Sudha Iniya Organics : కష్టపడి పనిచేయాలనే తపన ఉండాలేకానీ మీ దగ్గర డబ్బు ఎంత ఉన్నా సరే దాంతో చిన్నపాటి వ్యాపారం ప్రారంభించవచ్చు. ఎప్పటికప్పుడు అందులో నూతన మెళకువలను తెలుసుకుంటూ కాలానుగుణంగా వ్యాపారం కొనసాగిస్తే అది లాభాల బాట పడుతుంది. దీంతో లక్షల రూపాయలను నెల నెలా సంపాదించవచ్చు. అవును, సరిగ్గా ఆ మహిళ కూడా ఇదే చేస్తోంది. ఇంతకీ అసలు ఆమె ఎవరు.. ఆమె ఏం చేస్తుంది.. ఎలా వృద్ధిలోకి వచ్చింది.. అన్న వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం.
తమిళనాడులోని నమక్కల్ జిల్లాలో ఉన్న ఓ మారుమూల గ్రామంలో సుధ ఓ నిరుపేద కుటుంబంలో జన్మించింది. ఆమెకు ఇద్దరు తోబుట్టువులు. అయితే వారికి తినేందుకు తిండి కూడా లభించేది కాదు. దీంతో సుధను, ఆమె సోదరిని తల్లిదండ్రులు వారి బామ్మ దగ్గరకు పంపేశారు. అక్కడే సుధ చదువుకుంది. సుధ 5, 6, 7 తరగతుల్లో ఫెయిల్ అయింది. కానీ చదువే ఎప్పటికైనా తిండి పెడుతుంది అన్న తల్లి మాటలను గుర్తు పెట్టుకుని ఆమె కష్టపడి మరీ చదివింది. టెన్త్ పాస్ అయింది. తరువాత ఇక ఆమె వెనక్కి తిరిగి చూసుకోలేదు. వెంట వెంటనే ఇంటర్, బీఎస్సీ, ఎమ్మెస్సీ చదివింది.
రూ.2వేల జీతం..
అయితే కుమార్ అనే వ్యక్తిని పెళ్లి చేసుకున్న అనంతరం సుధ 2011లో కోయంబత్తూర్‌కు మారింది. అక్కడ ఆమె ఓ ప్లే స్కూల్‌లో టీచర్‌గా పనిచేసేది. నెలకు రూ.2వేల జీతం ఇచ్చేవారు. అయితే తన కుమార్తె తిండి సరిగ్గా తినకపోవడంతో ఆమెకు ఆహారంలో కంది పొడి, మునగాకుల పొడి, పాలకూర పొడి వంటి పొడులను కలిపి ఇచ్చేది. దీంతో తన కుమార్తె ఎంతో రుచిగా ఆహారాన్ని తినేది. అయితే ఇదే విషయం సుధ మెదడులో ఒక ఆలోచనకు పునాది వేసింది.
రూ.2 లక్షలు లోన్ తీసుకుని..
ఆహారాన్ని మరింత రుచిగా మార్చడంతోపాటు పోషకాలను అందించేందుకు ఆయా పొడులు ఎంతో ఉపయోగపడతాయి. వాటిని తయారు చేసి విక్రయిస్తే చక్కని స్వయం ఉపాధి పొందవచ్చని ఆమె భావించింది. దీంతో తన దగ్గర ఉన్న రూ.2వేలతో ముందుగా కొన్ని రకాల పొడులను తయారు చేసి అమ్మడం మొదలు పెట్టింది. వాటికి కస్టమర్ల నుంచి మంచి స్పందన లభించింది. దీంతో ఆమె వెనక్కి తిరిగి చూసుకోలేదు. బ్యాంకు ద్వారా రూ.2 లక్షలు లోన్ తీసుకుని 2018లో ఇనియా ఆర్గానిక్స్ అనే కంపెనీని నెలకొల్పింది. అందులో ఇద్దరు మహిళలకు పని కల్పించింది. అలాగే ఆమె భర్త కూడా జాబ్ మానేసి తమ కంపెనీలోనే వ్యవహారాలను చూసుకోవడం మొదలుపెట్టాడు.
నెలకు లక్షల రూపాయల ఆదాయం..
తరువాత ఇక వారు వెనక్కి తిరిగి చూసుకోలేదు. వివిధ రకాల పొడులను తయారు చేసి అమ్మడం మొదలు పెట్టారు. వారు సొంతంగా అక్కడ షాప్‌ను కూడా నిర్వహిస్తున్నారు. అందులో తాము తయారు చేసే రకరకాల పొడులను అమ్ముతున్నారు. నెలకు 120 కిలోలకు పైగానే పలు రకాల పొడులను అమ్ముతున్నట్లు వారు తెలిపారు. దీంతో లక్షల రూపాయల ఆదాయం వస్తుందని చెబుతున్నారు. ఇలా కష్టపడి పనిచేయాలే గానీ ఎవరైనా సరే ఏ విధంగా అయినా సరే విజయం సాధించవచ్చు.. అని చెప్పేందుకు సుధ జీవితమే ఒక ఉదాహరణ అని చెప్పవచ్చు. స్వయం ఉపాధి పొందాలనుకునే వారు ఇలా ఏదో ఒక కొత్త ఐడియాను ఆలోచిస్తే అందులో సక్సెస్ అయితే నెల నెలా లక్షలు సంపాదింవచ్చు.