Chiranjeevi : టాలీవుడ్ లో హీరో ఎప్పుడూ హీరోగానే ఉంటాడు. ఆరు పదుల వయస్సు వచ్చినా సరే.. తగ్గేదేలే అంటూ హీరోగానే కొనసాగుతాడు. ఇప్పుడు కొంత మార్పు వచ్చి విలన్ క్యారెక్టర్స్ చేస్తున్నప్పటికీ ఫాదర్ క్యారెక్టర్ లు మాత్రం అస్సలు చేయరు. కానీ హీరోయిన్లకు మాత్రం ఆ అవకాశం ఉండదు. మూడు పదుల వయసు దాటితే చాలు తట్టా బుట్టా సర్దుకోవాల్సిందే.. అదృష్టం బాగుంటే ఇంకో 5 సంవత్సరాలు హీరోయిన్ లుగా నటిస్తుంటారు. కానీ ఆ తరవాత మాత్రం అక్క, వదిన పాత్రలకు షిఫ్ట్ అవ్వాల్సిందే.. అంతే కాకుండా అవసరమైతే తల్లి పాత్రలు అయినా చేయక తప్పుదు. ఇక కొంతమంది హీరోయిన్ లు అయితే తాము ఆడిపాడిన హీరోలకే తల్లిగా చేసే అవకాశాలు కూడా వస్తాయి.
అలా మెగాస్టార్ చిరంజీవి సరసన హీరోయిన్ గా నటించిన ఇద్దరు హీరోయిన్ లు ఆయనకు తల్లిగా నటించారు. ఆ ఇద్దరు హీరోయిన్ లు ఎవరు.. వారు తల్లిగా చేసిన సినిమాలేవి అనేది చూద్దాం.. 1979లో జయసుధ, చిరంజీవి కాంబినేషన్ లో ఇది కథ కాదు అనే సినిమా వచ్చింది. ఈ చిత్రానికి బాల చందర్ దర్శకత్వం వహించారు. అంతే కాకుండా మగధీరుడు సినిమాలోనూ చిరంజీవి జయసుధ హీరోహీరోయిన్ లు గా నటించారు. కానీ 1995లో కోడి రామకృష్ణ దర్శకత్వంలో రిక్షావోడు సినిమా వచ్చింది. ఈ సినిమాలో జయసుధ చిరంజీవికి తల్లిగా నటించింది. దీంతో అంతా షాకయ్యారు.
ఇదిలా ఉంటే 1980లో వచ్చిన ప్రేమ తరంగాలు సినిమాలో చిరంజీవి సుజాత హీరో, హీరోయిన్ లుగా కలిసి నటించారు. కానీ ఆ తరవాత సీతాదేవి సినిమాలో సుజాత చిరంజీవికి చెల్లెలి పాత్రలో నటించింది. ఇక అక్కడితో ఆగకుండా 1995లో మెగాస్టార్ హీరోగా బిగ్ బాస్ సినిమా వచ్చింది. ఈ సినిమాలో మెగాస్టార్ సరసన రోజా హీరోయిన్ గా నటిస్తే.. ఇక ఈ సినిమాలో మెగాస్టార్ కు తల్లి పాత్రలో సుజాత నటించి అందరినీ ఆశ్చర్యపరిచింది.