Boiled Eggs : కోడిగుడ్లను తినడం వల్ల ఎన్నో ఆరోగ్యకరమైన ప్రయోజనాలు కలుగుతాయని అందరికీ తెలిసిందే. కోడిగుడ్లను సంపూర్ణ పోషకాహారంగా భావిస్తారు. వాటిల్లో మన శరీరానికి ఉపయోగపడే అన్ని పోషకాలు ఉంటాయి. అయితే గుడ్లను ఉడకబెడితే సాఫ్ట్ బాయిల్డ్, మీడియం, హార్డ్ బాయిల్డ్ ఎగ్స్ అని పిలుస్తారు. కొందరు ఆ విధంగా గుడ్లను ఉడకబెట్టి తింటారు. అయితే వీటి మధ్య తేడాలు ఏమిటో ఇప్పుడు చూద్దాం.
కోడిగుడ్డును బాగా ఉడకబెట్టేందుకు సుమారుగా 12 నిమిషాల సమయం పడుతుంది. అలా ఉడికిస్తే దాన్ని హార్డ్ బాయిల్డ్ ఎగ్ అంటారు. గుడ్డులోని తెల్లని, పచ్చని సొనలు రెండూ బాగా ఉడుకుతాయి. చాలా మంది గుడ్లను ఇలాగే ఉడికించి తింటారు.
అయితే కోడిగుడ్లను 12 నిమిషాల పాటు కాక 5 నిమిషాల పాటు ఉడికిస్తే తెల్లని సొన ఉడుకుతుంది. కానీ లోపలి పచ్చ సొన క్రీమ్ మాదిరిగా మారుతుంది. దీన్నే సాఫ్ట్ బాయిల్డ్ గుడ్డు అంటారు. దీన్ని పాస్తాలు, టోస్ట్‌ల వంటి వాటిపై వేసుకుని తినవచ్చు.
ఇక గుడ్లను 8 నిమిషాల పాటు ఉడికిస్తే వాటిని మీడియం బాయిల్డ్ ఎగ్స్ అంటారు. తెల్లని, పచ్చని సొనలు రెండూ ఉడుకుతాయి. కాకపోతే పచ్చ సొన మరీ బాగా ఉడకదు. కొంచెం మెత్తగా ఉంటుంది. దీన్ని సలాడ్స్‌లో వేసుకుని తింటారు.
అయితే ఎవరైనా సరే తమ సౌకర్యాన్ని బట్టి తమకు ఇష్టం వచ్చిన విధంగా గుడ్లను ఉడికించి తినవచ్చు. ఎలా తిన్నా వాటితో పోషకాలు అందుతాయి. ఆరోగ్యకరమైన ప్రయోజనాలు కలుగుతాయి.