Stuffed Bhindi : బెండకాయలు ఆరోగ్యానికి చాలా మేలు చేస్తాయి. అందుకని, చాలామంది రకరకాలుగా బెండకాయలని వండుకుంటూ ఉంటారు. బెండకాయ ఫ్రై, కూర, బెండకాయతో పులుసు ఇలా అనేక రకాల వంటకాలని మనం బెండకాయలతో తయారు చేసుకో వచ్చు. మసాలా ని పెట్టి స్టఫ్ బెండకాయ కూడా ట్రై చేయొచ్చు. ఎప్పుడు మీరు ఇలా ట్రై చేసి ఉండకపోతే ఈసారి ట్రై చేయండి. ఇది చాలా సులువు. పైగా, తినే కొద్ది తినాలని అనిపిస్తూ ఉంటుంది. ఒకసారి మీరు చేశారంటే, మళ్ళీ మళ్ళీ చేసుకుంటారు.
మామూలుగా బెండకాయ కూర ఇష్టపడని వాళ్ళు కూడా, ఇలా ట్రై చేయొచ్చు. కొంచెం గ్రేవీగా కావాలనుకుంటే, టమాటా కూడా ఉపయోగించుకోవచ్చు. పొడిపొడిగా కావాలనుకుంటే, ఇలా మసాలా తో మీరు తయారు చేసుకోవచ్చు. మరి ఇక దీనిని ఎలా తయారు చేసుకోవాలి అనే విషయాన్ని తెలుసుకుందాం. దీనికోసం ముందు కడాయి పెట్టి, పల్లీలు వేయించుకోండి.
చల్లారాక మిక్సీ పట్టండి. ఇప్పుడు శనగపిండిని కూడా, నూనె లేకుండా వేయించుకోండి. పల్లీలు పొడి ని దీనిని మిక్స్ చేసుకోవాలి. ఇందులోనే కొబ్బరి పొడి, ధనియాల పొడి, పసుపు, కారం, గరం మసాలా, ఆమ్చూర్ పౌడర్ వేసి అన్నీ మిక్స్ చేసి, ఒక చెంచా ఉప్పు వేసి బాగా కలుపుకోండి. ఈ మసాలాని ఒక పక్కన పెట్టుకోండి. బెండకాయలని పొడుగ్గా ఉంచి గాటు పెట్టుకోవాలి. తొడుమలని తొలగించేయాలి.
గాట్లలో మసాలా మిశ్రమాన్ని స్టఫ్ చేసుకోండి. ఇప్పుడు, ఒక కడాయి పెట్టి రెండు చెంచాల నూనె వేసుకుని, వేడెక్కిన తర్వాత స్టఫ్ చేసుకున్న బెండకాయలని వేసేసి, సిమ్ లో పెట్టి మూత పెట్టేయండి. ఈ బెండకాయలు బాగా వేగిన తర్వాత, ఒక పక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడు ఇదే కడాయిలో జీలకర్ర, అల్లం, వెల్లుల్లి, పచ్చిమిర్చి వేసి వేయించుకుని.. టమాటా ముక్కల్ని, ఉప్పు కూడా వేసి మెత్తగా అవ్వనివ్వాలి. తయారు చేసుకున్న బెండకాయల్ని కూడా, ఇందులో కలుపుకొని సర్వ్ చేసుకుంటే సరిపోతుంది.