Ummetha Seeds : మనలో చాలా మంది కాళ్ల పగుళ్ల సమస్యతో బాధపడుతూ ఉంటారు. కాళ్ల పగుళ్ల సమస్య రావడానికి అనేక కారణాలు ఉంటాయి. శరీరంలో వేడి అధికంగా ఉండడం, పాదాలను సరిగ్గా శుభ్రం చేసుకోక పోవడం, ఎక్కువ సేపు నిలబడడం, పొడి చర్మాన్ని కలిగి ఉండడం వంటి కారణాల వల్ల కాళ్ల పగుళ్ల సమస్య వస్తుంది. అంతేకాకుండా మన పాద రక్షణల కారణంగా కూడా కాళ్ల పగుళ్లు వస్తాయి. వేడి ఎక్కువగా ఉన్న నీటితో స్నానం చేసినా కూడా కాళ్ల పగుళ్లు వస్తాయి. కాళ్ల పగుళ్ల కారణంగా మన పాదాలు చూడడానికి అందవిహీనంగా ఉంటాయి. కొన్ని సార్లు కాళ్ల పగుళ్లను నిర్లక్ష్యం చేయడం వల్ల పగుళ్ల మధ్య కురుపులు, పుండ్లు వచ్చి అవి నొప్పికి కారణమవుతాయి. ఈ నొప్పి కారణంగా మనం సరిగ్గా నడవలేక పోతుంటాం.
ఈ కాళ్ల పగుళ్లను తేలికగా తీసుకోకుండా అవి వచ్చిన వెంటనే వాటిని నయం చేసే ప్రయత్నాలను చేయాలి. వీటిని నయం చేయడానికి రకరకాల ఆయింట్ మెంట్లను, నూనెలను రాస్తూ ఉంటారు. వీటిని ఉపయోగించడం వల్ల ఫలితం అంతంత మాత్రంగానే ఉంటుంది. ఈ కాళ్ల పగుళ్లను నివారించే చికిత్స ఆయుర్వేదంలో కూడా ఉంది. ఆయుర్వేదం ద్వారా కాళ్ల పగుళ్లను ఎలా నివారించుకోవచ్చో ఇప్పుడు తెలుసుకుందాం. కాళ్ల పగుళ్లను నివారించడంలో మనకు ఉమ్మెత్త చెట్టు ఎంతగానో ఉపయోగపడుతుంది. ఉమ్మెత్త చెట్టు గింజలను, నల్ల నువ్వులను, పసుపును సమపాళ్లలో తీసుకుని విడివిడిగా పొడిగా చేసి మరలా అన్నింటినీ కలిపి నిల్వ చేసుకోవాలి.
ఇలా నిల్వ చేసుకున్న పొడిని తగిన మోతాదులో తీసుకుని దానికి గేదె వెన్నను కలిపి పేస్ట్ గా చేసి ఆ పేస్ట్ ను రోజూ రాత్రి పడుకునే ముందు పాదాలకు రాసి ఉదయాన్నే కడిగేయాలి. ఇలా చేస్తూ ఉండడం వల్ల కాళ్ల పగుళ్లు తగ్గుతాయి. అంతేకాకుండా ఉమ్మెత్త గింజలను, సైంధవ లవణాన్ని పొడిగా చేసుకుని నిల్వ చేసుకోవాలి. ఈ పొడికి గేదె వెన్నను కలిపి రోజూ రాత్రి పడుకునే ముందు పాదాలకు రాసుకుని ఉదయాన్నే కడిగేయాలి. ఈ విధంగా చేసినా కూడా కాళ్ల పగుళ్లు త్వరగా తగ్గి పాదాలు అందంగా తయారవుతాయని నిపుణులు చెబుతున్నారు.