Corn Fiber : మనం ఆహారంగా తీసుకునే వాటిల్లో మొక్కజొన్న కూడా ఒకటి. మొక్క జొన్న మనకు తక్కువ దరలో లభిస్తూ ఉంటుంది. దీనిని తినడం వల్ల మన శరీరానికి ఎంతో మేలు కలుగుతుంది. మొక్కజొన్నలను మనం కాల్చుకుని, ఉడికించుకుని, గింజలను వేయించి తింటూ ఉంటాం. వీటి గింజల నుండి పేలాలను, పాప్ కార్న్ ను, కార్న్ ఫ్లేక్స్ వంటి వాటిని తయారు చేస్తారు. మొక్క జొన్న పిండితో కూడా రొట్టెలను తయారు చేస్తారు. వీటి గింజల నుండి నూనెను కూడా తీస్తారు. మనం సాధారణంగా మొక్కజొన్న కంకులను తిని వాటి పీచును పడేస్తూ ఉంటాం. కానీ మొక్కజొన్న పీచు కూడా మనకు ఎంతగానో ఉపయోగపడుతుంది. ఇది ఎంతో మృదువుగా చూడడానికి మెరుస్తూ ఉంటుంది. దీనిని జొన్న పట్టు అంటారు. ఈ జొన్న పట్టు వల్ల కలిగే ఉపయోగాలు ఏమిటి.. ఇది మన ఆరోగ్యానికి ఏవిధంగా ఉపయోగపడుతుంది.. అన్న వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం.
మొక్కజొన్న పట్టును ఉపయోగించి మూత్రపిండాల సమస్యలను నయం చేసుకోవచ్చు. వివిధ దేశాలలో దీన్ని వారి సంప్రదాయ వైద్యంలో కూడా ఉపయోగిస్తున్నారు. మొక్క జొన్న కంకి పెరుగుదలలో ఈ పట్టు ఎంతగానో ఉపయోగపడుతుంది. ఈ మొక్కజొన్న పట్టుతో టీని, డికాషన్ ను తయారు చేసుకుని తాగవచ్చు. మొక్కజొన్న కంకుల లాగా ఈ పట్టు కూడా విటమిన్ సి ని కలిగి ఉంటుంది. ఈ పట్టుతో టీని, డికాషన్ ను చేసుకుని తాగడం వల్ల శరీరంలో రోగనిరోధక శక్తి పెరుగుతుంది. శరీరంలో ఉండే ముఖ్యమైన అవయవాల పనితీరు కూడా మెరుగుపడుతుంది. వీటిలో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు శరీరంలో ఉండే ఫ్రీ రాడికల్స్ ను తొలగించడంలో సహాయపడతాయి. మొక్కజొన్న పట్టుతో చేసిన టీ ని కానీ, డికాషన్ ను కానీ తరచూ తాగడం వల్ల గుండె పని తీరు మెరుగుపడుతుంది. హార్ట్ ఎటాక్, హార్ట్ స్ట్రోక్ వంటి సమస్యలు వచ్చే అవకాశాలు తక్కువగా ఉంటాయి.
ఈ టీని తాగడం వల్ల రక్తపోటు, షుగర్ వంటి వ్యాధులు నియంత్రణలో ఉంటాయి. శరీరంలో పేరుకుపోయిన కొవ్వును కరిగించి బరువును తగ్గించడంలో కూడా ఈ టీ ఎంతగానో ఉపయోగపడుతుంది. మొక్కజొన్న పట్టుతో చేసిన టీ ని తాగడం వల్ల మూత్రపిండాలలో పేరుకుపోయిన వ్యర్థాలు బయటకు పోవడమే కాకుండా మూత్రంలో మంట, ఇన్ ఫెక్షన్ వంటి సమస్యలు తగ్గుతాయని.. ఈ టీలో కొద్దిగా నిమ్మరసాన్ని కలుపుకుని తాగడం వల్ల కిడ్నీలు ఆరోగ్యంగా ఉంటాయని నిపుణులు చెబుతున్నారు.
మొక్కజొన్న పట్టుతో చేసే టీ ని తాగడం వల్ల అజీర్తి వంటి సమస్యలు కూడా తగ్గుతాయి. జీర్ణవ్యవస్థ మెరుగుపడి మలబద్దకం వంటి సమస్యలు తగ్గుతాయి. అంతే కాకుండా ప్రసవానంతరం స్త్రీలు ఈ టీ ని తాగడం వల్ల రక్తస్రావం అధికంగా అవకుండా ఉంటుంది. కీళ్లనొప్పులపై ఈ టీ ని లేపనంగా రాయడం వల్ల నొప్పులు తగ్గుతాయి. తేలు, జెర్రీ వంటివి కుట్టినప్పుడు ఈ టీ ని తాగడం వల్ల తేలు, జెర్రి కాటు వల్ల కలిగే నొప్పి నుండి ఉపశమనం లభిస్తుంది. ఈ టీ ని ప్రతిరోజూ తాగుతూ ఉండడం వల్ల ప్రోస్టేట్ గ్రంథి వాపు తగ్గుతుంది. ప్రోస్టేట్ క్యాన్సర్ వచ్చే అవకాశాలు కూడా తక్కువగా ఉంటాయని నిపుణులు చెబుతున్నారు. ఈ టీ ని చిన్న పిల్లలు, గర్భిణీలు, ఇతర వ్యాధులకు మందులు వాడే వారు మాత్రం తాగరాదు. అలాగే రాత్రి పడుకునే ముందు కూడా ఈ టీ ని తాగరాదని వైద్యులు సూచిస్తున్నారు.
ఒకటిన్నర గ్లాసు నీటిలో తరిగిన మొక్కజొన్న పట్టును వేసి మరిగించి వడకట్టుకోవాలి. ఇలా వడకట్టగా వచ్చిన నీటిలో నిమ్మరసాన్ని కలుపుకుని నేరుగా తాగవచ్చు లేదా ఈ నీటితో టీ ని కానీ డికాషన్ ను కానీ చేసుకుని తాగవచ్చు. మొక్క జొన్న కంకులను తినడం వల్లనే కాకుండా ఇలా మొక్కజొన్న పట్టుతో టీ ని, డికాషన్ ను చేసుకుని తాగడం వల్ల అనేక ప్రయోజనాలను పొందవచ్చని నిపుణులు చెబుతున్నారు.