మహిళా ఉద్యోగులు షిఫ్ట్ డ్యూటీలు చేసేవారు నెలకు మూడు లేదా అంతకు మించి నైట్ షిఫ్ట్ లు చేస్తే టైప్ 2 డయాబెటీస్ వచ్చే అవకాశం వుందని ఒక తాజా పరిశోధన తెలుపుతోంది. ఈ స్టడీని హార్వర్డ్ స్కూల్ ఆఫ్ పబ్లిక్ హెల్త్ నిర్వహించింది. అనేక సంవత్సరాలపాటు రోటేటింగ్ నైట్ షిప్ట్ చేసే మహిళలకు బరువు సంతరించుకోవడంతోపాటు టైప్ 2 డయాబెటీస్ వస్తుందని రీసెర్చి వెల్లడించింది. ఈ రిస్కు వారి నైట్ షిఫ్ట్ సంవత్సరాల తరబడి కొనసాగుతున్న కొద్ది పెరుగుతుందని రీసెర్చర్ ఆన్ పాన్ తెలిపారు.
పరిశోధనలో సుమారు 69 వేల మంది అమెరికా మహిళలను 42 నుండి 67 సంవత్సరాలయమధ్య వయసున్న హాస్పిటల్ నర్సులను 1988 నుండి 2008 సంవత్సరం వరకు స్టడీ చేశారు. సంవత్సరాలు గడిచే కొద్దీ నైట్ షిఫ్ట్ కొనసాగిస్తున్న నర్సులకు టైప్ 2 డయాబెటీస్ అధికంగా వున్నట్లు కనుగొన్నారు. ఇరవై సంవత్సరాలు పైబడి నైట్ షిఫ్ట్ చేస్తున్న నర్సులలో 58 శాతంమంది అధిక బరువు, డయాబెటీస్ వ్యాధికి గురైనట్లు తెలిపారు.
షిఫ్ట్ వర్క్ నిద్రా సమయాలను భంగం చేస్తుందని ఈ చర్య అధిక బరువుకు, జీవప్రక్రియకు ముడిపెట్టి వుందని దీని కారణంగా టైప్ 2 డయాబెటీస్ వస్తోందని వారు వివరించారు. రీసెర్చి ఫలితాలను ఆన్ లైన్ లో పిఎల్ ఓఎస్ మెడిసిన్ అనే జర్నల్ లో ప్రచురించారు.