షుగర్ వ్యాధి ఒకేసారి మనకు తెలియకుండా వచ్చేది కాదు. ముందుగా రోగ లక్షణాలు తెలుస్తాయి. అంతేకాక, కుటుంబంలో డయాబెటీస్ తల్లి లేదా తండ్రికి వుంటే కూడా దాని ప్రభావం పిల్లలపై పడే అవకాశం వుంది. ఈ వ్యాధి వస్తుందనుకున్నపుడు కొన్ని ముందు జాగ్రత్తలు తీసుకోవడం అవసరం. ప్రధానంగా వ్యాధి గురించిన అవగాహన కలిగి వుండాలి. దానికి తగిన వైద్యం, తాజాగా వస్తున్న వైద్య రంగ మార్పులు, సంబంధిత పరికరాలు తెలిసి వుండాలి.
అప్పటివరకు ఏ రకమైన ఆహారాలు తిన్నప్పటికి, సూచనలు కనిపించగానే ఆహారంలో మార్పులు చేయాలి. హానికరమైన ఉప్పు, కొవ్వు, షుగర్, ఆల్కహాలు వంటివి తొలగించాలి. ఆహార నియమాలతో పాటు కొద్దిపాటి వ్యాయామం లేదా నడక వంటివి మరింత సహకరించి వ్యాధిని దూరంగా వుంచే అవకాశాలు ఇస్తాయి.
నేటి రోజుల్లో గతంలో వలే, షుగర్ వ్యాధి నియంత్రణలకు, పరీక్షలకు లేబరేటరీల అవసరం కూడా లేదు. తాజాగా మార్కెట్ లో దొరికే డయాబెటీస్ నియంత్రణ పరికరాలు కొని ఇంటిలోనే ఎప్పటికపుడు షుగర్ స్ధాయిలను తెలుసుకొని నియంత్రించవచ్చు. వ్యాధి ముదిరిన తర్వాత కంటే వచ్చిన వెంటనే జీవన విధానాలు సరిచేసుకుంటే డయాబెటీస్ నియంత్రించటం, నివారణ కష్టమేమీకాదు.