ఉదయం నిద్ర లేచిన వెంటనే చాలా మంది భిన్న రకాల పనులు చేస్తుంటారు. కొందరు కాలకృత్యాలు తీర్చుకుని వ్యాయామం, యోగా వంటివి చేస్తారు. కొందరు బెడ్ కాఫీ, టీ తాగనిదే ఏ పని మొదలు పెట్టరు. ఇలా చాలా మంది ఉదయం నిద్ర లేచిన వెంటనే భిన్న రకాల పనులు చేస్తుంటారు. అయితే ఉదయం నిద్ర లేచాక కొన్ని రకాల పనులను చేయడం వల్ల అవి మనకు దరిద్రాన్ని తెచ్చిపెట్టడమే కాక.. ఆరోగ్యంపై కూడా ప్రభావాన్ని చూపిస్తాయి. కనుక ఉదయం నిద్ర లేచాక ఎట్టి పరిస్థితిలోనూ ఆ పనులను చేయకూడదు. మరి ఆ పనులు ఏమిటంటే..
ఉదయం నిద్ర లేచాక కొందరు అద్దంలో తమ ముఖాన్ని తాము చూసుకుంటారు. కానీ ఇలా చేయడం వల్ల జ్యోతిష్య శాస్త్రం ప్రకారం నెగెటివ్ ఎనర్జీ వస్తుందట. అంతేకాదు, కొందరు నిద్ర లేవగానే తమ ముఖంతోపాటు ఇతరుల ముఖం కూడా చూస్తుంటారు. ఇలా చేయరాదు. ఉదయం నిద్ర లేవగానే ఇష్ట దైవాన్ని స్మరించుకుని కళ్లు తెరిచి అర చేతులను చూసుకోవాలి. చేతి వేళ్ల పై భాగంలో లక్ష్మీ దేవి ఉంటుందట. అందువల్ల చేతి వేళ్లను ఉదయం నిద్ర లేవగానే చూస్తే మంచిదట. దీంతో ఆయురారోగ్య ఐశ్వర్యాలు కలుగుతాయి. రోజంతా శుభం కలుగుతుందట.
ఇక మనం నిద్రలో ఉన్నప్పుడు మన జీవక్రియలు మందగిస్తాయి. నెమ్మదిగా జరుగుతాయి. ఈ క్రమంలో ఉదయం నిద్ర లేచిన వెంటనే జీవక్రియలు వేగంగా కొనసాగుతాయి. అయితే ఈ సమయంలో గుండెపై ఒత్తిడి పడకుండా ఉండాలంటే.. మంచం మీద నుంచి కుడి వైపునకు తిరిగి.. అటు నుంచే నిద్ర లేవాలి. మంచం దిగాలి. దీంతో ఆరోగ్యంగా ఉంటారు.
ఉదయం నిద్ర లేచిన వెంటనే గుడి గంటల ధ్వని, శంఖం ధ్వని, గాయత్రీ మంత్రాలను వింటే మంచిది. అవి అందుబాటులో లేకపోతే ఉదయం వాటిని అలారంగా పెట్టుకుని నిద్ర లేవచ్చు. దీని వల్ల శరీరంలో పాజిటివ్ ఎనర్జీ వస్తుంది. ఆరోగ్యంగా ఉంచుతుంది.
ఇక ఉదయం నిద్ర లేచాక నెమలి ఈకలు, తామర పువ్వు, పచ్చని ప్రకృతిని చూడాలి. అలాంటి చిత్రాలను బెడ్ రూమ్‌లో పెట్టుకోవాలి. అలాగే ఉదయం ఇష్టదైవం ఫొటో లేదా బంగారం, సూర్యుడు, ఆవుదూడలను చూసినా మేలు జరుగుతుంది.
ఉదయం సూర్యుడు ఉదయించక ముందే నిద్ర లేవాలి. బారెడు పొద్దెక్కే దాకా నిద్రించరాదు. అలా చేస్తే దరిద్రం చుట్టుకుంటుంది. ఇంటి ఇల్లాలు ఎల్లప్పుడూ తెల్లవారు జామునే నిద్ర లేస్తే మంచిది. ఇక ఉదయం నిద్ర లేచిన తరువాత పక్షులు, జంతువులకు ఆహారం, నీరు పెడితే చాలా మంచిది. దీంతో దోషాలు పోయి ఆరోగ్యంగా ఉంటారు.
ఉదయాన్నే చాలా మంది వార్తలు చదువుతారు. అయితే వాటిల్లో హింసను ప్రేరేపించేవి, క్రైమ్, నెగెటివ్ వార్తలను చదవరాదు. దీని వల్ల మెదడుకు నెగెటివ్ సిగ్నల్స్ వెళ్తాయి. దీంతో నెగెటివ్ ఆలోచనలు వస్తాయి. అందువల్ల ఉదయం అలాంటి వార్తలు చదవరాదు. చూడరాదు.
ఉదయం నిద్ర లేచిన వెంటనే ఎట్టి పరిస్థితిలోనూ బెడ్ కాఫీ, టీ లను తాగరాదు. వీటి వల్ల జీర్ణవ్యవస్థపై ప్రభావం పడుతుంది. శరీరంలో కెఫీన్ మోతాదు బాగా పెరుగుతుంది. ఇది గ్యాస్, అసిడిటీ, గుండెల్లో మంట వంటి సమస్యలను కలగజేస్తుంది.
ఇక ఉదయం లేచిన వెంటనే కొందరు భార్యాభర్తలు శృంగారంలో పాల్గొంటారు. కానీ అలా చేయరాదు. ఆ సమయంలో ప్రశాంతంగా ఉండి ధ్యానం చేయాలి. లేదా దైవానికి పూజలు చేయాలి. లేదంటే దరిద్రం పట్టుకుంటుందని.. శాస్త్రాలు చెబుతున్నాయి.