Pradhan Mantri Kisan Maandhan Yojana : కేంద్ర ప్రభుత్వం దేశంలోని పౌరుల కోసం అనేక రకాల పొదుపు పథకాలను అందుబాటులోకి తెస్తోంది. అందులో భాగంగానే ఇప్పటికే అనేక పథకాలను కూడా ప్రవేశపెట్టింది. వృద్ధులు, మహిళలు, ఆడపిల్లల కోసం అనేక పథకాలు అందుబాటులో ఉన్నాయి. ఇక రైతులకు కూడా కేంద్రం ప్రధాన మంత్రి కిసాన్ మాన్‌ధన్ యోజన (PMKMY) అనే పథకాన్ని ప్రవేశపెట్టింది. ఈ పథకం కింద అర్హులైన రైతులు నెలకు రూ.3000 వరకు పెన్షన్ పొందవచ్చు.
కేంద్ర ప్రభుత్వం ప్రధాన మంత్రి కిసాన్ మాన్‌ధన్ యోజన పథకాన్ని 12 సెప్టెంబర్ 2019వ తేదీన ప్రవేశపెట్టింది. ఇందులో రైతులు చేరవచ్చు. వయస్సు 18 నుంచి 42 ఏళ్ల మధ్య ఉండాలి. ఇందులో చేరిన తరువాత నెలకు రూ.55 నుంచి రూ.200 వరకు ఖాతాలో పొదుపు చేయాలి. తరువాత రైతుకు 60 ఏళ్లు నిండాక నెలకు రూ.3000 వరకు పెన్షన్ ఇస్తారు. ముఖ్యంగా ఈ పథకం వల్ల చిన్న, సన్నకారు రైతులకు మేలు జరుగుతుందని కేంద్ర ప్రభుత్వం చెబుతోంది.
నెలకు రూ.3000 పొందవచ్చు..
ఈ పథకంలో చేరితే రైతుకు 60 ఏళ్లు నిండిన తరువాత నెలకు రూ.3000 వరకు పెన్షన్ పొందవచ్చు. వారు నెల నెలా పొదుపు చేసుకున్న సొమ్మును బట్టి పెన్షన్ ఇస్తారు. ఇక ఈ పథకంలో చేరాలంటే ఆన్‌లైన్‌లోనూ దరఖాస్తు చేయవచ్చు. ఇందుకు గాను రైతులు https://maandhan.in/ అనే వెబ్‌సైట్‌ను సందర్శించాలి. ఈ పథకంలో చేరేందుకు ఆధార్ కార్డు, ఐడీ కార్డు, బ్యాంక్ అకౌంట్ పాస్‌బుక్, అడ్రస్, మొబైల్ నంబర్, పాస్ పోర్టు సైజ్ ఫొటో అవసరం అవుతాయి.
2 హెక్టార్లు లేదా అంతకన్నా తక్కువ భూమి ఉన్న రైతులు మాత్రమే ఈ పథకంలో చేరేందుకు అర్హులు. అలాగే రైతు నెలసరి ఆదాయం రూ.15000 మించకూడదు. పన్ను చెల్లింపుదారు కాకూడదు. ఈపీఎఫ్‌వో, ఎన్‌పీఎస్, ఈఎస్ఐసీ వంటి పథకాల్లో చేరి ఉండకూడదు. లబ్ధిదారుడికి కచ్చితంగా మొబైల్ ఫోన్, ఆధార్, బ్యాంకు ఖాతా ఉండాలి. ఇంటర్నెట్ ఆపరేట్ చేయడం వచ్చిన వారు ముందు చెప్పిన వెబ్‌సైట్‌లోకి వెళ్లి ఈ పథకంలో సొంతంగా చేరవచ్చు. లేదా తమకు సమీపంలో ఉన్న మీ సేవ, కామన్ సర్వీస్ సెంటర్‌కు వెళ్లి సంబంధిత పత్రాలను, పాస్ పోర్టు సైజ్ ఫొటోను సమర్పించి ఈ పథకంలో చేరవచ్చు. తరువాత నెల నెలా బ్యాంకు ఖాతా నుంచి రైతు ఎంచుకున్న ప్రకారం పొదుపు సొమ్ము డెబిట్ చేయబడుతుంది. ఇలా ఈ పథకంలో రైతులు చేరి లబ్ధి పొందవచ్చు.