్నానం చేస్తూ ఉండడం వల్ల చర్మం తెల్లగా అవ్వడమే కాకుండా కాంతిని కూడా సంతరించుకుంటుంది. అవిసె చెట్టు గింజలను తీసుకుని వాటిని దోరగా వేయించి వాటికి సగం తూకంగా కండ చక్కెరను కలిపి మెత్తగా నూరాలి. ఈ మిశ్రమాన్ని 10 గ్రాముల మోతాదుగా ఉండలుగా చుట్టుకుని నిల్వ చేసుకోవాలి. ఈ ఉండలను రోజుకు రెండు చొప్పున మూత్ర పిండాల సమస్యతో బాధపడే వారు భోజనానికి గంట ముందు తీసుకుంటూ ఉండాలి. ఇలా చేయడం వల్ల అతి త్వరగా మూత్ర సంబంధిత సమస్యలన్నీ నయం అవుతాయి.
ఉబ్బసంతో బాధ పడే వారు దోరగా వేయించిన 10 గ్రాముల అవిసె గింజలను, 10 గ్రాముల మిరియాలను కలిపి పొడిగా చేసి నిల్వ చేసుకోవాలి. ఈ పొడిని రోజుకు రెండు పూటలా మూడు గ్రాముల మోతాదులో ఒక టీ స్పూన్ తేనెతో కలిపి తీసుకోవడం వల్ల ఉబ్బసం తగ్గుతుంది. ప్రతిరోజూ అవిసె చెట్టు పూలను లేదా మొగ్గలను కూరగా చేసుకుని తినడం వల్ల రేచీకటి సమస్య తగ్గుతుంది. ఈ విధంగా అవిసె చెట్టు మనకు ఎంతో ఉపయోగపడుతుందని నిపుణులు చెబుతున్నారు.