బరువు తగ్గడం కష్టంగా ఉందా. జిమ్ లేదా వ్యాయామం కోసం అంత సమయాన్ని వెచ్చించలేకపోతున్నారా.. అయితే కింద మేం ఇచ్చిన ఈ ఎక్సర్‌సైజ్‌లను చేయండి. వీటిని చేసేందుకు పెద్దగా సమయం పట్టదు. ఉదయం లేదా సాయంత్రం ఎప్పుడైనా మీరు తీరిక చేసుకుని ఇంట్లోనే ఈ వ్యాయామాలను చేయవచ్చు. దీంతో అధిక బరువు తగ్గుతారు. పొట్ట దగ్గరి కొవ్వు కరుగుతుంది. ఇక ఆ వ్యాయామాలు ఏమిటో ఇప్పుడు చూద్దాం. Burpees (బర్పీస్).. రెండు కాళ్లపై నిలబడి వాటిని దూరంగా ఉంచాలి. గుంజీలు తీస్తున్నట్లుగా ముందుకు వంగాలి. చేతులను కాళ్ల మధ్యలో ఉంచి వాటిని నేలపై ఆనించాలి. అనంతరం కాళ్లపై వెనక్కి జంప్ చేయాలి. ముందుకు పుషప్ చేస్తున్నట్లు వంగి వెంటనే నిలబడాలి. అలాగే ఇదే స్టెప్‌ను ముందుకు జంప్ చేస్తూ చేయాలి. ఈ వ్యాయామంతో ఒక్కటే నిమిషంలో 10 నుంచి 15 క్యాలరీలు ఖర్చవుతాయి. గుండె ఆరోగ్యం సురక్షితంగా ఉంటుంది.
Bicycle crunch (బై సైకిల్ క్రంచ్).. చేతులను తలకింద ఉంచాలి. అనంతరం కాళ్లను కొద్దిగా గాల్లోకి లేపి సైకిల్ తొక్కినట్లు తొక్కాలి. దీంతో 1 నిమిషానికి 3 క్యాలరీలు ఖర్చవుతాయి. పొట్ట దగ్గర కండరాలు దృఢంగా మారుతాయి. పొట్ట దగ్గర ఉండే కొవ్వు కరుగుతుంది. Running stairs (రన్నింగ్ స్టెయిర్స్).. ఇండ్లలో మెట్లు ఉన్నవారు వాటిని ఎక్కి దిగాలి. కానీ ఈ పని వేగంగా చేయాలి. దీని వల్ల 65 కిలోలు ఉన్న ఒక వ్యక్తి గంటకు ఏకంగా 900 క్యాలరీల వరకు ఖర్చు చేయవచ్చు. ఈ వ్యాయామం వల్ల కండరాలు దృఢంగా మారుతాయి. గుండె ఆరోగ్యంగా ఉంటుంది. అధిక బరువు వేగంగా తగ్గుతారు. అయితే దీన్ని 5 నిమిషాల పాటు చేసి 1 నిమిషం రెస్ట్ చేసుకుని మళ్లీ 5 నిమిషాల పాటు చేయాలి. ఇలా ఓపిక ఉన్నంత వరకు చేయవచ్చు.
Skipping rope (స్కిప్పింగ్ రోప్).. స్కిప్పింగ్ రోప్ వ్యాయామం వల్ల నిమిషానికి 15 నుంచి 20 క్యాలరీల వరకు ఖర్చు అవుతాయి. దీంతో ఎముకలు, కండరాలు దృఢంగా మారుతాయి. గుండె ఆరోగ్యంగా ఉంటుంది. అధిక బరువు తగ్గుతారు. Jumping jack (జంపింగ్ జాక్).. ఈ వ్యాయామం వల్ల 60 కిలోల బరువు ఉన్న ఒక వ్యక్తి నిమిషానికి 8 క్యాలరీలను ఖర్చు చేయవచ్చు. దీంతో కాలి కండరాలు, ఎముకలు దృఢంగా మారుతాయి. గుండె ఆరోగ్యం సంరక్షింపబడుతుంది. Spot jogging (స్పాట్ జాగింగ్).. సాధారణంగా బయట ఒక మోస్తరు స్పీడ్‌తో పరిగెత్తుతూ చేసే వ్యాయామాన్ని జాగింగ్ అంటారు. కానీ స్పాట్ జాగింగ్ అంటే.. ఇంట్లోనే చేయవచ్చు. ఒకే ప్లేసులో ఎటూ వెళ్లకుండా చేసే జాగింగ్‌ను స్పాట్ జాగింగ్ అంటారు. ఇంచు మించు ఇది కూడా జాగింగ్ లాంటిదే. సరిగ్గా జాగింగ్ లాంటి ఫలితాలనే ఈ వ్యాయామం కూడా మనకు అందిస్తుంది. దీని వల్ల 56 కిలోలు ఉన్న ఒక వ్యక్తి 10 నిమిషాలకు ఏకంగా 60 క్యాలరీలను ఖర్చు చేయవచ్చు. దీంతో గుండె ఆరోగ్యంగా ఉంటుంది. అధిక బరువు తగ్గుతారు.