business ideas

Mushroom Business : ఇంట్లోనే త‌క్కువ స్థ‌లంలో పుట్ట‌గొడుగుల‌ను పెంచుతూ ల‌క్ష‌లు సంపాదించండి ఇలా..!

Mushroom Business : ప్ర‌స్తుత త‌రుణంలో అధిక శాతం మంది స్వ‌యం ఉపాధి దిశ‌గా ముందుకు సాగుతున్నారు. త‌క్కువ పెట్టుబ‌డితో అధిక ఆదాయాన్ని అందించే మార్గాల‌ను వారు అన్వేషిస్తున్నారు. అయితే అలాంటి వ్యాపారాల్లో పుట్ట‌గొడుగుల పెంప‌కం కూడా ఒక‌టి. దీంతో త‌క్కువ పెట్టుబ‌డితోనే ఎక్కువ ఆదాయం సంపాదించ‌వ‌చ్చు. సిటీలు, ప‌ట్ట‌ణాల్లో చాలా మంది పుట్ట‌గొడుగుల‌ను సీజ‌న్ల‌తో సంబంధం లేకుండా తింటున్నారు. దీంతో పుట్ట‌గొడుగుల పెంప‌కం ద్వారా ఎవ‌రైనా స‌రే.. చ‌క్క‌ని ఆదాయం ఆర్జించ‌వ‌చ్చు. మరి ఈ వ్యాపారానికి ఎంత పెట్టుబ‌డి అవ‌స‌రం అవుతుందో.. ఆదాయం ఎంత వ‌స్తుందో.. ఇప్పుడు తెలుసుకుందామా.

పుట్ట‌గొడుగుల‌ను పెంచేందుకు పెట్టుబ‌డి త‌క్కువే అవుతుంది. అలాగే ఇందుకు భారీ యంత్రాల‌ను కొనుగోలు చేయాల్సి ప‌నిలేదు. ఎక్కువ స్థ‌లం కూడా అవ‌స‌రం లేదు. షెడ్ల‌లో లేదా ఇండ్ల‌లో ఎక్కువ స్థ‌లం ఉంటే.. అక్క‌డే పుట్ట‌గొడుగుల‌ను సుల‌భంగా పెంచ‌వ‌చ్చు. ఇక ఈ పంట చాలా త‌క్కువ స‌మ‌యంలో మ‌న‌కు చేతికి వ‌స్తుంది. దీంతో మ‌హిళ‌లు కూడా చాలా సుల‌భంగా పుట్ట‌గొడుగుల‌ను పెంచ‌వ‌చ్చు. ఇక పుట్ట గొడుగుల్లో అనేక రకాలు ఉంటాయి. కానీ ముత్య‌పు చిప్ప పుట్ట‌గొడుగులు అన‌బ‌డే వెరైటీకి చాలా త‌క్కువ పెట్టుబ‌డి అవ‌స‌రం అవుతుంది. అయితే ఇవి చ‌లికాలంలో మాత్ర‌మే పెరుగుతాయి. ఇక ప‌లు ర‌కాల పుట్ట‌గొడుగుల‌ను సీజ‌న్ల‌తో సంబంధం లేకుండా పెంచ‌వ‌చ్చు.

you can earn good income by growing mushrooms

పుట్ట గొడుగుల‌ను పెంచాలంటే ఎండు గ‌డ్డి బాగా అవ‌స‌రం అవుతుంది. గ‌డ్డిని ముందుగా నీటిలో నాన‌బెట్టి ర‌సాయ‌నాల‌తో శుద్ధి చేయాలి. అనంత‌రం పాలిథీన్ సంచుల్లో గ‌డ్డి, పుట్ట‌గొడుగుల విత్త‌నాల‌ను అర‌లు అర‌లుగా పేర్చుకుని ఆ సంచుల‌ను ఫ్రేమ్‌ల‌లో ఉంచాలి. షెడ్ల‌లో ఇలా పుట్ట‌గొడుగుల‌ను పెంచ‌వ‌చ్చు. అయితే పుట్ట‌గొడుగులు పెరిగే వాతావ‌ర‌ణ ప‌రిస్థితుల‌పై ముందుగానే అవ‌గాహ‌న క‌లిగి ఉండాలి. ప‌లు ర‌కాల పుట్ట‌గొడుగుల‌కు భిన్న వాతావ‌రణ ప‌రిస్థితులు అవ‌స‌రం అవుతాయి. అలాగే పుట్ట‌గొడుగుల‌ను పెంచే షెడ్ల‌లో ప‌రిస‌రాల‌ను శుభ్రంగా ఉంచాలి. అక్క‌డ ఉండే వ్య‌క్తులు కూడా శుభ్రంగా ఉండాలి.

పుట్ట‌గొడుగుల విత్త‌నాల‌ను వేస్తే.. స‌హ‌జంగా 12 నుంచి 13 రోజుల‌కు వాటికి మొల‌క‌లు వస్తాయి. త‌రువాత 25వ రోజు వ‌ర‌కు పుట్టగొడుగులు పెరిగి చేతికి వస్తాయి. దాంతో వాటిని సేకరించి విక్ర‌యించుకోవ‌చ్చు. ఇక ఒక సారి ఒక పంట కోసుకున్నాక‌.. రెండో పంట చేతికి వ‌చ్చేందుకు మ‌రో 7 నుంచి 10 రోజులు ప‌డుతుంది. అయితే పంటను కోశాక వాటిని సీల్డ్ క‌వ‌ర్ల‌లో ప్యాక్ చేసి 12 నుంచి 24 గంట‌ల్లోగా విక్ర‌యించాలి. ఫ్రిజ్‌ల‌లో అయితే ఇవి 2 నుంచి 3 రోజుల వ‌ర‌కు నిల్వ ఉంటాయి. ఇక ఒక‌సారి విత్త‌నాలు వేస్తే.. 2 లేదా 3 సార్లు పంట‌ను తీయ‌వ‌చ్చు. అనంత‌రం పుట్ట గొడుగులను వేసుకున్న బెడ్స్‌ను తీసేసి వాటిని కంపోస్టు ఎరువుగా త‌యారు చేసుకోవ‌చ్చు. దాంతో ఆ ఎరువు త‌రువాతి పంటకు ఉప‌యోగ‌ప‌డుతుంది.

పుట్ట‌గొడుగుల‌ను క‌వ‌ర్ల‌లో ప్యాక్ చేసి సూప‌ర్ మార్కెట్లు, హోట‌ళ్లు, రెస్టారెంట్ల‌కు విక్ర‌యించ‌వ‌చ్చు. లేదా రైతు బ‌జార్ల‌లోనూ అమ్ముకోవ‌చ్చు. ఇక 1 కిలో పుట్ట‌గొడుగు విత్త‌నాల‌తో సుమారుగా 6 నుంచి 8 కిలోల వ‌ర‌కు పుట్ట‌గొడుగులు వ‌స్తాయి. ఈ క్ర‌మంలో 1 కిలో పుట్ట‌గొడుగుల‌ ఉత్ప‌త్తికి ఖ‌ర్చు సుమారుగా రూ.34 వ‌ర‌కు అవుతుంది. ఇక మార్కెట్‌లో 1 కిలో పుట్ట గొడుగుల ధ‌ర సుమారుగా రూ.250 నుంచి మొద‌ల‌వుతుంది. అలాగే 4 ట‌న్నుల (4వేల కిలోలు) వ‌రిగ‌డ్డితో సుమారుగా 1200 కిలోల పుట్టగొడుగులను పెంచ‌వ‌చ్చు. అంటే.. 1200 * రూ.250 = రూ.3 ల‌క్ష‌లు వ‌స్తుంది. అందులో ఖ‌ర్చు తీసేస్తే.. అంటే.. 1200 * రూ.34 = రూ.40,800 అవుతుంది. ఇక రూ.3 ల‌క్ష‌ల‌లోంచి రూ.40,800 తీసేస్తే.. రూ.3,00,000 – రూ.40,800 = రూ.2,59,200 వస్తుంది. అంటే నెల‌కు దాదాపుగా రూ.2.60 ల‌క్ష‌ల ఆదాయాన్ని ఈ వ్యాపారం ద్వారా ఆర్జించ‌వ‌చ్చు.

Admin

Recent Posts