హిందూ సాంప్రదాయం ప్రకారం ప్రతి ఒక్కరూ ఎంతో ఆధ్యాత్మిక భావనలతో మెలుగుతుంటారు. ఈక్రమంలోనే ప్రతిరోజూ ఉదయం, సాయంత్రం ఇంట్లో పూజామందిరంలో దీపారాధన చేస్తూ ఆ భగవంతుడిని ప్రార్థిస్తారు. అయితే దీపారాధన చేసే సమయంలో ఒక్కొక్కరు వారి స్తోమతకు అనుగుణంగా దీపారాధన నూనెను ఉపయోగిస్తుంటారు. కానీ కొబ్బరి నూనెతో దీపారాధన చేయడం వల్ల ఎన్నో ప్రయోజనాలు ఉంటాయని పండితులు చెబుతున్నారు.
కొబ్బరి నూనెతో దీపారాధన చేస్తే కుటుంబంలో శుభకార్యాలు జరుగుతాయి. రావి చెట్టుకింద ఉండేటటువంటి నాగ దేవతల విగ్రహాలకు, శ్రీ అశ్వర్థ నారాయణ స్వామి వారికి కొబ్బరి నూనెతో దీపారాధన చేయడం వల్ల స్వామివారి అనుగ్రహం మనపై కలుగుతుంది. సంసార జీవితంలో ఎలాంటి మనస్పర్థలు లేకుండా సంతోషంగా సాగిపోతుంది. కుజదోషం ఉన్నవారు శుక్రవారం, మంగళవారం కొబ్బరినూనెతో దీపారాధన చేసి, శనగపప్పుతో బొబ్బట్లు తయారు చేసి 11 మందికి వాయనంగా ఇవ్వాలి. ఇలా చేయడం వల్ల కుజదోషం తొలగిపోయి త్వరగా వివాహం జరుగుతుంది.
మహాలక్ష్మికి 40 రోజుల పాటు కొబ్బరి నూనెతో దీపారాధన చేసి పంచదారను నైవేద్యంగా పెట్టడం వల్ల వారి ఇంట్లో ఏ విధమైనటువంటి ఆర్థిక సమస్యలు లేకుండా శుభకార్యాలు జరుగుతాయని పండితులు చెబుతున్నారు. పితృదేవతలకు శ్రాద్ధం పెట్టేటప్పుడు కొబ్బరి నూనెతో దీపారాధన చేస్తే వారి ఆత్మ సంతోషించి స్వర్గలోక ప్రాప్తి కలుగుతుందని పండితులు చెబుతున్నారు.