దైవాన్ని పూజించే వారు సహజంగానే ఉపవాసం చేస్తుంటారు. హిందూ సంప్రదాయంలో భక్తులు తమ ఇష్ట దైవాలకు అనుగుణంగా ఆయా రోజుల్లో ఉపవాసాలు ఉంటారు. ఇక ముస్లింలు కూడా రంజాన్ మాసంలో ఉపవాసం ఉంటారు. అయితే ఉపవాసం ఉండడం అన్నది నిజానికి మనకు మంచిదే. దాని వల్ల ఆరోగ్యకరమైన ప్రయోజనాలే కలుగుతాయి. వారానికి కనీసం ఒక్క రోజు అయినా సరే ఉపవాసం ఉండడం వల్ల అనేక అద్భుతమైన ప్రయోజనాలు కలుగుతాయి. అవేమిటో ఇప్పుడు తెలుసుకుందాం.
1. వారంలో కనీసం ఒక్క రోజు ఉపవాసం చేసినా చాలు ఆయుర్దాయం పెరుగుతుందని సైంటిస్టులు చేపట్టిన అధ్యయనాలు వెల్లడిస్తున్నాయి.
2. ఉపవాసం ఉండడం వల్ల శరీరం ఇన్సులిన్‌ను సరిగ్గా గ్రహిస్తుంది. మెటబాలిజం మెరుగు పడుతుంది. డయాబెటిస్ అదుపులో ఉంటుంది.
3. ఉపవాసం చేయడం వల్ల రోగ నిరోధక శక్తి పెరుగుతుంది. శరీరం తనకు తాను మరమ్మత్తులు చేసుకునేందుకు కావల్సినంత సమయం లభిస్తుంది. కనుక అనారోగ్య సమస్యలు తగ్గుతాయి. ముఖ్యంగా జీర్ణవ్యవస్థ పనితీరు మెరుగు పడుతుంది. గ్యాస్, మలబద్దకం తగ్గుతాయి. అజీర్ణం నుంచి బయట పడవచ్చు.
4. ఉపవాసం ఉండడం వల్ల ఒత్తిడి, ఆందోళన తగ్గుతాయి. ఆకలి నియంత్రణలో ఉంటుంది. అధిక బరువును తగ్గించుకోవడం తేలికవుతుంది.
5. ఉపవాసంతో హైబీపీ తగ్గుతుంది. గుండె జబ్బులు రాకుండా నివారించవచ్చు. కీళ్లు ఆరోగ్యంగా ఉంటాయి. అందువల్ల వారానికి ఒక్కసారి అయినా సరే ఉపవాసం చేయాలని వైద్యులు చెబుతున్నారు.