Natural Hair Oil : ప్రస్తుత తరుణంలో చాలా మంది జుట్టు సమస్యలతో ఇబ్బందులు పడుతున్నారు. చుండ్రు, జుట్టు రాలడం వంటి సమస్యలు చాలా మందికి వస్తున్నాయి. దీంతో మార్కెట్‌లో లభించే రక రకాల హెయిర్ ఆయిల్స్, షాంపూలను వాడుతున్నారు. అయితే ఈ సమస్యలకు సహజసిద్ధంగా తయారు చేసుకున్న ఆయిల్‌ను వాడితేనే మంచిది. అలాంటి ఆయిల్‌లలో మందార పువ్వుల హెయిర్ ఆయిల్ ఒకటి.
మందార పువ్వులతో హెయిర్ ఆయిల్‌ను సహజసిద్ధంగా మీ ఇంట్లోనే సులభంగా తయారు చేసుకోవచ్చు. దాన్ని ఎలా తయారు చేయాలో ఇప్పుడు తెలుసుకుందాం.
రెండు పెద్ద చెంచాల చొప్పున కొబ్బరి, ఆముదం, బాదం నూనెలను తీసుకోవాలి. వీటికి మూడు విటమిన్ ఇ మాత్రల నూనె కలిపి అన్నింటినీ వేడి చేయాలి. ఇందులో గుప్పెడు మందార పువ్వుల ముద్ద కలిపి రాత్రంతా పక్కన పెట్టేయాలి. మరుసటి రోజు వడబోసి ఓ సీసాలో నిల్వ చేసుకోవాలి. నిద్రించే ముందు ఈ నూనెను తలకు రాసుకుని మృదువుగా మర్దనా చేయాలి. తరువాత గాఢత తక్కువగా ఉన్న షాంపూతో కడిగేయాలి. తలస్నానం చేయాలి.
ఈ విధంగా వారంలో రెండు సార్లు చేస్తే చాలు, జుట్టు చిట్లకుండా రాలకుండా ఉంటుంది. ఈనూనెను ఇలా ఎప్పుడు కావాలంటే అప్పుడు కొద్ది మొత్తాల్లో తయారు చేసుకుని ఉపయోగించవచ్చు.
కాలుష్యం వల్ల అంద విహీనంగా మారిన జుట్టుకు ఈ నూనె రాస్తే తిరిగి పూర్వ రూపాన్ని పొందుతుంది. అలాగే జట్టు రాలడం తగ్గిపోతుంది. చుండ్రు నుంచి బయట పడవచ్చు. జుట్టు ఆరోగ్యంగా ఉంటుంది. శిరోజాలు దృఢంగా, ఒత్తుగా పెరుగుతాయి.
ఈ నూనెలో కొబ్బరినూనె, ఆముదం, బాదం నూనెలు కలుస్తాయి కనుక జుట్టుకు పోషణ లభిస్తుంది. జుట్టు ఎక్కువగా రాలిపోయే వారికి ఈ నూనె అద్భుతంగా పనిచేస్తుంది. అలాగే ఇందులో ఉండే విటమిన్ ఇ ఆయిల్ జుట్టు పెరుగుదలకు దోహదం చేస్తుంది.
మార్కెట్‌లో లభించే ఎన్నో రకాల నూనెలకు బదులుగా ఇలా సహజసిద్ధంగా హెయిర్ ఆయిల్‌ను తయారు చేసుకుని వాడితే ఎన్నో లాభాలను పొందవచ్చు.