Bombay High Court : ఓ జంటకు చెందిన సహజీవనానికి సంబంధించి బాంబే హైకోర్టు సంచలన తీర్పును వెలువరించింది. తనతో కొన్నేళ్లుగా సహజీవనం చేసిన ఓ వ్యక్తి తనను పెళ్లి చేసుకునేందుకు నిరాకరించాడని ఆరోపిస్తూ ఓ మహిళ అక్కడి సెషన్స్ కోర్టును ఆశ్రయించింది. 1996లో ఆ మహిళ ఈ విధంగా కేసు పెట్టింది.
ఈ క్రమంలోనే ఆ వ్యక్తిపై 376 (అత్యాచారం), 417 (మోసగించడం) సెక్షన్ల కింద కేసులు నమోదు అయ్యాయి. అయితే 3 ఏళ్ల విచారణ అనంతరం ఆ వ్యక్తిపై ఉన్న అత్యాచార కేసును సెషన్స్ కోర్టు కొట్టేసింది. కానీ అతను చీటింగ్ చేశాడని చెబుతూ అతనికి ఒక ఏడాది పాటు కఠిన శిక్ష విధించింది. ఈ క్రమంలోనే ఆ వ్యక్తి హైకోర్టులో అప్పీల్ చేసేందుకు విజ్ఞప్తి చేశాడు.
అయితే ఇరుపక్షాల వాదనలను విన్న హైకోర్టు న్యాయమూర్తి అనుజా ప్రభు దేశాయ్ సంచలన తీర్పును వెలువరించారు. సహజీవనం చేసినంత మాత్రం అతను పెళ్లి చేసుకోవాలని ఏమీ లేదని.. ఇరువురి అంగీకారంతోనే సహజీవనం చేశారు కనుక.. అక్కడ మోసం అనే పదానికి తావులేదని.. కనుక అతను కోర్టులో అప్పీల్ చేసుకోవచ్చని న్యాయమూర్తి వెల్లడించారు.
కొన్ని ఏళ్ల పాటు సహజీవనం చేసిన తరువాత పెళ్లి చేసుకునేది లేదని చెబితే.. మోసం చేసినట్లు కాదని అన్నారు. ఇరువురి అంగీకారం మేరకే సహజీవనం చేశారు కనుక మోసం అనే పదాన్ని వాడలేమని తెలిపారు. ఇక ఈ కేసులో కింది కోర్టు ఇచ్చిన తీర్పును పక్కన పెడుతున్నట్లు న్యాయమూర్తి తెలిపారు.