Verri Pucha Kaya : ఈ భూమి మీద ఎన్నో ఔషధ గుణాలు కలిగిన మొక్కలు ఉన్నాయి. అలాంటి వాటిల్లో వెర్రి పుచ్చ చెట్టు కూడా ఒకటి. ఈ చెట్టు వెయ్యి రోగాల వెన్ను విరిస్తుందని పెద్దలు చెబుతుంటారు. ఈ చెట్టు ఎక్కువగా గ్రామాలలో, వాగుల వద్ద, గుట్టల ప్రాంతాలలో ఎక్కువగా పెరుగుతూ ఉంటుంది. ఈ చెట్టు తీగ లాగా భూమి మీద పాకుతూ ఉంటుంది. చిన్న దోసకాయంత పరిమాణంలో ఉండి కాయలపైన పుచ్చకాయల లాగా చారలు ఉంటాయి. ఈ కాయల లోపల గింజలు, గుజ్జు ఉంటాయి. ఈ చెట్టులో ప్రతి భాగం ఎన్నో ఔషధ గుణాలను కలిగి ఉంటాయి. మనకు వచ్చే అనేక దీర్ఘకాలిక వ్యాధులను నయం చేయడంలో వెర్రి పుచ్చ చెట్టు ఎంతగానో ఉపయోగపడుతుంది. ఈ చెట్టులో ఉండే ఔషధ గుణాల గురించి , ఈ చెట్టు వల్ల కలిగే ప్రయోజనాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం.
దీనిని సంస్కృతంలో ఇంద్రవారుని, మహేంద్రవారుని అని.. హిందీలో ఇంద్రాయిన్ అని పిలుస్తూ ఉంటారు. దీనికి పిచ్చి పుచ్చ చెట్టు, చేదు పుచ్చ చెట్టు , పెద్ద పాపర, చిన్న పాపర అనే పేర్లు కూడాఉన్నాయి. వెర్రి పుచ్చ చెట్టు చేదుగా, అమితమైన వేడిని కలగజేసే గుణాన్ని కలిగి ఉంటుంది. దీనిని అధిక మోతాదులో తీసుకుంటే విరేచనాలు కూడా అవుతాయి. కడుపులోని మలినాలను, కఫాన్ని, ఉదర రోగాలను, విషాన్ని హరించే శక్తి వెర్రి పుచ్చ చెట్టుకు ఉంటుంది. ఈ చెట్టు ఆకులను ఆముదంలో కానీ, నెయ్యిలో కానీ వేసి వేయించి వ్రణాలపై ఉంచి కట్టుగా కట్టడం వల్ల ఎటువంటి వ్రణాలు అయినా తగ్గిపోతాయి.
తేలు విషాన్ని హరించే శక్తి కూడా ఈ చెట్టుకు ఉంటుంది. తేలు కుట్టిన మరుక్షణమే ఈ వెర్రి పుచ్చ కాయ చిన్న ముక్క నమిలి తినడం వల్ల క్షణాల్లో తేలు కాటు వల్ల కలిగే నొప్పి, బాధ తగ్గుతాయి. ఈ చెట్టు వేరు పొడిని కానీ, కాయల పొడిని కానీ అతి తక్కువ మోతాదులో తీసుకుని పిప్పి పన్నుపై ఉంచడం వల్ల పిప్పి పన్ను వల్ల కలిగే నొప్పి తగ్గుతుంది. వెర్రి పుచ్చ చెట్టు వేరును తీసుకుని శుభ్రంగా కడిగి ఆరబెట్టి ఎద్దు మూత్రంతో కలిపి బాగా ఆరగదీయాలి. ఇలా చేయగా వచ్చని గంధాన్ని స్థనాలపై లేపనంగా రాయడం వల్ల రొమ్ములలో ఉండే గడ్డలు, నొప్పులు, పుండ్లు, దురదలు అన్నీ తగ్గుతాయి. వెర్రి పుచ్చ కాయలను పగలగొట్టి లోపల ఉండే గుజ్జును మెత్తగా చేసి కొద్దిగా వేడి చేయాలి. దీనిని కడుపుపై ఉంచి రొట్టెలాగా అంతా పరిచి ఊడిపోకుండా కట్టు కట్టాలి. ఇలా రెండు నుండి మూడు రోజులకొకసారి చేయడం వల్ల కడుపులోని పురుగులు అన్నీ మలం ద్వారా బయటకు పోతాయి.
ఈ చెట్టు వేరును, దేవదారు చెక్కను కలిపి అరగదీని ఆ గంధాన్ని గొంతుకు లేపనంగా రాయడం వల్ల గొంతు గడ్డలు తగ్గుతాయి. వెర్రి పుచ్చ చెట్టు వేరును, పిప్పిలి కట్టను, బెల్లాన్ని సమపాళ్లల్లో కలిపి మెత్తగా నూరి ఆ గంధాన్ని పేను కొరుకుడుపై రెండు పూటలా రాస్తూ ఉండడం వల్ల తీవ్రమైన పేనుకొరుకుడు కూడా తగ్గి ఆ ప్రాంతంలో వెంట్రుకలు కూడా వస్తాయి. ఈ చెట్టు వేరును గంజి నీటితో అరగదీసి ఆ మిశ్రమాన్ని రెండు చుక్కల చొప్పున ముక్కు రంధ్రాల్లో వేస్తే అపస్మారక స్థితి నుండి బయటకు వస్తారు. వెర్రి పుచ్చ చెట్టు వేర్లను పొడిగా చేసి దానిని ఒక గ్రాము నుండి ప్రారంభించి రెండు గ్రాముల వరకు అర టీ స్పూన్ తేనెతో, ఒక టీ స్పూన్ పటిక బెల్లం పొడితో కలిపి ఉదయం పరగడుపున, రాత్రి భోజనానికి ముందు తింటూ ఉంటే స్త్రీలలో నెలసరి సమయంలో నెత్తురు గడ్డలు పడే రక్త గుల్మం జబ్బు తగ్గుతుంది.
వెర్రి పుచ్చ కాయ నుండి రసాన్ని తీసి దానికి సమపాళ్లల్లో నువ్వుల నూనెను కలిపి చిన్న మంటపై కేవలం నూనె మిగిలే వరకు మరిగించి చల్లగా అయిన తరువాత నిల్వ చేసుకోవాలి. దీనిని రెండు పూటలా గోరు వెచ్చగా చేసి మూడు చుక్కల మోతాదులో చెవిలో వేసుకుని దూదిని ఉంచి మూడు గంటల తరువాత దూదిని తీసి తలను పక్కకు వంచి నూనె బయటకు పోయేలా చేయాలి. ఇలా రెండు వారాల పాటు చేయడం వల్ల చెవుడు, చెవిలో హోరు తగ్గుతుంది.
వెర్రి పుచ్చ చెట్టు వేరు పొడి 50 గ్రా., పిప్పిళ్ల పొడి 50 గ్రా., పాత బెల్లం 100 గ్రా. కలిపి మెత్తగా దంచి కుంకుడు గింజంత పరిమాణంలో మాత్రలుగా చేసి నిల్వ చేసుకోవాలి. ఈ మాత్రలను రెండు లేదా మూటు పూటలా భోజనానికి అర గంట ముందు తీసుకుంటూ ఉంటే కీళ్ల నొప్పులు తగ్గుతాయి. ఈ విధంగా వెర్రి పుచ్చ చెట్టును ఉపయోగించి అనేక రకాల రోగాలను నయం చేసుకోవచ్చని నిపుణులు చెబుతున్నారు.