Brown Rice : అధిక బరువు అనేది ప్రస్తుతం చాలా మందికి సమస్యగా మారింది. దాన్ని తగ్గించుకునేందుకు అందరూ నానా అవస్థలు పడుతున్నారు. డైట్‌లో మార్పులు చేసుకోవడంతోపాటు రోజూ వ్యాయామం కూడా చేయాల్సి వస్తోంది. అయితే అధిక బరువును తగ్గించేందుకు బ్రౌన్ రైస్ అద్భుతంగా పనిచేస్తుందని చెప్పవచ్చు. బ్రౌన్ రైస్‌ను రోజూ తినడం వల్ల మనకు అనేక లాభాలు కలుగుతాయి.
సాధారణ రైస్‌కు బదులుగా బ్రౌన్ రైస్‌ను తింటే మనకు ఫైబర్ లభిస్తుంది. ఇది జీర్ణ సమస్యలను తగ్గిస్తుంది. గ్యాస్, అసిడిటీ, మలబద్దకం వంటి సమస్యల నుంచి ఉపశమనం లభిస్తుంది. బ్రౌన్ రైస్‌ను తినడం వల్ల అందులో ఉండే ఫైబర్ ఎక్కువ సేపు ఉన్నా ఆకలి వేయకుండా చేస్తుంది. దీంతో తినే ఆహారం తగ్గుతుంది. ఫలితంగా అధిక బరువును తగ్గించుకోవడం సులభతరం అవుతుంది.
సాధారణ వైట్ రైస్‌తో పోలిస్తే బ్రౌన్ రైస్‌లో అనేక పోషకాలు ఉంటాయి. ఇవి మనకు పోషణను అందిస్తాయి. బ్రౌన్ రైస్‌ను తినడం వల్ల షుగర్ లెవల్స్ అమాంతం పెరగవు. దీంతో షుగర్ కంట్రోల్‌లో ఉంటుంది. ఇది డయాబెటిస్ ఉన్నవారికి ఎంతగానో మేలు చేసే విషయం.
ఇక అధిక బరువు తగ్గాలనుకునే వారు బ్రౌన్ రైస్‌ను ఎప్పుడు తినాలి ? అని సందేహిస్తుంటారు. అయితే దీనికి నిపుణులు ఏమని సమాధానం చెబుతున్నారంటే.. బ్రౌన్ రైస్‌ను మధ్యాహ్నం సమయంలో తినడం వల్ల అధిక బరువు తగ్గుతారట. ఎందుకంటే ఆ సమయంలో మన మెటబాలిజం చాలా ఎక్కువగా ఉంటుంది. ఏం తిన్నా ఇట్టే సులభంగా జీర్ణమవుతుంది. కనుక బ్రౌన్ రైస్‌ను తింటే సులభంగా జీర్ణం అవడమే కాదు.. ఎక్కువ సేపు ఉన్నా ఆకలి వేయదు. దీంతో సాయంత్రం స్నాక్స్ తినరు. ఇది బరువు తగ్గేందుకు సహాయ పడుతుంది.
అలాగే బ్రౌన్ రైస్ లో ఉండే ఫైబర్ ఆకలిని నియంత్రిస్తుంది. దీని వల్ల కూడా తిండిపై యావ తగ్గుతుంది. బ్రౌన్ రైస్‌ను మధ్యాహ్నం తినడం వల్ల శరీర మెటబాలిజం పెరిగి క్యాలరీలు ఖర్చవుతాయి. దీంతో అధిక బరువు తేలిగ్గా తగ్గుతారు. కాబట్టి బ్రౌన్ రైస్‌ను మధ్యాహ్నం తినడం మేలు.