వినోదం

తెలుగు సినిమాలకు, ట్రైలర్లకు విదేశీయుల రియాక్షన్ వీడియోలకు ఎందుకని కోట్ల కొద్దీ వ్యూస్ వస్తున్నాయి? ఏముంది అందులో అంతగా చూడడానికి?

2018లో ఎస్టోనియాకు చెందిన ఒక కొలీగ్, వాళ్ళ కుటుంబం భారతదేశానికి వచ్చి, ఇక్కడ సరదాగా పర్యటించారు. ఆ క్రమంలో వాళ్ళు హైదరాబాద్‌ వచ్చినప్పుడు నేను సెలవు పెట్టుకుని, నగరంలో నాలుగు చోట్లూ చూపించాను. నగరంలో ఏ మూలకు వెళ్ళినా ఈ భార్యాభర్త, పిల్లలు ఏదో పెద్ద స్టార్లు అన్న స్థాయిలో బ్రతిమాలి మరీ ఫోటోలు దిగుతున్నారు. ఎక్కడికి వెళ్ళినా ఎవరో ఒకరు ఆపడం, సెల్ఫీనో, గ్రూప్ఫీనో తీయించుకోవడం. ఇంకా గట్టిగా మాట్లాడితే నా చేతికి ఫోన్ ఇచ్చి నన్ను ఫోటోలు తీయమనడం. ఒకళ్ళు కాదు, ఇద్దరు కాదు. ప్రతీ వీధిలోనూ, ప్రతీ ప్రదేశంలోనూ – ఎక్కడ చూసినా ఇంతే. చదువుకున్నవాళ్ళు, కోనివాళ్ళు అని తేడా లేదు. వయసు తేడా లేదు. ఎవరు పడితే వాళ్ళు ఆపడం, ఫోటో తీసుకోవడం.

నాకు దిమ్మదిరిగిపోయింది. విసుగొచ్చి ఒకడిని, ఎందుకు బాబూ ఫోటోలు దిగుతున్నారు. వీళ్లెవరో మీకు తెలుసా? అని అడిగాను. వెకిలిగా పళ్ళు ఇకిలించాడే గానీ సమాధానం చెప్పలేదు. వాళ్ళ పిల్లలు చిన్నది పాపం రెండేళ్ళది. ఆ పాపనైతే దాదాపు లాగేసుకుని ఎత్తుకుని ఫోటోలు దిగారు. ఈ అయోమయానికి అది ఏడ్చేస్తోంది. మిగిలిన పిల్లలు మాత్రం మామూలుగానే హ్యాండిల్ చేస్తున్నారు. వాళ్ళకు మన దేశంలో ఎదురవుతున్న ఇబ్బంది చూసి నాకు ఎందుకో తెలియదు కానీ సిగ్గుగా అనిపించింది. ఏమీ అనుకోకండని సర్ది చెప్పబోయాను. అప్పటికే ఈ కుటుంబం ఢిల్లీ, ఆగ్రా, మహారాష్ట్ర, బెంగళూరు వంటి ప్రాంతాలు చూసి వచ్చారు. దానితో ఈ వేలంవెర్రి చూసి చూసి ఉన్నారు. అందువల్ల నాకే ఎదురు చెప్పారు. ఇది మాకు నిత్యకృత్యం అయిపోయింది గత వారం రోజులుగా, ఏమీ ఫర్వాలేదు అని. అందువల్లనే వాళ్ళ పిల్లలు కూడా అలవాటుపడిపోయారు.

why foreign creators get millions of views for reaction videos

మనోళ్ళు ఎందుకు ఇలా ఉన్నారు అని ఆలోచించినప్పుడు సాధ్యమైనంత పాజిటివ్‌గానే పాయింట్లు వెతుక్కున్నాను. బహుశా – కొత్తది ఏం చూసినా ఇలానే ప్రతిస్పందించడం మానవ సహజం అని అనుకున్నాను. కానీ, వీళ్ళు కొత్తగా ఫీలవ్వట్లేదే. ఒక సినిమా హీరోనో, క్రికెట్ స్టారో, రాజకీయ నాయకుడో వచ్చినట్టు క్రేజ్ ఫీలవుతున్నారు. అన్నిటికన్నా ముఖ్యంగా మన హైదరాబాద్‌కి ఏకంగా విదేశీయులు వచ్చేశారంటే ఎంత గ్రేటో అన్న భావన. వాళ్ళకి చార్మినార్ నచ్చినా, అక్కడ చాయ్ నచ్చినా అవి ధన్యం అయ్యాయన్న భావన. విదేశీయులు అయితే చాలు. వాళ్ళేమీ నిపుణులో, గొప్పోళ్ళో అవ్వక్కరలేదు. అసలు ఎవరో ఏమిటో తెలియని ఒక మామూలు తెల్లవాళ్ళు మనకు సంబంధించిన ఏ వస్తువునో, కట్టడాన్నో గుర్తిస్తే దానికి అంతర్జాతీయ గుర్తింపు వచ్చేసినట్టే! ఆత్మన్యూనత అంటే కాస్త మెరుగ్గా ఉంటుంది. బానిస మనస్తత్వం అంటే మోటుగా ఉంటుంది. ఏది నచ్చితే అది వాడుకోండి. విషయం మాత్రం ఇదే. విదేశీయులు, అది కూడా పాశ్చాత్యులు, మనకు పరమ ప్రమాణం. మన కళలకు, కట్టడాలకు, తెలివికి, నైపుణ్యానికి ఏ దారినపోయే తెల్లవాడికో నచ్చడమే పరమావధి.

ఈ రియాక్షన్ వీడియోలకు కోట్ల కొద్దీ వ్యూస్ వచ్చినప్పుడు నా రియాక్షన్. ఇంట గెలిచి రచ్చ గెలవాలని సామెత. కానీ, మనకు మాత్రం రచ్చ గెలిచినవాడే గొప్పవాడు. 1998లో అమర్త్యసేన్‌కి ఆర్థికశాస్త్రంలో నోబెల్ బహుమతి వచ్చింది. అంతవరకూ ఆయనకు పద్మశ్రీ పురస్కారం కూడా రాలేదు. నోబెల్ రాగానే టక్కున 1999లో ప్రభుత్వం ఆయనకు భారతరత్న ప్రదానం చేసేసింది. ఎ.ఆర్.రహమాన్ ఎన్నో అద్భుతమైన పాటలు చేశారు. ఆయన పాటల్లో ఎన్నిటికో సాటిరాని జయహోకు ఎక్కడో ఆస్కార్, గ్రామీ వంటి వేదికల మీద పురస్కారం దక్కింది. అంతటితో మన దృష్టిలో ఆయన కీర్తికి పరిపూర్ణత వచ్చింది. ఇలాంటి ఉదాహరణలు కావాలంటే కోకొల్లలు. ట్రెండింగ్‌లో ఉన్న తెలుగు ట్రైలర్లు, పాటలు పెట్టుకుని ఒక రియాక్షన్ వీడియో చేసేయడం ఈజీ. దీనికి పెద్ద ప్రయాస పడక్కరలేదు. నేర్చుకోవక్కరలేదు. క్రియేటివిటీ అసలే అక్కరలేదు. ఉత్తినే తెల్లవాళ్ళైతే చాలు. ఆ దెబ్బకి మనం ఆ ట్రైలర్‌కి ఆస్కార్ అవార్డు వచ్చినట్టు ఫీలైపోతాం. ఉత్తి పుణ్యానికి కోట్ల కొద్దీ (అదే లెండి మిలియన్ల కొద్దీ) వ్యూస్ వచ్చేస్తాయి. ఇంతకీ, ఏ హాలీవుడ్ సినిమా ట్రైలర్‌కో మీరో, నేనో ఒక రియాక్షన్ వీడియో పెడితే ఎవరైనా చూస్తారా?

Admin

Recent Posts