Dalchina Chekka Kashayam : మనం వంటల్లో వాడే మసాలా దినుసుల్లో దాల్చిన చెక్క ఒకటి. దీనిని ఎంతో కాలంగా మనం వంటల్లో ఉపయోగిస్తున్నాము. దాల్చిన చెక్కను వాడడం వల్ల వంట రుచి పెరగడంతో పాటు ఆరోగ్యానికి కూడా మేలు కలుగుతుంది. దాల్చిన చెక్క ఆరోగ్యానికి మేలు చేస్తుందని మనలో చాలా తెలిసి ఉండదు. కానీ దాల్చిన చెక్కను వాడడం వల్ల మనం చక్కటి ఆరోగ్యాన్ని సొంతం చేసుకోవచ్చు. దాల్చిన చెక్కలో ఎన్నో ఔషధ గుణాలు దాగి ఉన్నాయి. ఇవి మన ఆరోగ్యాన్ని కాపాడడంలో ఎంతగానో దోహదపడతాయి. జీర్ణ శక్తిని మెరుగుపరచడంలో దాల్చిన చెక్క ఎంతో సహాయపడుతుంది. అజీర్తి, గ్యాస్, మలబద్దకం, ఎసిడిటి వంటి సమస్యలతో బాధపడే వారు దాల్చిన చెక్కను ఉపయోగించడం వల్ల మనం చక్కటి ఫలితాలను పొందవచ్చు.
అలాగే ప్రస్తుత కాలంలో మనలో చాలా మందిని వేధిస్తున్న అధిక బరువు సమస్యను తగ్గించడంలో కూడా దాల్చిన చెక్క ఉపయోగపడుతుంది. మన శరీరంలో జీవక్రియల రేటును పెంచి త్వరగా బరువు తగ్గేలా చేయడంలో దాల్చిన చెక్క చక్కగా పని చేస్తుంది. దాల్చిన చెక్కతో ఫేస్ ప్యాక్ ను తయారు చేసుకుని వాడడం వల్ల చర్మ సమస్యలు అన్ని తగ్గు ముఖం పడతాయి. చర్మం పై ముడతలు రాకుండా చర్మం యవ్వనంగా కనబడుతుంది. ఈ దాల్చిన చెక్కను వంటల్లో ఉపయోగించడం కంటే దీనితో కషాయాన్ని తయారు చేసుకుని తాగడం వల్ల మంచి ఫలితాలను పొందవచ్చు. మన ఆరోగ్యానికి ఎంతో మేలు ఈ దాల్చిన చెక్క కషాయాన్ని ఎలా తయారు చేసుకోవాలి.. అన్న వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం.
ముందుగా ఒక గిన్నెలో ఒక గ్లాస్ నీటిని తీసుకోవాలి. తరువాత ఇందులో 3 దాల్చిన చెక్క ముక్కలను వేసి మధ్యస్థ మంటపై మరిగించాలి. నీళ్లను 10 నిమిషాల పాటు మరిగించిన తరువాత స్టవ్ ఆఫ్ చేసి నీటిని వడకట్టి ఒక గ్లాస్ లోకి తీసుకోవాలి. ఇలా చేయడం వల్ల దాల్చిన చెక్క కషాయం తయారవుతుంది. ఈ కషాయాన్ని గోరు వెచ్చగా లేదా చల్లగా అయిన తరువాత కూడా తీసుకోవచ్చు. అలాగే ఈ కషాయాన్ని రోజూ ఉదయం పరగడుపున తీసుకోవాలి. ఉదయం వీలు పడని వారు సాయంత్రం పొట్ట కాలిగా ఉన్న సమయంలో తీసుకోవాలి. దాల్చిన చెక్క కషాయాన్ని తీసుకోవడం వల్ల ఏకాగ్రత పెరుగుతుంది. జ్ఞాపక శక్తి పెరుగుతుంది. వైరల్ ఇన్ఫెక్షన్స్ తో బాధపడుతున్నప్పుడు ఇలా దాల్చిన చెక్క కషాయాన్ని తీసుకోవడం వల్ల మంచి ఫలితం ఉంటుంది.
ఈ కషాయాన్ని తాగడం వల్ల శరీరంలో రోగ నిరోధక శక్తి పెరిగి మనం ఇన్ఫెక్షన్స్ బారిన పడకుండా ఉంటాం. షుగర్ వ్యాధితో బాధపడుతున్న వారు ఈ కషాయాన్ని తాగడం వల్ల రక్తంలో చక్కెర స్థాయిలు నియంత్రణలో ఉంటాయి. అలాగే దాల్చిన చెక్కలో యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. దీనిని వాడడం వల్ల క్యాన్సర్ బారిన పడే అవకాశాలు కూడా తక్కువగా ఉంటాయి. దంతాల నొప్పులతో బాధపడే వారు దాల్చిన చెక్క కషాయాన్ని నోట్లో పోసుకుని పుక్కిలించి ఉమ్మి వేయాలి. ఇలా చేయడం వల్ల దంతాల నొప్పులు తగ్గుతాయి. ఈ విధంగా దాల్చిన చెక్క మనకు ఎంతగానో ఉపయోగపడుతుందని దీనిని వాడడం ప్రతి ఒక్కరు అలవాటు చేసుకోవాలని ఆయుర్వేద నిపుణులు చెబుతున్నారు.