Shankar Dada MBBS : ఇంద్ర, ఠాగూర్ వంటి యాక్షన్ అండ్ మెసేజ్ ఓరియెంటెడ్ చిత్రాల తర్వాత మెగాస్టార్ చిరంజీవి పూర్తి స్థాయిలో ప్రేక్షకులను వినోదభరితంగా ఆహ్లాదపరిచి చేసిన చిత్రం శంకర్ దాదా ఎంబిబిఎస్. మానసిక రోగాన్ని ప్రేమతోనే నయం చేయగలం అనే మెసేజ్ తో అప్పట్లో వచ్చిన ఈ చిత్రం ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంది. ఈ చిత్రంలో మెగా స్టార్ కామెడీ టైమింగ్ తో అందరినీ కడుపుబ్బా నవ్వించారు. పరేష్ రావల్, చిరంజీవికి మధ్య జరిగిన లింగంమాయ్య అంటూ సాగే కామెడీ సంభాషణ ఈ చిత్రానికి ఎంతో హైలెట్ గా నిలిచింది. చిట్టిగా హీరోయిన్ సోనాలి బింద్రే కూడా శంకర్ దాదా ను ఆటపట్టించడం అందరినీ ఆకట్టుకుంది. దేవిశ్రీప్రసాద్ అందించిన మ్యూజిక్ ఇప్పటికి కూడా అందరినీ ఎంతగానో అలరిస్తుంది.
ఈ చిత్రంలో చిరంజీవితోపాటు హీరో శ్రీకాంత్ నటించిన ATM పాత్రకు కూడా మంచి గుర్తింపు లభించింది. తెలుగు ప్రేక్షకులు ఇప్పటివరకు ATM గా శ్రీకాంత్ పాత్ర బాగా గుర్తుండిపోతుంది. శంకర్ దాదా ఎంబిబిఎస్ చిత్రం బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ల వర్షం కురిపించింది. ఈ చిత్రానికి సీక్వెల్ గా వచ్చిన శంకర్ దాదా జిందాబాద్ చిత్రంలో కూడా ATM గా హీరో శ్రీకాంత్ నటించారు. ఈ రెండు చిత్రాలు కూడా హిందీలో సంజయ్ దత్ నటించిన మున్నాభాయ్ ఎంబిబిఎస్ చిత్రానికి అనువాదంగా తెలుగులో చిరంజీవి చేశారు.
ఇటీవలే జరిగిన ఒక ఇంటర్వ్యూ లో శ్రీకాంత్ ఈ చిత్రానికి సంబంధించి కొన్ని ఆసక్తికరమైన విషయాలను మీడియాతో పంచుకున్నారు. ఈ చిత్రంలో ATM పాత్రను చిరంజీవి ముందుగా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ని అనుకున్నారు. కానీ అప్పటికే పవన్ కళ్యాణ్ ఖుషి చిత్రంతో సక్సెస్ సాధించి వరుస సినిమా ఆఫర్లతో దూసుకుపోతున్న సమయంలో ఏటీఎం క్యారెక్టర్ తో పవన్ కళ్యాణ్ కెరియర్ దెబ్బతినే ప్రమాదం ఉందని ఆయన్ని దూరం పెట్టారని శ్రీకాంత్ వెల్లడించారు. అంతేకాకుండా అప్పటికే పవన్ కళ్యాణ్ గుడుంబా శంకర్ చిత్రం షూటింగ్‌లో బిజీగా ఉండటంతో శంకర్ దాదా ఎంబిబిఎస్ చిత్రంలో నా పేరే కాంచనమాల సాంగ్ లో చిన్న గెస్ట్ అప్పియరెన్స్ ఇచ్చారని తెలిపారు.
బాలయ్య బాబు అఖండ చిత్రంలో విలన్ క్యారెక్టర్ లో శ్రీకాంత్ అద్భుతమైన నటనతో ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకున్నారు. అఖండ చిత్రంతో విలన్ గా మంచి గుర్తింపు తెచ్చుకున్న శ్రీకాంత్ ఇప్పుడు స్టార్ హీరోల సినిమాల్లో విలన్ క్యారెక్టర్స్ దక్కించుకుంటున్నారు.