కర్మణ్యే వాధికా రస్తే మా ఫలేషు కదాచన । మా కర్మ ఫల హేతురభుహ, మాఁ తే సంగోత్స్వ కర్మణ్యే। పైన చెప్పింది భగవద్గీతలోని ఓ శ్లోకం. కర్మ సిద్ధాంతాన్ని అనుసరించి చెప్పబడింది. కర్మలు చేయడంలోనే నీకు అధికారం ఉన్నది. కర్మ ఫలాలపైన ఎప్పుడూ లేదు. కర్మ ఫలానికి కారకుడివి కావద్దు. అలాగని కర్మలు చెయ్యడము మానవద్దు అని పైన చెప్పిన శ్లోకానికి అర్థం వస్తుంది. హిందూ, బౌద్ధ, సిక్కు, జైన మతాలు కర్మ సిద్ధాంతాన్ని నమ్ముతాయి. ఈ సిద్ధాంతం ప్రకారం మనిషి చేసే ప్రతి చర్యకి ప్రతిఫలం అనుభవించి తీరాలి. మంచి కర్మలకి మంచి ప్రతిఫలం, చెడు కర్మలకి చెడు ప్రతిఫలం అనుభవించి తీరాలి. ఈ క్రమంలో మనిషి జీవితం గురించి కర్మ సిద్ధాంతం ఇంకా ఏం చెబుతుందో ఇప్పుడు తెలుసుకుందాం.
కర్మ సిద్ధాంతం ప్రకారం మనుషులు తమ జీవితంలో చేసే పనులే భూత, భవిష్యత్ వర్తమాన కాలాలను ప్రతిబింబిస్తాయి. అంటే ఒకప్పుడు ఎవరైనా మనిషి ఏదైనా పనిచేస్తే అదే పని అతని జీవితంలో ప్రతిబింబిస్తుంది. రేపటి భవిష్యత్‌కు ఒకప్పటి భూతకాలమే కారణం. అదేవిధంగా మనిషి సమాజంలోని ఇతరుల పట్ల ఏవిధంగా ఉంటాడో ఇతరులు కూడా అతని పట్ల అదే విధంగా స్పందిస్తారు. మనిషి కోపంగా ఉంటే వారూ కోపంగా ఉంటారు. నవ్వితే వారూ నవ్వుతారు. సమాజానికి మనుషులు ఏమిస్తే అదే ఆ మనుషులకు లభిస్తుంది. ప్రపంచమంతా మనుషులతోనే ఏర్పడింది. దాన్ని మనకు ఎలా కావాలంటే అలా మార్చుకునే శక్తి మన చేతుల్లోనే ఉంది. అది మంచైనా, చెడైనా. ఇతరులు నీ పట్ల చేసే తప్పులను క్షమించగలిగినప్పుడే నీవు జీవితంలో ఉన్నత స్థానాలను పొందేందుకు అవకాశం ఉంటుంది. అది లేని నాడు ఎప్పటికీ ఎవరూ పైకి ఎదగలేరు.
ముందు మనం మారిన తరువాతే సమాజాన్ని మార్చగలం. మార్పు అనేది మనతో ప్రారంభమైనప్పుడే సమాజంలోనూ అది క్రమేపీ వస్తుంది. మన జీవితం బాగా లేదంటే అందుకు గతంలో మనం చేసిన పనులే కారణం. మన పనులకు మనమే బాధ్యులం కావాలి. దానికి ఇతరులను బాధ్యులను చేయకూడదు. మనకు లేని దాని గురించి, ఇతరుల వద్ద ఉన్న దాని గురించి మనం బాధ పడకూడదు. అందుకు దేవున్ని నిందించకూడదు. ప్రపంచంలోని జీవరాశులన్నీ ఒకదానితో ఒకటి ఏదో విధంగా అనుసంధానమై ఉంటాయి. దీంతోపాటు భూత, భవిష్యత్, వర్తమాన కాలాలు కూడా అదేవిధంగా అనుసంధానమై ఉంటాయి. ఈ క్రమంలో గతంలో మనం చేసిన పనులే వర్తమానంలో, భవిష్యత్‌లో మన స్థానాన్ని నిర్ణయిస్తాయి.
మనిషి జీవితంలో తాను సాధించాలనుకున్న దానిపైనే ధ్యాస నిలపాలి. అందువల్ల కోపం, అసూయ, ఈర్ష్య వంటివి మనిషి జీవితంలోకి రాకుండా ఉంటాయి. ఇతరులకు సహాయం చేయాలనే గొప్ప గుణం కలిగి ఉన్నప్పుడు పొందే ఆనందం వర్ణించరానిది. ప్రతి ఒక్కరు అదే గుణాన్ని అలవర్చుకోవాలి. మనుషులు ఎల్లప్పుడూ వర్తమానంలోనే జీవించాలి. గతంలో జరిగిన దాన్ని తలుచుకుంటూ బాధ పడడం, భవిష్యత్ ఎలా ఉంటుందోనని ఆందోళన చెందడం ఇవి రెండూ మనుషుల్ని తీవ్రమైన మానసిక వేదనలోకి నెట్టివేస్తాయి. కాబట్టి వర్తమానంలోనే జీవించడం ఉత్తమం. మనిషి గతంలో తాను చేసిన తప్పుల్ని సరిదిద్దుకుంటూ కొత్తదైన మంచి మార్పు దిశగా ముందుకు సాగాలి. ఆ మార్పు ఎంత వేగంగా ఉంటే భవిష్యత్ ఫలం అంతే వేగంగా ముందుకు వస్తుంది.
ఏదైనా పనిచేసే సమయంలో ఎవరైనా ఎంతో ఓపికగా ఉండాలి. అదే సమయంలో వచ్చే ఫలితాన్ని గురించి మాత్రం ఆలోచించకూడదు. ఫలితం ఎలా వచ్చినా దానికి ఆమోదం తెలిపే మానసిక స్థితిని అలవాటు చేసుకుంటే ఏ సందర్భంలోనైనా ఎలాగైనా మనుషులు జీవించగలుగుతారు. ఈ క్రమంలో ఒక వేళ మంచి జరిగితే మంచి ఫలితం తప్పకుండా వస్తుంది. మనిషి దేన్నయినా సాధించాలని లక్ష్యం పెట్టుకుంటే దాని కోసం అతను 100 శాతం కష్టపడాలి. అలా చేయకుంటే పూర్తి స్థాయి ఫలితం రాదు.