Prawns Masala Curry : ఆదివారం వచ్చిందంటే చాలు.. చాలా మంది అనేక రకాల నాన్ వెజ్ వంటకాలను తింటుంటారు. చికెన్, మటన్, చేపలతోపాటు రొయ్యలను కూడా తింటారు. రొయ్యలతో వేపుడు, బిర్యానీ చేస్తారు. కానీ రొయ్యలతో ఎంతో ఘాటైన మసాలా కూరను కూడా చేయవచ్చు. ఇది అన్నం లేదా చపాతీలు.. ఎందులోకి అయినా సరే రుచిగా ఉంటుంది. దీన్ని చేయడం కూడా సులభమే. మసాలా రొయ్యల కూరను ఎలా చేయాలో ఇప్పుడు తెలుసుకుందాం.
మసాలా రొయ్యల కూర తయారీకి కావల్సిన పదార్థాలు..
శుభ్రం చేసిన పచ్చి రొయ్యలు – 1 కప్పు, పసుపు, మిరియాల పొడి – అర టీస్పూన్ చొప్పున, ఉప్పు – తగినంత, నిమ్మరసం – 2 టీస్పూన్లు, జీలకర్ర – 2 టీస్పూన్లు, నూనె – అర కప్పు, ఆవాలు – అర టీస్పూన్, కరివేపాకు – 2 రెబ్బలు, ఉల్లిపాయ, టమాటా – 1 చొప్పున, అల్లం – చిన్న ముక్క, వెల్లుల్లి రెబ్బలు – ఆరు, పచ్చి మిర్చి – 2, ధనియాల పొడి – ఒకటిన్నర టీస్పూన్, పలుచని చింత పండు రసం – 2 టేబుల్ స్పూన్లు, గరం మసాలా – అర టీస్పూన్.
మసాలా రొయ్యల కూరను తయారు చేసే విధానం..
రొయ్యలపైన పావు టీస్పూన్ చొప్పున పసుపు, మిరియాల పొడి, ఉప్పు, నిమ్మరసం వేసి బాగా కలిపి పక్కన పెట్టాలి. స్టవ్ మీద కడాయి పెట్టి అది వేడయ్యాక జీలకర్ర వేయించుకుని చల్లారాక పొడి చేసి పెట్టుకోవాలి. అదే కడాయిలో ఒక టీస్పూన్ నూనె వేసి ఆవాలు, కరివేపాకు వేయించాలి. 2 నిమిషాలయ్యాక ఉల్లిపాయ ముక్కలు వేసి వేయించాలి. తరువాత అల్లం, వెల్లుల్లి, పచ్చి మిర్చి తరుగు వేయాలి. అవి వేగాక మిగిలిన పసుపు, ధనియాల పొడి, ముప్పావు వంతు జీలకర్ర పొడి వేసుకోవాలి. టమాటా ముక్కలు కూడా వేసి ఉడికించాలి. తరువాత రొయ్యలు, చింతపండు నీళ్లు, తగినంత ఉప్పు వేసి బాగా కలపాలి. ఇది దగ్గరగా ఉడికిన తరువాత గరం మసాలా పొడి, మిగిలిన జీలకర్ర పొడి వేసి కలిపి దింపేయాలి. దీంతో ఎంతో రుచికరమైన మసాలా రొయ్యల కూర రెడీ అవుతుంది. ఇది అన్నం లేదా చపాతీలు.. ఎందులోకి అయినా సరే బాగుంటుంది. తరచూ రొయ్యలను వండుకునే వారు ఇలా ఓసారి ట్రై చేయండి.. కొత్త టేస్ట్‌ను ఆస్వాదించవచ్చు.