Curd : పెరుగు, దీన్నే యోగర్ట్ అని కూడా అంటారు. భారతీయులు ఎంతో పురాతన కాలం నుంచే పెరుగును ఆహారంగా ఉపయోగిస్తున్నారు. దీంతో అనేక రకాల వంటకాలను కూడా చేస్తుంటారు. చాలా మంది పెరుగు తిననిదే భోజనం చేసినట్లు భావించారు. అనేక మంది పెరుగును తప్పనిసరిగా రోజూ తింటుంటారు. ఇది ప్రొబయోటిక్ ఆహారం. దీన్ని తింటే మనకు అనేక ఆరోగ్యకరమైన ప్రయోజనాలు కలుగుతాయి. పెరుగు మన శరీరానికి ఎంతగానో మేలు చేస్తుంది. పెరుగును తినడం వల్ల శరీర రోగ నిరోధక శక్తి పెరుగుతుంది. దీంతో జీర్ణక్రియ మెరుగు పడుతుంది. అయితే పెరుగు మన శరీరానికి మేలు చేసేదే అయినప్పటికీ కొన్ని ఆహారాలతో కలిపి తింటే మాత్రం అది విషంగా మారుతుంది. అవును, మీరు విన్నది నిజమే. ఇప్పుడు చెప్పబోయే ఆహారాలను ఎట్టి పరిస్థితిలోనూ పెరుగుతో కలిపి తినరాదు. మరి ఆ ఆహారాలు ఏమిటో ఇప్పుడు తెలుసుకుందామా.
కొందరు చేపల వేపుడు లేదా పులుసు తిన్నాక వెంటనే పెరుగుతో భోజనం చేస్తారు. ఇలా అస్సలు తినకూడదు. ఇవి రెండూ విరుద్ధ స్వభావం కల ఆహారాలు. దీంతో మీ పొట్టలో అసౌకర్యం ఏర్పడే అవకాశం ఉంటుంది. అలాగే జీర్ణ సమస్యలు వస్తాయి. అజీర్తి వచ్చే చాన్స్ ఉంటుంది. ఈ రెండింటినీ వెంట వెంటనే తినడం వల్ల అజీర్తి ఏర్పడే అవకాశం ఉంటుందని ఆయుర్వేదం చెబుతోంది. చేపలు, పెరుగు కలిపి తింటే శరీరంలో విషం తయారవుతుందట. కనుక ఈ రెండింటినీ కలిపి తినరాదు.
మామిడి పండ్లను కూడా పెరుగుతో కలిపి తినరాదు. మామిడి పండ్లు సహజంగానే వేడి చేసే స్వభావం కలవి. పెరుగు మన శరీరానికి చలువ చేస్తుంది. ఇవి రెండూ విరుద్ధ స్వభావం ఉన్న ఆహారాలు. కనుక ఈ రెండింటినీ కూడా కలిపి తినరాదు. తింటే జీర్ణక్రియ మందగిస్తుంది. చర్మ సమస్యలు వస్తాయి. ఉల్లిపాయలను చాలా మంది పెరుగులో నంజుకుని తింటారు. కానీ ఆయుర్వేదం ప్రకారం ఈ రెండింటినీ కలిపి తినకూడదట. తింటే శరీరంలో వేడి ఉత్పత్తి అవుతుంది. జీర్ణ సమస్యలు వస్తాయి. కడుపు ఉబ్బరం, కడుపు నొప్పి వచ్చే అవకాశాలు ఉంటాయి. కాబట్టి పెరుగు, ఉల్లిపాయలను కలిపి తినరాదు.
పాలు, పెరుగు రెండూ ఒకే జాతికి చెందినవి. అయినప్పటికీ రెండింటినీ ఒకేసారి తీసుకోరాదు. తీసుకుంటే అసిడిటీ, గుండెల్లో మంట వచ్చే అవకాశాలు ఉంటాయి. పాల ఉత్పత్తులు వేటినీ కూడా కలిపి తీసుకోకూడదు. అలాగే నూనె లేదా కొవ్వు పదార్థాలతోనూ పెరుగును కలిపి తినరాదు. తింటే జీర్ణం అయ్యేందుకు సమయం పడుతుంది. దీంతో అజీర్తి, విరేచనాలు అయ్యే అవకాశాలు ఉంటాయి. కాబట్టి పెరుగును ఎట్టి పరిస్థితిలోనూ ఈ ఆహారాలతో కలిపి తినకూడదు.