ప్రస్తుత తరుణంలో చాలా మందికి నిద్ర సరిగ్గా ఉండడం లేదు. నిత్యం అనేక సందర్భాల్లో ఎదుర్కొంటున్న ఒత్తిడి కారణంగా చాలా మందికి రాత్రి పూట నిద్ర అసలు రావడం లేదు. దీంతో ఆలస్యంగా నిద్రిస్తున్నారు. ఇది ఆరోగ్యంపై కూడా ప్రభావం చూపుతోంది. అయితే పడుకున్న వెంటనే గాఢ నిద్ర పట్టాలంటే అందుకు గాను కొన్ని పానీయాలు ఎంతగానో ఉపయోగపడతాయి. వీటిని తాగడం వల్ల నిద్ర చక్కగా పడుతుంది. నిద్ర లేమి నుంచి బయట పడవచ్చు. ఇక ఆ పానీయాలు ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం.
పాలు నిజంగా అమృతమే. ప్రకృతి మనకు ప్రసాదించిన గొప్ప వరం పాలు. భారత ఆయుర్వేద విజ్ఞానశాస్త్రం తెలిపిన దాని ప్రకారం, గాఢనిద్రకు గోరువెచ్చని పాలు ఎంతో ఉపకరిస్తాయి. ఆధునిక శాస్త్ర ప్రకారం కూడా, నిద్రలేమికి ప్రధానకారణం కాల్షియం లోపం. పాలల్లో పుష్కలంగా కాల్షియం లభించడంతో పాటు, మానసిక ప్రశాంతత, ఉల్లాసాన్ని కలిగించే ఒక ప్రత్యేక రసాయనం ‘సెరొటోనిన్’ కూడా ఉంటుంది. ఇవి రెండు సుఖనిద్రకు చాలా దోహదపడతాయి. నిద్రపోయేముందు పాలు తాగడం అలవాటు చేసుకోండి. 2006లో చేసిన ఒక పరిశోధన ప్రకారం, మెగ్నీషియం లోపం మనిషిలో కుంగుబాటును, ఆత్రుతను పెంచుతుంది. ఇవి మనకు నిద్ర పట్టకుండా చేస్తాయి. కొబ్బరినీళ్లలో మెగ్నీనిషియం విరివిగా లభిస్తుంది. పడుకునేముందు కొబ్బరినీళ్లు తాగితే మనసు నెమ్మదించి, ప్రశాంతత లభిస్తుంది. తద్వారా మంచి నిద్రపట్టే అవకాశముంటుంది.
అరటిపండ్లు ఇష్టపడనివారు బహుశా ఎవరూ ఉండరు. మామూలుగానే చాలామందికి పొద్దున్నే పాలల్లో అరటిపండు కలుపుకుని తినే అలవాటుంటుంది. దీన్ని కాస్తా రాత్రికి మార్చి, మిల్క్‌షేక్‌లా చేసుకుంటే ఇంకా బాగుంటుంది. అరటిపండ్లలో పుష్కలంగా ఉండే పొటాషియం, మెగ్నీషియంతో పాటు, ‘ట్రిప్టోఫాన్’ అనబడే ఒక అమినోయాసిడ్ కూడా ఉంటుంది. ఈ ట్రిప్టోఫాన్ కూడా పాలల్లో ఉండే సెరొటోనిన్‌ను తయారుచేస్తుంది. పాలతో కలపడం వల్ల సెరొటినిన్ ఎక్కువగా లభించి, మంచి నిద్ర పడుతుంది. పాలల్లో అరటిపండు ముక్కలు వేసి, కొంచెం తేనె గానీ, పంచదార కానీ కలిపి మిక్సీ పట్టేస్తే, ఎంతో రుచికరమైన బనానా మిల్క్‌షేక్ రెడీ. ఇంకెందుకు ఆలస్యం.
బాదంపప్పులు, బాదంపాలు తెలియనివారుండరు. వేసవికాలంలో బయట బండ్లమీద, స్వీటుషాపుల్లో అమ్మే బాదంపాలు చాలామంది తాగుంటారు. సరే… అది ఎటువంటి వాతావరణంలో తయారుచేస్తారో మనకి తెలియందికాదు. దాన్నే మనమే స్వయంగా చేసుకుంటే పోలా..! బాదంపాలల్లో ఎన్నో విలువైన పోషకాలున్నాయి. డిప్రెషన్, టెన్షన్‌లను తగ్గించడంలో ఎంతో ఉపయోగపడతాయి. ఆ పాలల్లో కొంచెం కుంకుమపువ్వు వేస్తే పరిపూర్ణం. కుంకుమపువ్వులో నాడీవ్యవస్థను సక్రమంగా నియంత్రించే రసాయనముంటుంది. బాదంపాలల్లో కలిసినప్పుడు ఇంకా చాలా ప్రభావవంతంగా మారుతుంది. నిద్రకు ముందు ఇది కూడా దివ్వమైన పానీయం. చామంతి చాయ్ వెరైటీగా ఉంటుంది. గడ్డిచామంతి తెలుసు కదా. దాన్నే వాడాలి మనం. రెండు మూడు పూలు తెంపి, నీళ్లలో మరిగించి తయారుచేసేదే చామంతి చాయ్. చాలా పవర్‌ఫుల్ అండోయ్. కొంచెం తేనె కలుపుకున్నా పరవాలేదు. ఏం లేకుండా తాగితే ఇంకా బెటర్. చామంతిలో అపిజెనిన్ అనే ఫ్లేవనాయిడ్లు ఉంటాయి. ఇది నిద్రను బాగా ప్రోత్సహిస్తుంది.