ఉదయాన్నే పళ్లు తోముకున్నారా..? అవును… స్నానం చేశారా..? అవును… డ్రెస్ వేసుకున్నారా..? అవునండీ, అవును… మరి అండర్ వేర్..? మార్చారా..? లేదా..? ఆ… అండర్ వేర్ మార్చకుండా ఎవరైనా ఉంటారా..? అని అడగకండి. ఎందుకంటే అలాంటి వారు కూడా ఉంటారట. నిత్యం చేయాల్సిన అన్ని పనులను వారు చేస్తారు. కానీ, అండర్‌వేర్ విషయంలో మాత్రం వారు బద్దకిస్తారట. అంటే, ఒకే అండర్‌వేర్‌ను రెండు, మూడు రోజుల పాటు (ఇంకా కొందరు ఎక్కువ రోజులే) వేసుకుంటారట. అవును, మీరు వింటోంది షాకింగ్ ఉన్నా, ఇది నిజమేనట. అయితే అండర్‌వేర్‌ను మార్చకుండా అలా రోజుల తరబడి అలాగే వేసుకుంటే దాంతో పలు అనారోగ్య సమస్యలు కలుగుతాయట. ప్రధానంగా జననావయవాలకు ఇబ్బంది కలుగుతుందట. సదరు సమస్యలు ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం.
నిత్యం అండర్‌వేర్‌ను మార్చకుండా ఒకే అండర్‌వేర్‌ను రోజుల తరబడి వేసుకుంటే దాంతో సంబంధిత ప్రదేశంలో చర్మ మృతకణాలు ఎక్కువగా పేరుకుపోతాయట. దీంతో అవి చర్మంపై దురదలను కలిగిస్తాయట. ఒకే అండర్‌వేర్‌ను రోజుల తరబడి వేసుకుంటూ ఉంటే దాంతో ఆ ప్రదేశం నుంచి దుర్వాసన వస్తుంటుంది. ఇది ఆ అండర్‌వేర్‌ను ధరించే వారికే కాదు, ఇతరులకూ ఇబ్బందిని కలిగిస్తుంది. రోజుల తరబడి ఒకే అండర్ వేర్‌ను వేసుకుంటూ ఉంటే ఆ ప్రదేశంలో బాక్టీరియా, ఫంగస్ ఎక్కువగా పేరుకుపోతుంది. దీంతో ఆయా ఇన్‌ఫెక్షన్లు వెంటనే వచ్చేస్తాయి. ఇక ఆ సమస్యలు కలిగితే దాని లక్షణాలు ఎలా ఉంటాయో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు కదా.
బాక్టీరియా, ఫంగస్‌లు ఎక్కువగా పేరుకుపోతే మూత్రాశయ సంబంధ ఇన్‌ఫెక్షన్లు కూడా వస్తాయి. ఇది ఇతర అనారోగ్యాలకు కూడా దారి తీసే అంశం. చర్మం ఎర్రగా లేదా నల్లగా మారి దద్దుర్లు వస్తాయి. ఆ ప్రదేశంలో చర్మం అంతా ఇన్‌ఫెక్షన్లతో కూడుకుని, వ్యర్థాలతో నిండుకుని ఉంటుంది. రోజూ అండర్‌వేర్‌ను మార్చకుండా రోజుల తరబడి అలాగే వేసుకుంటూ ఉంటే ఆ ప్రదేశంలో సూక్ష్మ క్రిములు పేరుకుపోయి లైంగిక వ్యాధులు త్వరగా వ్యాప్తి చెందేందుకు కూడా అవకాశం ఉంటుంది.
కనుక, ఎవరైనా అలా చేస్తుంటే వెంటనే ఆ అలవాటును మానేసేయండి. లేదంటే అనారోగ్యాల మీద అనారోగ్యాలు కలుగుతాయి. ఆ తరువాత బాధపడి కూడా ప్రయోజనం ఉండదు.