కరోనా వైరస్ సోకిన వ్యక్తి దగ్గినప్పుడు లేదా తుమ్మినప్పుడు వాటి ద్వారా వచ్చే తుంపర్ల కారణంగా కోవిడ్ ఇతరులకు వ్యాపిస్తుంది.ఇప్పటి వరకు పరిశోధకులు, వైద్య నిపుణులు ఇదే చెప్పారు. నేషనల్ యూనివర్శిటీ ఆఫ్ సింగపూర్ (NUS) చేసిన ఒక కొత్త అధ్యయనంలో.. కోవిడ్ సోకిన వ్యక్తి మాట్లాడేటప్పుడు, పాడేటప్పుడు విడుదలయ్యే కణాల వల్ల ముఖ్యంగా ఇండోర్ వాతావరణంలో ఎక్కువ వేగంగా వైరస్ వ్యాప్తి చెందేందుకు అవకాశాలు ఉంటాయని.. తేలింది.
NUS పరిశోధకులు ఈ రెండు రకాల కార్యకలాపాల నుండి (మాట్లాడటం, పాడటం) ఉత్పత్తి చేయబడిన చిక్కటి ఏరోసోల్స్ (5 మైక్రోమీటర్ల కంటే తక్కువ సైజు ఉన్న కణాలు), ముతక ఏరోసోల్స్ (5 మైక్రోమీటర్లకు పైగా సైజ్ ఉన్నవి) కంటే ఎక్కువ వైరస్ కణాలను కలిగి ఉన్నట్లు కనుగొన్నారు. ఈ ఫలితాల ఆధారంగా ఆ పరిశోధనా బృందం ఆ ఏరోసోల్‌లను ఇండోర్ పరిసరాలలో తగ్గించాల్సిన ఆవశ్యకతను హైలైట్ చేసింది.
శ్వాస, మాట్లాడటం, పాడటం ద్వారా ఉత్పన్నమయ్యే ఏరోసోల్స్‌లోని SARS-CoV-2 కణాలను లెక్కించడానికి, పోల్చడానికి ఇది మొదటి అధ్యయనం అని పరిశోధకులు పేర్కొన్నారు. అందువల్ల తమ బృందం కోవిడ్ సంక్రమణ ప్రమాదాన్ని అంచనా వేయడానికి ఒక పునాదిని అందిస్తుందని తెలిపారు. కాగా ఈ అధ్యయనాన్ని మొదటిసారిగా ఆన్‌లైన్‌లో 6 ఆగస్టు 2021 న క్లినికల్ ఇన్ఫెక్షియస్ డిసీజెస్ జర్నల్‌లో ప్రచురించారు.
అధ్యయనం కోసం పరిశోధన బృందం నేషనల్ సెంటర్ ఫర్ ఇన్ఫెక్షియస్ డిసీజెస్ (NCID) లో ఫిబ్రవరి 22 నుండి ఏప్రిల్ 2021 వరకు చేరిన 22 మంది COVID-19 పాజిటివ్ రోగులను పరిశీలనలోకి తీసుకుంది. ఈ క్రమంలోనే పూర్తి విశ్లేషణ అనంతరం పై వివరాలను వెల్లడించింది.
కొంతమంది రోగులు ఆశ్చర్యకరంగా పాడటం కంటే మాట్లాడటం వల్లనే ఎక్కువ వైరస్ కణాలను విడుదల చేసారని డ్యూక్-ఎన్‌యుఎస్ మెడికల్ స్కూల్ ప్రాజెక్ట్ కో-లీడర్ డాక్టర్ క్రిస్టెన్ కోల్మన్ పేర్కొన్నారు. అందువల్ల కోవిడ్ సంక్రమణ నుంచి తప్పించుకునేందుకు ఇండోర్ లో ఎక్కువ జాగ్రత్త వహించాలని చెబుతున్నారు.
యూనివర్సల్ మాస్కింగ్, భౌతిక దూరం పాటించడం, కోవిడ్ రోగులు ఉండే గదుల్లో వెంటిలేషన్ సరిగ్గా ఉండేలా చేయడం వంటి పనులు చేపడితే కోవిడ్ వ్యాప్తిని అడ్డుకోవచ్చు.